Ola Delivery Agent: పార్కింగ్‌లో అడ్డంగా దొరికిన ఓలా డెలివరీ ఏజెంట్.. వీడియో వైరల్
ABN, Publish Date - Jul 25 , 2024 | 04:29 PM
ఫుడ్ డెలివరీ ఏజెంట్లలో చాలామంది తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తుంటారు. తమకు ఆర్డర్ వచ్చిన వెంటనే.. హోటల్ వద్ద ఫుడ్ అందుకొని, కస్టమర్లకు సమయానికే వాటిని అందజేస్తుంటారు. అంతేకాదు..
ఫుడ్ డెలివరీ ఏజెంట్లలో (Food Delivery Agent) చాలామంది తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తుంటారు. తమకు ఆర్డర్ వచ్చిన వెంటనే.. హోటల్ వద్ద ఫుడ్ అందుకొని, కస్టమర్లకు సమయానికే వాటిని అందజేస్తుంటారు. అంతేకాదు.. తమ కస్టమర్ల పట్ల మర్యాదగా నడుచుకుంటారు. కానీ.. కొందరు మాత్రం దురుసుగా ప్రవర్తిస్తుంటారు. తమకు అదనంగా కొంత డబ్బు ఇవ్వాలని అడగడం, సమయానికి ఆర్డర్ తీసుకురాకపోవడం, తామే ఆ ఫుడ్ తినేయడం.. వంటి పనులకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఒక ఓలా (Ola) డెలివరీ ఏజెంట్ కూడా అలాంటి నిర్వాకానికే పాల్పడ్డాడు. ఆర్డర్ తినేయడమే కాకుండా కస్టమర్ పట్ల అమర్యాదగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
45 నిమిషాల వరకు వెయిటింగ్..
నోయిడాకు చెందిన అమర్ బీరేంద్ర జైస్వాల్ అనే వ్యాపారవేత్త ఇటీవల ఓలా ఫుడ్స్ నుంచి భోజనం ఆర్డర్ చేశాడు. కాసేపటికే అతనికి ఓలా డెలివరీ ఏజెంట్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. భోజనాన్ని డెలివర్ చేస్తున్నందుకు గాను తనకు అదనంగా రూ.10 టిప్ ఇవ్వాలని ఏజెంట్ కోరాడు. తొలుత అందుకు నిరాకరించిన జైస్వాల్.. ఆ తర్వాత రూ.10 ఇచ్చేందుకు అంగీకరించాడు. చూస్తుండగానే 45 నిమిషాలు గడిచిపోయాయి కానీ.. ఆర్డర్ మాత్రం ఇంకా చేరలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన అతను లిఫ్ట్ చేయలేదు. దీంతో.. తనకు అనుమానం వచ్చి జైస్వాల్ బయటకొచ్చాడు. తీరా చూస్తే.. ఆ డెలివరీ ఏజెంట్ పార్కింగ్ వద్దే ఉన్నాడు. తన బైక్‌పై ఎంచక్కా కూర్చొని.. జైస్వాల్‌కు అందించాల్సిన భోజనాన్ని మరొక ఏజెంట్ కలిసి తింటూ కనిపించాడు. దీంతో.. ఈ మొత్తం తతంగాన్ని జైస్వాల్ తన ఫోన్‌లో బంధించాడు.
ఏం చేసుకుంటావో చేస్కో..
పార్కింగ్ వద్ద డెలివరీ ఏజెంట్‌ని గుర్తించిన జైస్వాల్.. అతని వద్దకు వెళ్లి ‘నువ్వు నేను ఆర్డర్ చేసిన ఫుడ్ తింటున్నావ్’ అని అన్నాడు. అందుకు అతను బదులిస్తూ.. ‘అయితే ఏంటి? ఏం చేసుకుంటావో చేసుకోపో’ అంటూ బదులిచ్చాడు. ‘ఆర్డర్ తీసుకురావడం నీ బాధ్యత కదా’ అని జైస్వాల్ అడిగితే.. అందుకు అతను సమాధానం ఇవ్వలేదు. మరోసారి ఇది నా ఆర్డర్ అని కస్టమర్ చెప్పగా.. ‘నేనేం చేయాలి’ అంటూ దురుసుగా మాట్లాడాడు. ఈ వీడియోని జైస్వాల్ ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ.. ఓలా ఫుడ్స్‌కి ఫిర్యాదు చేశాడు. ‘‘మీ డెలివరీ ఏజెంట్లు పని చేసే విధానం ఇదేనా? మొదట్లో డెలివరీ ఏజెంట్ రూ.10 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆపై 45 నిమిషాలు నన్ను వెయిట్ చేయించాడు. తీరా అతడ్ని పార్కింగ్‌లో గుర్తిస్తే.. నా ఆర్డర్ తింటూ కనిపించాడు’’ అంటూ తన పోస్టులో జైస్వాల్ రాసుకొచ్చాడు. కాగా.. దీనిపై ఓలా ఫుడ్స్ ఇంకా స్పందించాల్సి ఉంది.
నెటిజన్ల స్పందన
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు సైతం తమ చేదు అనుభవాల్ని పంచుకున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. డెలివరీ ఏజెంట్ నా ఆర్డర్ అందుకున్న తర్వాత.. నాకు అందజేయలేదు. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది నిజంగా జుగుస్పాకరం’’ అని కామెంట్ చేశాడు. కొందరైతే.. నాలుగు గంటల పాటు వేచి చూసినా తమకు ఆర్డర్ అందలేదంటూ కామెంట్లు పెట్టారు.
Read Latest Prathyekam News and Telugu News
Updated Date - Jul 25 , 2024 | 05:42 PM