Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ప్రపంచ నంబర్ 1 నొవాక్ జొకోవిచ్ ఔట్
ABN , Publish Date - Jan 26 , 2024 | 05:04 PM
36 ఏళ్ల ప్రపంచ నంబర్ 1 ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌కు 22 ఏళ్ల కుర్రాడు షాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 నొవాక్ జొకోవిచ్ ఇటలీకి చెందిన ప్రపంచ నాలుగో ర్యాంక్ ఆటగాడు యానిక్ సిన్నర్ చేతిలో ఓడిపోయారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 నొవాక్ జొకోవిచ్(Novak Djokovic)కు ఘోర పరాభవం ఎదురైంది. ఇటలీకి చెందిన ప్రపంచ నాలుగో ర్యాంక్ ఆటగాడు యానిక్ సిన్నర్‌పై సెమీ ఫైనల్లో జొకోవిచ్ ఓటమి పాలయ్యారు. దీంతో 36 ఏళ్ల సెర్బియా స్టార్ జొకోవిచ్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. నాలుగు సెట్ల పోరులో సిన్నర్ 6-1, 6-2, 6-7, 6-3తో జకోవిచ్‌పై విజయం సాధించారు. 22 ఏళ్ల సిన్నర్ తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్, డానియల్ మెద్వెదేవ్ మధ్య జరిగే మరో సెమీ ఫైనల్ విజేతతో సిన్నర్ తలపడనున్నాడు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Sania Mirza: విడాకుల తర్వాత సానియా మీర్జా తొలి పోస్ట్ వైరల్
అయితే 10 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్.. ఈరోజు మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో కనిపించలేదు. తొలి రెండు సెట్లు ఏకపక్షంగానే కొనసాగాయి. మూడో సెట్‌లో జొకోవిచ్ పునరాగమనం చేయడానికి ప్రయత్నించి టైబ్రేకర్‌లో గెలిచాడు. కానీ నాలుగో సెట్‌లో సిన్నర్ పునరాగమనం చేసి 6-3 సెట్‌ను గెలుచుకున్నాడు. దీంతో రికార్డు స్థాయిలో 11వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి 25వ గ్రాండ్ స్లామ్ సాధించాలనుకున్న 36 ఏళ్ల జకోవిచ్ కల చెదిరిపోయింది. ఇక ప్రస్తుతం అతను తదుపరి గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ కోసం వేచి చూస్తున్నారు.
జకోవిచ్ ఇంతకు ముందు ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ ఫైనల్స్‌కు చేరినప్పుడల్లా గెలిచి ఛాంపియన్‌గా నిలిచాడు. ఇప్పుడు అతని రికార్డులో ఓ ఓటమి కూడా చేరింది. గత ఆరేళ్లుగా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ టోర్నీలో చివరిసారి 2018లో ఓడిపోయింది. ఆ తర్వాత నాలుగో రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన చుంగ్ హైయాన్ చేతిలో ఓడిపోయాడు.