మా ఇంటి ఓనర్ నాకో గిఫ్ట్ ఇచ్చాడు: నెట్టింట సంచలనంగా వ్యక్తి పోస్ట్..
ABN, Publish Date - Aug 23 , 2024 | 12:11 PM
ఇంటి ఓనర్స్ అంటే సాధారణంగా ఎలా ఉంటారు? గోడకు మేకులు కొట్టొద్దు.. ఇంటికి ఎవరినీ తీసుకురావొద్దు.. ఏడాదికోసారి రెంట్ పెంచేస్తామంటూ సవాలక్ష రూల్స్ పెడతారు
బెంగుళూరు: ఇంటి ఓనర్స్ అంటే సాధారణంగా ఎలా ఉంటారు? గోడకు మేకులు కొట్టొద్దు.. ఇంటికి ఎవరినీ తీసుకురావొద్దు.. ఏడాదికోసారి రెంట్ పెంచేస్తామంటూ సవాలక్ష రూల్స్ పెడతారు. కానీ తన ఇంటి యజమాని మాత్రం చాలా భిన్నమైన వ్యక్తి అని.. మంచితనానికి మారు పేరు అని ఆ ఇంట్లో అద్దెకు ఉండే అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంటి యజమాని ఔదార్యం గురించి తెలుసుకుని నెటిజన్లు అవాక్కవుతున్నారు. బెంగుళూరులోని ఒక వృద్ధ యజమాని గురించి అద్దెకు ఉండే వ్యక్తి ఒక హృదయాన్ని హత్తుకునే పోస్ట్ పెట్టాడు. ఐదేళ్లుగా అదే ఇంట్లో అతను ఉంటున్నాడట. తన ఇంటి ఓనర్ తన కోసం ఇవాళ డిన్నర్ కొని తెచ్చాడంటూ పోస్ట్ పెట్టాడు. ఈ ఐదేళ్లలో ఏనాడు కూడా తనను అద్దె పెంచమని తన ఇంటి యజమాని అడగలేదని అతను తెలిపాడు.
‘‘ మా ఇంటి యజమాని వయస్సు 65 ఏళ్లకు పైనే.. నేను గత ఐదు సంవత్సరాలుగా అతని ఇంట్లో అద్దెకు ఉంటున్నా. ఇవాళ అతను ఒక డిన్నర్ పార్శిల్‌ను నాకు గిఫ్ట్‌గా తీసుకుని ఇంటికి వచ్చాడు. నా కోసం డిన్నర్ కొని తెచ్చానని చెప్పాడు. అది చూశాక నాకు మాటలు రాలేదు. తను ఆ వయసులో ఉండి నాకు డిన్నర్ కొని తీసుకురావడం ఆశ్చర్యంగా అనిపించింది. మా ఇంటి యజమాని చాలా మంచి వ్యక్తి. సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఐదేళ్లలో ఏనాడూ నన్ను రెంట్ పెంచి ఇవ్వమని అడగలేదు’’ అని అద్దెకు ఉండే వ్యక్తి పోస్ట్ పెట్టాడు. 2018లో తను ఆ ఇంట్లోకి వచ్చాడట. ఎప్పుడూ తన యజమాని తనతో చాలా చక్కగా మాట్లాడుతుంటాడని.. తన జీవిత కథలను వివరిస్తూ ఉంటాడని తెలిపాడు. అలాగే తన కుమార్తె గురించి కూడా చాలా గొప్పగా చెబుతుంటాడట.
అప్పుడప్పుడు ఏదైనా ప్రత్యేక సందర్భంలో డ్రింక్ కూడా ఆఫర్ చేస్తుంటాడట. కానీ తాను సున్నితంగా తిరస్కరిస్తుంటానని చెప్పాడు. కానీ ఈరోజు ఆయన తనకు ఇచ్చిన బహుమతిని మాత్రం చాలా ఆనందంగా స్వీకరించానని తెలిపాడు. దేవుడు ఆయనను చల్లగా చూడాలని కోరాడు. ఈ పోస్టుకు పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఆ పోస్ట్‌పై స్పందించిన ఒక నెటిజన్.. తన ఇంటి ఓనర్ 2016లో తాము ఆ ఇంటికి వచ్చినప్పుడు తనకు, తన స్నేహితులకు సామాన్లను సర్దుకోవడంలో సహకరించిందని.. అలాగే లంచ్ కూడా పంపించిందని చెప్పాడు. మరో నెటిజన్ బెంగుళూరులో ఒక మంచి ఇంటి యజమాని దొరకడం చాలా అరుదని చెప్పాడు. బెంగుళూరులో తన పాత ఇంటి యజమాని తమ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్ సమస్యల కారణంగా తన వస్తువులు పాడైపోతే.. తాను ఆమెను అడగకుండానే.. తనకు ఒక కొత్త మ్యాక్‌బుక్ ఛార్జర్ కేబుల్, అడాప్టర్ కోసం డబ్బు ఇచ్చిందని తెలిపాడు. అంత మంచి ఇంటి యజమానిని తాను మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి నెట్టింట ఇంటి ఓనర్ ఔదార్యానికి సంబంధించిన పోస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Updated Date - Aug 23 , 2024 | 12:11 PM