Mike Tyson: మైక్ టైసన్ జీవితంలో ఆసక్తికర ఘటన! భారీ మగ గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధమై..
ABN, Publish Date - Nov 16 , 2024 | 08:08 PM
ఒకప్పుడు ఏకంగా గొరిల్లాతో తలపడేందుకు సిద్ధమైన మైక్ జూ సంరక్షకుడు కాదనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తాజాగా ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: 1980ల్లో బాక్సింగ్ ప్రపంచాన్ని ఏలిన రారాజు మైక్ టైసన్ జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు మైక్ టైసన్ పేరు చెబితే ప్రత్యర్థులు గడగడలాడిపోయేవారు. అసాధారణ దేహదారుఢ్యం గల మైక్.. భీకరమైన ముష్టిఘాతాలతో ప్రత్యర్థిని నిలబడ్డ చోటే కూలబడేలా చేసేవాడు. అనేక సందర్భాల్లో ఒక్క ముష్టిఘాతంతో ప్రత్యర్థులను నేలకరిచేలా చేశాడు. అప్పట్లో మైక్‌కు కోపం వస్తే చుట్టుపక్కల వారందరూ భయపడిపోయేవారు. ప్రత్యర్థులపై అంతలా విరుచుకుపడటానికి మైక్‌కు చిన్నతనంలో ఎదురైన అనుభవాలే కారణమని కొందరు చెబుతారు (Viral)..
Viral: అమ్మో.. సొర చేపపై స్వారీ.. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా
క్షణికావేశాలకు లోనవడం, మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడం, ఎదుట ఎవరున్నా వెరవని నైజం మైక్‌ను అరివీరభయంకరుడిగా మార్చాయి. ఇతరులను బెదిరించే వారు, హేళన చేసే వారిని చూస్తే మైక్ ఉగ్రుడైపోతాడని అతడిని దగ్గర నుంచి చూసిన వారు చెబుతారు. ఇక మైక్ దూకుడుకు అద్దం పట్టే ఘటన 1980ల్లో కలకాలనికి దారి తీసింది. అప్పట్లో తన భార్యతో కలిసి న్యూయార్క్ జూకు వెళ్లిన మైక్ టైసన్ అక్కడ ఒక భారీ మగ గొరిల్లాను చూశాడు. దాదాపు 181 కేజీల బరువున్న ఆ భారీ గొరిల్లా తన కంటే చిన్నగా ఉన్న తోటి గొరిల్లాలను వేధించడం, ఆడగొరిల్లాను ఇబ్బంది పెట్టడం చూసి మైక్ తట్టుకోలేకపోయాడు. ఇతరులను వేధించే వారిని చూస్తే మైక్‌కు చిన్నతనం నుంచి విపరీతమైన కోపం.
Viral: అసలైన ప్రేమంటే ఇదీ.. చూపు లేని గర్ల్‌ఫ్రెండ్‌కు ఊహించని సర్‌ప్రైజ్!
దీంతో, గొరిల్లాను చూడగానే అతడిలో కోపం కట్టలు తెంచుకుంది. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధమయ్యాడు. తనను గొరిల్లా బోనులోకి అనుమతించాలని జూ సంరక్షకుడిని కోరడమే కాకుండా అతడికి 10 వేల డాలర్లు ఇస్తానని కూడా చెప్పాడు. అయితే, మగ గొరిల్లా ముందు మనుషులెవరూ నిలవలేరన్న విషయం తెలిసి జూ సంరక్షకుడు మైక్ ఆఫర్‌ను స్పష్టంగా నో చెప్పేశాడు. మైక్ మనస్తత్వం బాగా తెలిసిన అతడు బోను లోకి అతడిని అనుమతించేదే లేదని స్పష్టం చేశాడు. దీంతో, పెను ప్రమాదం తప్పినట్టైంది.
నాటి ఘటన గురించి మైక్ ఓ టీవీ ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నాడు. గొరిల్లాతో యుద్ధానికి సిద్ధమవడం నిజంగా మూర్ఖమైన ఆలోచననేని అంగీకరించాడు. అయితే, మైక్ దూకుడుకు, భయమన్నదే తెలీని వ్యక్తిత్వానికి ఈ ఘటన నిదర్శనమన్న అతడి అభిమానులు చెబుతుంటారు. యూట్యూబర్ జేక్ పాల్‌తో మైక్ తాజా మ్యాచ్ నేపథ్యంలో నాటి విషయాలను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు మైక్ యవ్వనంలో ఉండి ఉండే అతడి ధాటికి జేక్ నిలిచుండే వాడు కాదని కామెంట్ చేస్తున్నారు. ఇక తాజా మ్యాచ్‌లో మైక్ ఓడిపోయినప్పటికీ అతడికి రూ.169 కోట్ల పారితోషికం దక్కినట్లు తెలుస్తోంది.
Viral: టాలెంట్ ఉన్నా లైఫ్‌లో ముందుకెళ్లట్లేదా? కారణాలు ఇవే!
Updated Date - Nov 16 , 2024 | 08:17 PM