థర్టీస్ తడాఖా..!
ABN, Publish Date - Dec 22 , 2024 | 07:09 AM
ఒకప్పటిలా కాదిప్పుడు! చిన్న వయసులోనే సంచలనాలు, రికార్డులు బద్దలు కొట్టేస్తున్న తరం ఇది. డక్కామొక్కీలు తింటే యాభైఏళ్లకు వచ్చే అనుభవాన్ని కాదని.. క్యాంపస్ క్యాంటీన్లలో స్టార్టప్‌లను నెలకొల్పే స్థాయికి చేరుకున్నారు యువతీయువకులు.
ఒకప్పటిలా కాదిప్పుడు! చిన్న వయసులోనే సంచలనాలు, రికార్డులు బద్దలు కొట్టేస్తున్న తరం ఇది. డక్కామొక్కీలు తింటే యాభైఏళ్లకు వచ్చే అనుభవాన్ని కాదని.. క్యాంపస్ క్యాంటీన్లలో స్టార్టప్‌లను నెలకొల్పే స్థాయికి చేరుకున్నారు యువతీయువకులు. పాతికేళ్లకే పాతతరం ఊహించనంత పైపైకి దూసుకెళ్లే నైపుణ్యం వీరి సొంతం. అందుకే పట్టుమని ముప్పయి ఏళ్లు కూడా లేని వీళ్లందరూ... పెద్ద పెద్ద విజయాలు సాధించారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తింపు పొందారు. థర్టీస్‌లో తడాఖా చూపించిన ఆ విజేతల ప్రయాణం ఇలా సాగింది...
అక్కనే స్ఫూర్తి..
‘‘మనం పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు. ఎలాంటి శిక్షణ కూడా అవసరం లేదు. ఏ తత్వవేత్తనో మనకు జ్ఞానోదయం కలిగించడు. మన ఊరిలో, మన కాలనీలో.. ఆ మాట కొస్తే మన ఇంట్లోని వాళ్ల నుంచే స్ఫూర్తి పొందవచ్చు.. నేర్చుకునే గుణం ఉంటే..!’’ ఏదో పుస్తకం తిరగేస్తుంటే ఆ పేజీ దగ్గర ఆగింది సీతాలక్ష్మి నారాయణన్. మళ్లీ రెండోసారి చదివింది.
‘అవును, నిజమేగా!. నా అక్క సాధించిన విజయం ఇన్నాళ్లూ ఎందుకు అంత అద్భుతంగా అనిపించలేదు..? ఆమెను నేనెందుకు స్ఫూర్తిగా తీసుకోలేదు?’’ అనిపించింది. సోదరి చార్టెడ్ అకౌంటెంట్ కోసం చదువుతోందప్పుడు. వెంటనే వెళ్లి ‘అక్కా.. నువ్వేనాకు ఇన్సిపిరేషన్. నేను కూడా సీఏ పూర్తి చేస్తా’’ అంది. ‘నీకు మనస్ఫూర్తిగా ఇష్టమనిపిస్తే తప్పకుండా చదువు’ అని సలహా ఇచ్చిందామె. ఇక, సీతాలక్ష్మి ఆగలేదు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా పల్లసాన అనే చిన్న గ్రామంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఒప్పించి సీఏ కోచింగ్ కోసం ముంబయి వెళ్లిపోయింది. అష్టకష్టాలు పడి చదివింది. జాతీయ స్థాయిలో 35 వ ర్యాంకు సాధించి.. చార్టెడ్ అకౌంటెంట్ అయ్యింది.
అప్పటికే తన సోదరి దుబాయ్‌లోని బ్రిటిష్ ఆర్కేడ్ నర్సరీలో పనిచేస్తోంది. భారత్‌లోనే అపార అవకాశాలున్న ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో చేరింది. ఇన్వెస్టెక్, ట్రూనార్త్ వంటి కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో బెంగళూరులోని ప్రఖ్యాత ‘ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌మెంట్’లో చేరిందామె. అదొక ఆర్థిక సేవలు అందించే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ నుంచి ఆ కంపెనీకి నిధులు వస్తాయి. ‘ఇలాంటి ఉద్యోగాలు, విజయాలు అందరూ సాధిస్తారు. ఇందులో వింతేముంది?’ అనేంత చిన్న సక్సెస్ కాదు ఇది. 17 ఏళ్ల కంపెనీ చరిత్రలో ఇంత చిన్న వయసులో వైస్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి మరొకరు లేకపోవడం విశేషం. చిన్న వయసులోనే సీతాలక్ష్మి నారాయణన్ సాధించిన విజయం అసాధారణం.
