Viral: ఆకాశంలో అద్భుతం.. అసలైన ఉల్కాపాతం అంటే ఇదే.. చూసి తీరాల్సిన వీడియో!
ABN, Publish Date - May 19 , 2024 | 03:09 PM
పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లో ఆకాశంలో ఆకుపచ్చ రంగులో ఉల్కాపాతం చూసి స్థానికులను అబ్బురపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉల్కాపాతం.. ప్రకృతి మనకు చూపించే అద్భుత దృశ్యాల్లో ఇదీ ఒకటి. అంతరిక్షంలో ఉండే చిన్న చిన్న శిలలు భూ వాతావరణంలో ప్రవేశించేటప్పుడు తీవ్ర ఒత్తిడికి గురై మండిపోతాయి. ఈ క్రమంలో వెలువడే కాంతిలో అవి తారాజువ్వాల్లా నేలవైపు దూసుకొస్తూ ఆశ్చర్యం కలగజేస్తాయి. ఈ అద్భుతాన్ని వర్ణించేందుకు భాష సరిపోదు. ఇక రంగురంగుల్లో ఉల్కాపాతం జరిగితే ఆ దృశ్యం చూసి మైమరిచిపోవాల్సిందే. సరిగ్గా ఇలాంటి దృశ్యమే స్పెయిన్, పోర్చుగల్ దేశాల గగనతలంపై ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ (Viral) అవుతుంటే జనాలు వీటిని చూసి మైమరిచిపోతున్నారు.
ఉల్కాపాతం జరగొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్న కొద్ది రోజులకే స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో ఉల్కాపాతం జరిగింది. చిన్న చిన్న గ్రహశకాలాలు ఒక్కసారిగా భూమివైపు దూసుకువచ్చాయి. భూవాతావరణంలోకి ప్రవేశించాక ఆకుపచ్చ రంగులో మండిపోతూ ఆకాశంలో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. ఇవి ఆకాశంలోనే మండిపోయాయా లేక నేలను తాకాయా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, నీలం, ఆకుపచ్చ కలగలిపిన రంగులో మండుతూ ఆకాశంలో అద్భుత కాంతిని వెదజల్లిన వీటి దృశ్యాలు మాత్రం నెట్టింట జనాల్ని మైమరిపిస్తున్నాయి. ఇలాంటి కాంతిలో ఉల్కాపాతం ఎప్పుడూ చూడలేదని జనాలు అనేక మంది కామెంట్ చేశారు ( Meteor lights up the sky over Spain Portugal).
Viral: స్త్రీత్వం కోల్పోయావని మహిళపై దారుణ ట్రోలింగ్.. జిమ్‌లో కండలు పెంచిందని..
శాస్త్రజ్ఞుల ప్రకారం, ఉల్కాపాతం రంగు గ్రహశకలాల్లోని రసాయనాలను బట్టి ఉంటుంది. పోర్చుగల్, స్పెయిన్‌లోని ఉల్కల్లో మెగ్నీషియం అధికంగా ఉండటంతో అవి ఆకుపచ్చ రంగు కాంతి వెదజల్లుతూ మండాయని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం అధికంగా ఉన్న ఉల్కలు వయలెట్, సోడియం అధికంగా ఉంటే నారింజ రంగు, ఐరన్ అధికంగా ఉంటే పసుపు పచ్చ రంగులో మండుతాయని పేర్కొన్నారు. ఇక ఉల్కలు వాతావరణంలో ప్రవేశించే వేగాన్ని బట్టి కూడా రంగులో తీవ్రత ఆధారపడుతుందని చెబుతున్నారు. వీడియోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2024 | 03:18 PM