Viral: ఎందుకీ ప్రయోగాలు? ఎవరడిగారని? ఈ దోశను చూసి జనాల్లో ఆగ్రహం!
ABN, Publish Date - Jul 28 , 2024 | 08:01 PM
పాన్ దోశ పేరిట ఓ వ్యక్తి చేసిన ప్రయోగం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. ఎవరడిగారని ఈ ప్రయోగాలు చేస్తున్నారని కొందరు మండిపడ్డారు. ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోకు ఏకంగా 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దాదాపుగా అందరికీ తెలిసిన భారతీయ వంటకాల్లో దోశ ఒకటి. మసాలా దోశ, రవ్వ, పెసరట్టు.. ఇలా నోరించే వెరైటీలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కోటి ఇష్టం. కానీ మసాలా దోశ అంటే మాత్రం ఎవ్వరైనా ఇష్టపడతారు. ఆలూ కూరతో చేసే ఈ దోశ విదేశాల్లో కూడా పాప్యులర్. ఇక సంప్రదాయక దోశ వెరైటీల ఆధారంగా ఇటీవల కాలంలో మరిన్ని వెరైటీలు వచ్చి చేరాయి. కొన్ని జనాల్ని మెప్పిస్తే మరికొన్ని మాత్రం వికటించాయి. అలాంటి ఓ దోశ వెరైటీ ప్రస్తుతం జనాల్ని బెంబేలెత్తేలా చేస్తోంది. ఫేవరెట్ ఫుడ్స్‌తో ఇలాంటి ప్రయోగాలు ఆపండర్రా అని జనాలు గగ్గోలు పెట్టేలా చేస్తోంది (Viral).
Viral Video: క్యాబ్‌లపై నెలకు రూ.16 వేలు ఖర్చుపెడుతున్న మహిళ! షాకింగ్ ఉదంతం!
ప్రస్తుతం జనాల మనసు విరిగిపోయేలా చేస్తున్న ఈ దోశ పెరు పాన్ దోశ అట. thegreatindianfoodie అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలోని షెఫ్.. తొలుత ఆకు పచ్చ రంగులో ఉన్న పండిని పెనంపై వలయం ఆకారంలో పరిచాడు. ఆ తరువాత దానిపై పాన్‌లో వేసే మసాలా దినుసులన్నీ వేశారు. డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, చెర్రీలు, ఎండుద్రాక్ష, ఖుర్బానీ పండ్లు వంటివి ఓ క్రమపద్ధతిలో జత చేశాడు. దీంతో, వేడి వేడి దోశ రెడీ అయిపోయింది. ఆ తరువాత దాన్ని ప్లేట్‌లో వేసి చీజ్, పాన్ సిరప్ కూడా జతచేశాడు (Viral Clip Of Dosa Made With Paan Leaves Internet Shocked).
పానా దోశనా అనే క్యాప్షన్‌తో నెట్టింట షేర్ చేసిన ఈ వీడియో ఊహించని విధంగా వైరల్ అయిపోయింది. ఇప్పటివరకూ 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక జనాలు మాత్రం ఈ వీడియోపై మండిపడుతున్నారు. ఎవరడిగారని ఈ ప్రయోగాలు అంటూ నెట్టింట నిలదీస్తున్నారు. ఇది చివరకు పాన్ కాని, దోశ కాని స్థితిలో మిగిలిపోయింది కొందరు అన్నారు. ఇలాంటివి జనాలకు చూపించడానికి చేస్తారా లేక తినడానికి చేస్తారా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఈ దెబ్బతో మసాలా దోశను పరలోకానికి సాగనంపినట్టే అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరికొందరేమో దోశను అవమానపరిచారని కామెంట్ చేశారు.
కాగా, గతంలోనూ ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇడ్లీలు, మ్యాగీ, టీ ఇలా దేన్నీ వదలకుండా గుర్తుపట్టలేని విధంగా వాటిని మార్చేస్తూ ప్రయోగాలు చేశారు. వీటిల్లో కొన్ని మాత్రమే జనాల మెప్పు పొందగలిగాయి. మిగతావి మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యాయి.
Updated Date - Jul 28 , 2024 | 08:01 PM