Viral: ఆమెకు 102 ఏళ్లు.. ఆయనకు 100 ఏళ్లు.. ఓల్డేజ్ హోంలో వివాహం
ABN, Publish Date - May 25 , 2024 | 09:38 PM
మనసులో ఓ మాట చెప్పుకునేందుకు, కష్టసుఖాలు పంచుకునేందుకు జీవితంలో ఓ తోడు అవసరం. దీనికి వయసుతో నిమిత్తం లేదు. అందుకే ఓ వృద్ధ జంట వందేళ్ల వయసులో మరోసారి వివాహ బంధంలో ఒక్కటయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: మనసులో మాట చెప్పుకునేందుకు, కష్టసుఖాలు పంచుకునేందుకు జీవితంలో ఓ తోడు అవసరం. దీనికి వయసుతో నిమిత్తం లేదు. అందుకే ఓ వృద్ధ జంట వందేళ్ల వయసులో మరోసారి వివాహ బంధంలో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ఓల్డ్ ఏజ్ హోం వేదిక అయ్యింది. అమెరికాలోని ఫిలడేల్ఫియా రాష్ట్రంలో ఈ ఉదంతం వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్ (Viral) అవుతోంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, మార్జరీ ఫిటర్మన్ (102), బెర్నీ లిట్మన్ (100) ఇద్దరూ ఒకే ఓల్డేజ్ హోంలో ఉంటున్నారు. ఇద్దరు ఒకే అంతస్తులో ఉన్న గదుల్లో ఉంటున్నారు. నిత్యం ఒకరికొకరు తారసపడటంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. మార్జరీకి అంతకుముందే వివాహం జరిగింది. ఆమెది 65 ఏళ్ల సుదీర్ఘవైవాహిక బంధం. మార్జరీ భర్త కొన్నేళ్ల క్రితమే మరణించారు. బెర్నీది కూడా సుదీర్ఘ వైవాహిక జీవితం. ఆయన భార్య కూడా మరణించారు. అయితే, వృద్ధాప్యంలో ఉన్న వారి మనసులు ఎవరూ ఊహించని విధంగా దగ్గరయ్యాయి (US Couple Aged 102 And 100 Gets Married At Senior Living Facility).
Elon musk: స్నేహితుడి కాపురాన్ని కూల్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్?
అయితే, వృద్ధులు ఇద్దరూ వివాహం చేసుకోరని మనవలు మునిమనవలు తొలుత భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మార్జరీ బెర్నీ మళ్లీ వివాహ బంధంలో కాలుపెట్టారు. స్థానిక మతపెద్ద ఒకరు వీరి వివాహాన్ని దగ్గరుండి మరీ జరిపించారు. మార్జరీ, బెర్నీ సంతానం, మనవలు, మునిమనవలు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా, ఈ వృద్ధ జంట వివాహం దగ్గరుండి జరిపించడం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందని మతపెద్ద పేర్కొన్నారు. ఇప్పటివరకూ తాను డేటింగ్ సైట్లలో ఒకరికొకరు తారసపడ్డ జంటలకే వివాహాలు జరిపించానని అన్నారు. బెర్నీ, మార్జరీల ప్రేమ మాత్రం పాత రోజుల్ని గుర్తుకు తెచ్చిందని వ్యాఖ్యానించారు.
Updated Date - May 25 , 2024 | 09:43 PM