అదీ అతడి ‘ట్రాక్’ రికార్డ్..
‘‘నీకేమన్నా మెదడు పనిచేస్తోందా? నువ్వు మాట్లాడే మాటలకు.. నీ చదువుకు పొంతన ఉందా? ఇంత పేరున్న ఢిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదువుతూ.. పోయి పోయి లారీలు, ట్రక్కుల వ్యాపారం చేస్తానంటున్నావు..? మనోళ్లలో నువ్వొక్కడివే ఇలా ఆలోచిస్తున్నావు..’’ క్యాంటీన్‌లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న ఫ్రెండ్స్ అందరూ ఉద్దవ్‌కుమార్‌పై మూకుమ్మడి దాడి చేసినంత పనిచేశారు. ‘‘ఇలాంటి బిజినెస్ చేయాలని నిన్ననే డిసైడ్ అయ్యాను. ఇక ఆలోచన మారదు.
వదిలేయండి ప్లీజ్..’’ అన్నాడు ఉద్దవ్. మళ్లీ అతనే కలుగజేసుకుంటూ ‘‘అవసరాల్లో నుంచే ఆలోచనలు పుడతాయి. మూడు రోజుల కిందట మా బంధువుల ఇంటికి వెళ్లాను. వాళ్ల సరుకుల లోడ్ ఎంతకూ రాకపోవడంతో కంగారు పడుతున్నారు. అదెక్కడుందో తెలుసుకోవడానికి డ్రైవర్ ఫోన్ తీయడం లేదు. ట్రాక్ చేసే టెక్నాలజీ లేదు. అప్పుడే నాకీ ఐడియా తట్టింది’’ అని వివరంగా చెప్పాడు. అప్పటి వరకు ఉచిత సలహాలు ఇచ్చిన స్నేహితులు పునరాలోచనలో పడ్డారు. అలా ఉద్దవ్ ప్రారంభించిన సంస్థ ‘లింకిట్’. సప్లయ్ చెయిన్ ద్వారా లాజిస్టిక్ నిర్వహణ చేపడుతుంది. అంటే- ఒక చోట లోడ్‌తో బయలుదేరిన వాహనం.. గమ్యస్థానం చేరేవరకు ట్రాక్ చేస్తుంది లింకిట్.
ఢిల్లీలో ఆర్థికశాస్త్రం ఫైనలియర్‌లో ఉన్నప్పుడు ఉద్దవ్‌కు ఈ ఆలోచన వచ్చింది. వెంటనే రవాణారంగానికి పేరున్న నగరాలకు వెళ్లి.. లారీల కంపెనీలు, యజమానులు, డ్రైవర్లు, వినియోగదారులు అందర్నీ కలిసి ఒక నివేదిక తయారుచేసుకున్నాడు. రవాణాలోని సాధకబాధకాలన్నీ అర్థమయ్యాయి. ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించి, కొందరు సాంకేతిక నిపుణులను నియమించుకున్నాడు. ప్రతీ వాహనానికీ జీపీఎస్ ట్రాక్‌లు అమర్చడం.. వాటి కదలికను నిరంతరం ఆఫీసులోని పెద్ద పెద్ద మానిటర్లపై పర్యవేక్షించడం..
ఎప్పటికప్పుడు వాహనం ఎక్కడుందో యజమానికి, సరుకు తీసుకునేవారికి తెలియజేయడం.. ఇదే ఉద్యోగుల పని. ఈ నిర్వహణకే ప్రత్యేకంగా ఆరు సాఫ్ట్‌వేర్‌లను తయారుచేయించాడు ఉద్దవ్. అప్పటికి అమెరికాలో ఉన్న తన సోదరి కూడా ఇండియాకొచ్చి.. లింకిట్‌లో చేరింది.. ఆమె ఐటీ విభాగం బాధ్యతలు చూసుకుంది. మెల్లమెల్లగా కస్టమర్ల సంఖ్య పెరిగింది. చూస్తుండగానే కంపెనీ విస్తరించింది. ఇప్పుడు రవాణారంగానికి సంబంధించిన సుమారు 175 రకాల సేవలు అందిస్తూ.. రోజూ పదిహేను వేల నుంచి ఇరవై వేల ట్రిప్‌లను ట్రాక్ చేస్తోందీ సంస్థ. శాంసంగ్, ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్, సీమెన్స్, మహీంద్రా లాజిస్టిక్స్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలన్నింటికీ లింకిట్ సేవలు అందిస్తోంది.
