Neeraj Chopra: ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచితంగా వీసా.. ఓ కంపెనీ సీఈవో సంచలన ఆఫర్
ABN, Publish Date - Aug 04 , 2024 | 04:36 PM
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత ప్లేయర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. పతకం తెచ్చిపెట్టడం ఖాయమని అంచనా వేసిన పలువురు ఆటగాళ్లు సైతం స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. ఇప్పటివరకు కేవలం మూడంటే మూడు కాంస్యాలను మాత్రమే గెలుచుకుంది.
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత ప్లేయర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. పతకం తెచ్చిపెట్టడం ఖాయమని అంచనా వేసిన పలువురు ఆటగాళ్లు సైతం స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారు. పర్యవసానంగా భారత్ ఇప్పటివరకు కేవలం మూడంటే మూడు కాంస్యాలను మాత్రమే గెలుచుకుంది. దీంతో ఆశలన్నీ భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. స్వర్ణాన్ని తెచ్చిపెట్టాలని భారతీయులందరూ అభిలాషిస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 6న జావెలిన్ త్రో ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రాపై అభిమానాన్ని చాటుకుంటూ ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ ప్లాట్‌ఫామ్ ‘అట్లీస్’ వ్యవస్థాపకుడు, ఆ కంపెనీ సీఈవో మోహక్ నహ్తా సంచలన ఆఫర్ ప్రకటించారు. ఒలింపిక్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే భారతీయులందరికీ ఉచిత వీసాలు ఇస్తానని ప్రకటించారు.
‘‘నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిస్తే నేనే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ఉచిత వీసా పంపిస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో..’’ అంటూ ‘లింక్డ్‌ఇన్’ వేదికగా మోహక్ నహ్తీ పోస్ట్ పెట్టారు. తన ఆఫర్‌కు సంబంధించిన మరికొన్ని వివరాలు, నిబంధనలను మరో పోస్టులో ఆయన వెల్లడించారు.
నిబంధనలు ఇవే...
నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అట్లీస్ కంపెనీ యూజర్లు అందరికీ ఒక రోజు పాటు ఉచిత వీసాను అందజేస్తాం.
వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే పూర్తి ఉచితంగా వీసాను అందిస్తాం.
ప్రపంచంలోని ఏ దేశానికైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ ఆఫర్‌ను పొందాలనే ఉద్దేశ్యం ఉన్నవారు మోహక్ నహ్తా పోస్ట్‌లోని కామెంట్ సెక్షన్‌లో ఈ-మెయిల్ ఐడీని డ్రాప్ చేయాలి. ఈ-మెయిల్‌ని వినియోగించి అట్లీస్ కంపెనీ ఉచిత వీసా క్రెడిట్‌తో అకౌంట్‌ను క్రియేట్ చేస్తుంది.
కాగా పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ నేపథ్యంలో వీసా దరఖాస్తులు 40 శాతం మేర పెరిగాయని అట్లీస్ కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఒలింపిక్స్ గేమ్స్ ఇందుకు కారణంగా ఉంది. కాగా సాధారణంగా అయితే భారత్ నుంచి యూఏఈ, అమెరికా, థాయిలాండ్ దేశాలకు అధికంగా ప్రయాణాలు కొనసాగుతుంటాయి.
కాగా 2020 - టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌ను భారత్‌కు బంగారు పతకాన్ని సాధించాడు. మరి మంగళవారం నాడు పారిస్ ఒలింపిక్స్‌లో అతడు ఎలా రాణించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
Updated Date - Aug 04 , 2024 | 04:40 PM