Viral: వావ్.. ఇలాంటిదొకటి ఉంటే ఎన్ని దోసలైనా క్షణాల్లో రెడీ చేయొచ్చు!
ABN, Publish Date - Sep 10 , 2024 | 04:49 PM
అర్ధచంద్రాకారంలో ఉన్న ఓ అట్లకాడ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో దోసలు వేయడం సులువని భావిస్తున్న నెటిజన్లు ఇది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు ఎవరైనా చెప్పాలంటూ అభ్యర్థిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దోసలంటే తెలియని భారతీయులు ఉండదు. ఈ పేరు పలికితేనే చాలు జనాల నోరు ఊరుతుంది. రుచిలో దీనికి సాటి రాగల వంటలేదంటారు దోస ప్రియులు. ఇంత రుచిగా ఉండే దోసను తయారు చేయడం మాత్రం ఆషామాషీ వ్యవహారం కాదు. దోస పిండి కలపడం దగ్గర నుంచి, సన్నగా రేకుల్లో దోస వేయడం వరకూ ప్రతిదీ ఒక కళే. ఇక ఇంట్లో దోసలు వేసుకునేందుకు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి వాళ్లూ సులువుగా దోసలు వేయగలరనే నమ్మకం కలిగించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
Viral: డేట్‌పై వెళ్లేందుకు ఉద్యోగులకు లీవ్స్ ఇస్తున్న సంస్థ! ఎందుకంటే..
వీడియోలోని వ్యక్తి.. ఉడికిన దోసను అట్లకాడకు బదులు మరో పరికరంతో సులువుగా తీశాడు. అర్ధచంద్రాకారంలో పొడుగ్గా ఉన్న ఈ పరికరంతో దోస దానంతట అదే చాపచుట్టినట్టు పెనంపై నుంచి లేచి వచ్చింది. ఇది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. కాలిన దోసను అట్లకాడతో తీస్తారన్న విషయం తెలిసిందే. కానీ, చాలా మంది దీన్ని వినియోగించడంలో ఇబ్బంది పడతారు. అయితే, వీడియోలో కనిపించి దానితో దోస సులువుగా పెనంపై నుంచి తీయగలగడం చూసి నోరెళ్లబుతున్నారు (viral Video of dosa scrapper is creating waves on social media).
ఇలాంటి పరికరం ఒకటి ఉంటే ఎన్ని దోసలైనా చిటికెలో రెడీ చేయొచ్చని కొందరు కామెంట్ చేశారు. అసలు ఏమాత్రం పెనానికి అంటుకోకుండా దోస తీయగలగడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. దీంతో, వీడియోకు 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దోసను ఇంత సులభంగా సిద్ధం చేయగలగడం ఎక్కడా చూడలేదని ఓ వ్యక్తి అన్నాడు. అతడి చేతిలో ఉన్న సాధనం తనకూ కావాలని మరో వ్యక్తి చెప్పాడు. దోసను చేతితో తాకకుండానే తీయగలగడం చూస్తే అబ్బురంగా ఉందని కూడా కొందరు కామెంట్ చేశాడు. ఇది ఎక్కడ దొరుకుతుందో చెబితే తాము కొనుక్కుంటామని కొందరు అన్నారు. కొందరు మాత్రం వీడియోలోని లోపాన్నీ బయటపెట్టారు. దోస రెండో వైపు కాల్చనేలేదని కామెంట్ చేశారు.
ఇక గతంలో దోసకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా దోస రెసీపీలతో చేసిన ప్రయోగాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. కొన్ని ప్రయోగాలు జనాల మన్ననలు పొందితే మరికొన్ని మాత్రం వికటించి విమర్శలు మూటగట్టుకున్నాయి.
Updated Date - Sep 10 , 2024 | 04:54 PM