‘స్పెషాలిటీ..’ ఉన్నోడు ..
కొందరంతే ప్రత్యేకం!. అందరూ ఆలోచించినట్లు ఆలోచించరు. అందరూ నడిచిన దోవలో కూడా నడవరు. ఏం చేసినా ప్రత్యేకమే!. వాళ్ల బుర్రలోనే ఆ ‘స్పెషాలిటీ’ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే వీరిలో దూకుడు కూడా ఎక్కువే!. ముప్పయి ఏళ్ల లోపు వయసున్న శ్రేయాస్‌చోప్రా అలాంటి ప్రత్యేకతలున్న ఔత్సాహికుడు. అందుకే అతడికి సవాళ్లతో కూడిన ‘స్పెషాలిటీ కెమికల్స్’ ఉత్పత్తినే ఎంచుకున్నాడు. కారణం.. అతడికి బాగా తెలుసు. ఈ ప్రత్యేక రసాయనాల తయారీలో మనదేశం వెనకబడింది కాబట్టి. స్పెషాలిటీ కెమికల్ అంటే అదేమీ బ్రహ్మపదార్థం కాదు. అలాగని సులువుగా తయారయ్యే డిటర్జంట్ పౌడర్ కాదు. వీటిని ఉత్పత్తి చేయడానికి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, అత్యాధునిక ప్రయోగశాలలు అవసరం.
అందుకు తగ్గట్టు పెట్టుబడులు కూడా భారీగా ఉండాల్సిందే!. వీటికి అన్ని దేశాల్లో డిమాండ్ అధికం కాబట్టి.. లాభాలూ అలాగే ఉంటాయి. మనం ధరించే జీన్సు ప్యాంటు, ఇల్లు శుభ్రం చేసే లిక్విడ్, ముఖానికి రాసుకునే క్రీములు, కాళ్లకు తొడుక్కునే బూట్లు, నీళ్లను శుద్ధి చేసే యంత్రాలు.. మందులు, టానిక్‌లు, ఆహారపదార్థాలు.. ఇలా ఒక్కటని కాదు. ప్రతీదాంట్లో ఈ స్పెషాలిటీ కెమికల్స్‌ను వాడతారు. ఇంత డిమాండ్ కలిగిన ఈ రసాయనాల తయారీలో చైనా ముందంజలో ఉంది. ఆ తర్వాత అమెరికా, జర్మనీ, జపాన్‌లున్నాయి. భారత్ వాటా కేవలం 4.3 శాతం మాత్రమే!. ఈ రంగంలో మనమెందుకు ఇంత వెనుకబడ్డాం? అని మనం బాధపడినట్లే.. శ్రేయాస్‌చోప్రా కూడా మదనపడ్డాడు. అతడు స్వతహాగా చార్టెడ్ అకౌంటెంట్. జమాఖర్చులు, పన్నులు, లాభనష్టాల అంకెలతో కుస్తీపట్టే వాణిజ్యశాస్త్ర నిపుణుడు. ఆ అనుభవంతోనే ‘ఎంస్టాక్’ సంస్థను ఏర్పాటు చేశాడు.
