Viral: విమానాలకు తెలుపు రంగు పెయింట్ మాత్రమే వేస్తారు.. ఎందుకో తెలుసా?
ABN, Publish Date - Nov 11 , 2024 | 05:31 PM
సాధారణంగా కమర్షియల్ విమానాలన్నీ తెల్లరంగులోనే ఉంటాయి. దీని వెనక ఆర్థిక, భద్రతాపరమైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా విమానాలన్నిటికీ తెల్లని పెయింట్ వేస్తారు. విమానం లోగో మినహా మిగతా అంతా తెలుపు వర్ణంలోనే ఉంటుంది. తరచూ విమానప్రయాణాలు చేసే వారు ఈ విషయాన్ని ఎప్పుడో ఒకప్పుడు గమనించే ఉంటారు. దీని వెనక కారణమేంటనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? అయితే, దీని వెనుక కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Viral).
వైమానిక రంగ నిపుణుల ప్రకారం, విమానాలకు తెల్ల పెయింట్ వేయడం వెనక ఆర్థిక, భద్రతాపరమైన కారణాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ రంగుతోనే విమానప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. తెల్లని పెయింట్ సూర్యకిరణాలను గ్రహించకుండా పూర్తిస్థాయిలో పరావర్తనం చెందేలా చేస్తుంది. దీంతో, ఎండవేడి విమానంలోపలికి చేరదు. ఫలితంగా విమానంలోపల వాతావరణం చల్లగా ఉంటుంది. లోపలి ఏసీలపై కూడా భారం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగు పెయింట్ బరువు కూడా తక్కువగా ఉండటంతో ఇంధన ఖర్చు కూడా ఆదాఅవుతుందట. నిర్వహణ ఖర్చులు తగ్గుతాయట.
Viral: తాత పుట్టిన రోజున ఒంటరిగా బామ్మ.. మనవడి ఊహించని సర్‌ప్రైజ్!
విమానంపై భాగంలో ఏర్పడే పగుళ్లు, చిన్న చిన్న రంధ్రాలు వంటివాటిని తెలుపు రంగు ఉంటే సులువుగా గుర్తించవచ్చని వైమానిక రంగ నిపుణులు చెబుతున్నారు. తెలుపు రంగు భాగాలపై ఇలాంటి వాటిని సులువుగా గుర్తించే అవకాశం ఉండటంతో విమానప్రమాదాలు జరిగే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. దీంతో, విమానం ఎక్కువ కాలం పాటు పాడుకాకుండా సేవలందించే అవకాశం ఉంటుంది. ఇక తెలుపు రంగు ఎక్కువ కాలం నిలిచి ఉండటంతో ఎయిర్‌లైన్స్‌కు పెయింటింగ్ ఖర్చులు కూడా తగ్గుతాయి.
విమానాలకు సాధారణంగా పక్షులతో ప్రమాదం ఉంటుంది. ఎదురుగా వస్తున్న విమానాన్ని గుర్తించడంలో అవి ఇబ్బంది పడి చివరకు ఇంజెన్‌లోకి దూసుకుపోయి ప్రమాదాలకు కారణమవుతాయి. అయితే, తెలుపు రంగు వినియోగంతో ఈ సమస్య చాలా వరకూ తగ్గిపోతుంది. తెలుపు రంగు విమానాలను పక్షులు సులభంగా గుర్తించి పక్కకు తప్పుకుంటాయట.
Viral: కూతురి రూపురేఖలు చూసి తండ్రికి డౌట్! డీఎన్ఏ టెస్టు చేయిస్తే..
విమానానికి తెలుపు రంగు వేసే సంప్రదాయాన్ని ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ తొలిసారిగా 1976లో ప్రారంభించింది. నాటి నుంచి వివిధ ఎయిర్‌లైన్స్ ఈ ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఆధునిక కాంపోజిట్ మెటీరియల్స్‌తో తయారవుతున్న విమానాలకు తెల్లపెయింట్ అత్యంత అనుకూలమని కూడా విమానయాన నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలో దాదాపు అన్ని విమానాలకు తెలుపు రంగు పెయింట్ వేసినప్పటికీ ఎయిర్‌న్యూజిలాండ్ మాత్రం తన విమానాలకు నలుపు రంగు వేస్తుంది. దీని వెనక ఆ దేశ వారసత్వ సంస్కృతి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నలుపు రంగు ఆ దేశ సాంస్కృతిక చిహ్నం. కివీ వారసత్వానికి ప్రతీక. దాన్ని కొనసాగించేందుకు ఎయిర్ న్యూజిలాండ్ నలుపు రంగును వినియోగిస్తోంది. తన విమానాల్లో కనీసం ఒక్కదానికైనా నలుపు రంగు వేసి తన సంస్కాృతిక వారసత్వాన్ని ఘనంగా చాటుతోంది ఎయిర్ న్యూజిలాండ్.
Updated Date - Nov 11 , 2024 | 05:39 PM