అంతకు మునుపు సంగీత సంస్థతోపాటు బీటుబీ (బిజినెస్ టు బిజినెస్)లను నిర్వహించిన అనుభవం ఉంది. కాబట్టి ఎంస్టాక్‌ను తక్కువ సమయంలోనే పరుగులు పెట్టించాడు. బెంగళూరు, హూస్టన్, ముంబయి, హైదరాబాద్‌లలోని శాఖలు చురుగ్గా పనిచేశాయి. వెంచర్‌క్యాపిటలిస్టులు కూడా భారీ పెట్టుబడులు పెట్టారు. అమెరికా, మధ్య ప్రాచ్యదేశాలతో పాటు దక్షిణ అమెరికా, ఆసియాలకు స్పెషాలిటీ కెమికల్స్‌ను ఎగుమతి చేసే స్థాయికి చేరింది ఎంస్టాక్. ఆయిల్, గ్యాస్, కోటింగ్స్, వాటర్ ట్రీట్‌మెంట్, హోమ్‌కేర్, పర్సనల్‌కేర్, ఆగ్రోకెమికల్స్, ఫార్మసూటికల్స్‌లలో వాడే ప్రత్యేక రసాయనాలను ఈ సంస్థ తయారుచేస్తోంది. తన సేవలను పది దేశాలకు విస్తరించింది. ఆఖరికి శ్రేయాస్ తన స్పెషాలిటీని నిరూపించుకున్నాడు. భవిష్యత్తులో ఎంస్టాక్ మరింత ఎత్తుకు ఎదిగేందుకు అవకాశం ఉంది.
కంపెనీని పరుగులు పెట్టించాడు..
ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్స్‌మయం అయిపోయిందిప్పుడు. ఇతరులకు క్షణాల్లో డబ్బులు పంపొచ్చు. ఆన్‌లైన్‌లో అంతే వేగంతో పేమెంట్స్ చేయొచ్చు. ఇక కొనుగోళ్లు అయితే సరేసరి. భవిష్యత్తులో కూడా ఆన్‌లైన్‌పేమెంట్స్ అంతకంతకు పెరుగుతాయే తప్ప తగ్గవు. కానీ ఇందులో సమస్యలు కూడా ఉన్నాయి. మనం క్రెడిట్‌కార్డులు, డెబిట్‌కార్డులు, పేమెంట్‌లింక్‌ల ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు.. మన సమాచారానికి భద్రత ఉంటుందా? డబ్బులు సురక్షితంగా చేరతాయా? మధ్యలో ఎలాంటి ఇబ్బందులూ రావా? అంటే.. ఇప్పటికీ సమస్యలు ఉన్నాయనే చెప్పవచ్చు. అందుకే వినియోగదారులకు... సంస్థలకు మధ్యలో పేమెంట్స్ గేట్‌వేలు వచ్చాయి.
అలా దూకుడుగా వచ్చిన కంపెనీ ‘రేజర్‌పే’. అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన శశాంక్‌కుమార్, మిత్రుడు హర్షిల్ మాథ్యూర్‌తో కలిసి ఈ సంస్థను నెలకొల్పారు. అయితే కంపెనీని పరుగులు పెట్టించగల సమర్థుడి కోసం ఎదురుచూశారు వాళ్లు. అప్పుడు దొరికిన నైపుణ్యవంతుడు విష్ణు ఆచార్య. ప్రఖ్యాత ఇండియన్ బిజినెస్ స్కూల్‌లో చదివిన అతడు కంపెనీ కార్పొరేట్ వ్యూహకర్తగా వచ్చాడు. రావడం రావడంతోనే కొత్త రంగాలను, కొత్త మార్కెట్లను అన్వేషించి.. రేజర్‌పే ప్రపంచాన్ని విస్తరించాడు. సంస్థ శరవేగంగా దూసుకెళ్లింది. భవిష్యత్తులో పేరున్న ఫిన్‌టెక్ కంపెనీల జాబితాలో చేరేందుకు సిద్ధమైంది. అదంతా విష్ణు ఆచార్య చలవే!.
ఇమేజ్‌ను రెట్టింపు చేశాడు..
‘‘నీకేం? మీ అమ్మ ఇప్పటికే పేరున్న ఫ్యాషన్ డిజైనర్!. ఆమెకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. నువ్వు ఈ రంగంలోకి రావడమే తరువాయి.. తక్షణం సక్సెస్ వచ్చేస్తుంది. మిగిలిన వాళ్లకు అలా కాదు. విపరీతమైన పోటీ ఉన్న ఫ్యాషన్‌డిజైనింగ్‌లో రాణించాలంటే.. కొన్నేళ్లు పడుతుంది.. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి’’ అని ఒకరిద్దరు కాదు. కాలేజీరోజుల నుంచి ఎంతోమంది స్నేహితులు పదేపదే అనే మాట ఇది. వినీవినీ ‘నిజమే కదా’ అనే పరిస్థితికి వచ్చాడు విశేష్ ఖన్నా. అతనికిప్పుడు 28 ఏళ్లు. తల్లి అనామికా ఖన్నా పేరున్న ఫ్యాషన్‌డిజైనర్. కలకత్తా నుంచి ముంబయి వరకు తెలియని వారుండరు. బాలీవుడ్ సెలబ్రిటీలు, వాణిజ్యవేత్తలు, ఖరీదైన వేడుకల్లో పాల్గొనే ప్రముఖులు, కుబేరుల కుటుంబాలకు అద్భుతమైన డిజైనర్ దుస్తులను అందించిన ఘనత ఆమెది. చాలామంది అనుకుంటారు కానీ.. అన్నిటికంటే ఈ రంగంలో పదిమంది మెప్పు పొందాలంటే చాలా కష్టం. ఫ్యాషన్స్‌ట్రెండ్స్ శరవేగంగా మారిపోతుంటాయి.
ఏ రోజు లెక్క ఆ రోజే!. కాలంతోపాటు పరిగెత్తాలి. మారుతున్న తరం అభిరుచులు, ఆసక్తులు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు వస్తున్న ధోరణుల్ని అందిపుచ్చుకుని, దేశీయ సంస్కృతిని మేళవించి ప్రత్యేక డిజైన్లను రూపొందించడం సవాలు. ఇలాంటి రంగంలో అనామికా ఖన్నా విజయం సాధించింది. ఇప్పుడా లెగసీని అందిపుచ్చుకుని అడుగుపెట్టాడు విశేష్. తను పేరుతెచ్చుకోవడం పక్కన పెడితే ‘అమ్మకున్న గుర్తింపును చెడగొట్టకపోతే చాలనిపించింది. అతనిప్పుడు నడుపుతున్న కంపెనీ ‘ఏకే-ఓకే’. అత్యంత విలాసవంతమైన, ఖరీదైన దుస్తుల్ని డిజైన్ చేస్తుందీ సంస్థ. రుతువులను బట్టి తేలికైన, సౌకర్యవంతమైన డిజైన్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతుంది. కాయిన్‌టాప్, డెనిమ్‌లాంగ్‌కోట్, కేప్‌షర్ట్స్, బ్లేజర్, అసిమెట్రిక్ జాకెట్‌లతో పాటు హైఎండ్ లగ్జరీ డిజైన్లను చేస్తోందీ సంస్థ.
‘‘ఇక్కడ ప్రతీదీ ఛాలెంజే! డిజైన్‌ను ఎంపిక చేసే దగ్గర నుంచి ప్రింటింగ్, బార్డర్స్, లైనింగ్స్, స్టిచ్చింగ్ వరకు జాగ్రత్తగా చేయాలి. ఈ తరం యువతుల ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా, సమకాలీన ధోరణికి దగ్గరగా డిజైన్ చేయడం సులభం కాదు..’’ అన్నాడు విశేష్. ఫ్యాషన్‌రంగంలోని పోటీని సవాలుగా స్వీకరించి..ఆఖరికి తల్లిపేరును నిలబెట్టాడు. కోల్‌కతా, ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, లూథియానా, లండన్, లాస్‌ఏంజిల్స్‌లలో ‘ఏకే-ఓకే’ షోరూంలు వెలిశాయి. ఫ్యాషన్ మార్కెట్ అంతరంగాన్ని పసిగట్టి ఎప్పటికప్పుడు నిత్యనూతన డిజైన్లతో బ్రాండ్‌ఇమేజ్‌ను రెట్టింపు చేశాడు విశేష్. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను స్వీకరించి.. కుటుంబం పేరు నిలబెట్టాడు. శభాష్ అన్నారంతా!.
వంద ఉత్పత్తులతో..
‘‘బయటికి వెళ్లినప్పుడల్లా ఏదో ఒక ప్యాకెట్ పట్టుకొస్తున్నావు? ఈ జంక్ అంతా తినకు..’’ అభిషేక్ అగర్వాల్‌ను హెచ్చరించేవాళ్లు తోటి విద్యార్థులు. ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకునేవాడాయన. ఇంటర్‌నెట్ ముందు కూర్చుంటే చాలు.. అర్థరాత్రి వరకు మేల్కొని స్నాక్స్‌పైన ఓ పెద్ద పరిశోధనే చేసేవాడు. ఆహారశుద్ధి, పోషకవిలువలు, ప్యాకింగ్ వంటివన్నీ అర్థమయ్యాయి అగర్వాల్‌కు!. ఎందుకో చిన్నప్పటి నుంచి అతనికి ఫుడ్ బిజినెస్‌పైనే ధ్యాస ఉండేది. ఐఐటీ రూర్కీలో బీటెక్ మెకానికల్ పూర్తయ్యాక.. అభిషేక్ అగర్వాల్, ఆకాశ్‌శర్మ అనే మిత్రునితో కలిసి ‘ఫార్మ్‌ల్లీ’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. మొదట్లో శుద్ధి చేసిన ఎండుఫలాలు (డ్రైఫ్రూట్స్), గింజ (నట్స్)లను ఆకర్షణీయమైన ప్యాకెట్లలో తీసుకొచ్చారు. పెద్ద పెద్ద సూపర్‌మార్కెట్లతో ఒప్పందాలు చేసుకుని పంపిణీ చేశారు. ఆ తర్వాత హెల్దీస్నాక్స్ తీసుకొచ్చారు. రోస్టెడ్ మఖానాస్, ఫ్లేవర్డ్ క్యాష్యూ, చియాసీడ్స్‌లతో పాటు వంద రకాల ఉత్పత్తులను తయారుచేశారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ పలికింది. దేశవ్యాప్తంగా ఐదువేల మంది రైతులతో ఒప్పందాలు చేసుకుని ‘ఫర్మ్‌ల్లీ’ని విజయతీరాలకు చేర్చారు మిత్రులు అభిషేక్, ఆకాశ్.
కలలకు రెక్కలు..
రామకృష్ణ మెండు, చిరాగ్‌జైన్...ఐఐటీ కాన్పూర్‌లో చదివేప్పుడు ఇద్దరి కలలూ ఒక్కటే!. చదువు పూర్తవుతూనే రెక్కలు తొడుక్కుని విజయతీరాలకు ఎగరాలన్నది వారి కల. స్వతహాగా ఇంజనీర్లు కాబట్టి.. ఆ చదువుతోనే అవకాశాలను గాలించారు. ఇప్పటికే డ్రోన్స్ తయారీలో మన దేశం ఆశాజనకంగానే ఉంది కాబట్టి... అందులోనే కొత్త ప్రయోగాలు చేయాలనుకున్నారు. అనుకూల వాతావరణంలో, సురక్షితమైన భూబాగాల్లో మాత్రమే డ్రోన్‌లు ఎగరగలవు. కొండలు, గుట్టలు, లోయలు, పర్వతాలు, విపరీతమైన గాలులు వీచే చోట డ్రోన్‌లను ఎగురవేయడం అంత సులభం కాదు.
ఆ సమస్యను అవకాశంగా మలుచుకుని నోయిడా కేంద్రంగా ‘ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్’ను నెలకొల్పారు ఐఐటీ పట్టభద్రులు. భారత సైన్యం నిఘా వర్గాలకు, నావికాదళానికి, ప్రకృతి విపత్తులప్పుడు కచ్చితంగా డ్రోన్‌లు కావాల్సిందే!. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలోని కొండప్రాంతాల్లో తమ డ్రోన్‌లకు అత్యంత కఠినమైన పరీక్షలకు గురి చేసి ఎగురవేశారు. ఆశించిన ఫలితం వచ్చింది. సంస్థకున్న భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు వచ్చారు. ఇప్పుడీ సంస్థ ఏరియల్ రొబోటిక్స్‌లో పతాకం ఎగురవేసింది. డ్రోన్‌బాయ్స్‌గా పేరు తెచ్చుకున్నారు రామక్రిష్ణ, చిరాగ్.
... ముప్పయి ఏళ్ల వయసులో అద్భుత విజయాలు సాధించిన వీళ్లందరిలో కనిపించిన సారూప్యత ఏంటంటే.. చదువు కుంటున్నప్పుడే కెరీర్ గురించి ఆలోచించడం.. భవిష్యత్తు పట్ల స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. కొత్త అవసరాలను గుర్తించడం.. పెట్టుబడిదారుల మనసు గెలవడం.. ఇవే వీరి విజయసూత్రాలు.
- సండే డెస్క్
Updated Date - Dec 22 , 2024 | 07:41 AM