చదరంగ రారాజు ఛాయిస్...
ABN, Publish Date - Dec 22 , 2024 | 08:23 AM
చెస్ బోర్డుకు ఇవతల 18 ఏళ్ల యువకెరటం... అవతల ఆటలో తలపండిన 32 ఏళ్ల లిరెన్. గెలుపు నీదా? నాదా? అన్నట్లుగా 14 రౌండ్లలో సాగిన ఆటలో లిరెన్ (చైనా) చేసిన చిన్న తప్పిదాన్ని ఆ కుర్రాడు తనకు అనుకూలంగా మల్చుకున్నాడు.
చెస్ బోర్డుకు ఇవతల 18 ఏళ్ల యువకెరటం... అవతల ఆటలో తలపండిన 32 ఏళ్ల లిరెన్. గెలుపు నీదా? నాదా? అన్నట్లుగా 14 రౌండ్లలో సాగిన ఆటలో లిరెన్ (చైనా) చేసిన చిన్న తప్పిదాన్ని ఆ కుర్రాడు తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. ఇంకేం... చదరంగ సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తిగా అవతరించాడు గుకేష్ దొమ్మరాజు. అతడే ఇప్పుడు ప్రపంచ చెస్ ఛాంపియన్. 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. ‘ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ పూర్తిగా చెస్‌తోనే తేలదు. ఉత్తమ వ్యక్తిత్వం, సంకల్ప బలం ప్రదర్శించినవాళ్లు విజేతగా నిలుస్తారు. ఆ లక్షణాలు ప్రదర్శించా...’ అంటున్న గుకేష్ వ్యక్తిత్వ వికాసం ఆవిష్కరణకు తోడ్పడిన కొన్ని పర్సనల్ ఛాయిస్‌లివి...
- ఫేవరెట్ షో
ది క్వీన్స్ గాంబిట్
చదరంగం నేపథ్యంలో 2020లో విడుదలైన టీవీ సిరీస్ ‘ ది క్వీన్స్ గాంబిట్’ అంటే గుకేష్‌కు చాలా ఇష్టం. ఇదే పేరుతో 1983లో వాల్టర్ టెవిస్ రాసిన నవల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు దర్శకద్వయం స్కాట్ ఫ్రాంక్, అలన్ స్కాట్. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఏడు ఎపిసోడ్లతో కూడిన ఈ సీరీస్ ఎలిజబెత్ హార్మన్ అనే అనాథ బాలిక చదరంగ క్రీడాకారిణిగా ఎదగడానికి పడిన పాట్లను చూపుతుంది. ఈ పీరియాడిక్ డ్రామా 1950ల్లో జరుగుతుంది. ఈ సిరీస్ అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.
- ఫేవరెట్ మూవీ
రాటటౌల్లె (2007)
గుకేష్‌కు కామెడీలన్నా, యానిమేషన్ చిత్రాలన్నా మక్కువ ఎక్కువ. ‘రాటటౌల్లె’ అలాంటి సినిమానే. ఇదొక అమెరికన్ యానిమేటెడ్ కామెడీ డ్రామా. 2007లో విడుదలైన ఈ చిత్రం నిడివి 111 నిమిషాలు. రెమీ అనే ఎలుక ప్రధాన పాత్రలో సాగుతుంది. పారిస్‌లోని ఒక ఇంట్లో సోదరుడు, తండ్రితో కలిసి సంతోషంగా ఉన్న రెమీ... ఆ ఇంటి యజమాని తమ ఉనికిని గుర్తించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆ కంగారులో రెమీ మిగతావారితో విడిపోతుంది. ఆ తర్వాత రెమీ ప్రయాణం ఏ దిశగా సాగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది.
- ఫేవరెట్ బుక్స్
ఎ షాట్ ఎట్ హిస్టరీ- అభినవ్‌బింద్రా, ప్లేయింగ్ ఇట్ మై వే- సచిన్ టెండూల్కర్
ఒక క్రీడాకారుడిగా గుకేష్ క్రీడాకారుల బయోగ్రఫీలను ఎక్కువగా చదువుతాడు. భారతీయ షూటర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ ‘ఎ షాట్ ఎట్ హిస్టరీ’తో స్ఫూర్తి పొందానని అంటాడు. 224 పేజీలున్న ఈ పుస్తకంలో ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకు ఎలా శ్రమించింది, కోచ్‌లు ఎలా సహకరించారనే తన ప్రయాణాన్ని ఆసక్తికరంగా అక్షరరూపంలోకి మలిచాడు అభినవ్. ఇది 2011లో విడుదలయ్యింది.
అదేవిధంగా మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ కూడా గుకేష్‌కు ఆత్మవిశ్వాసాన్ని అందించింది. బొరియా మజుందార్ అనే క్రీడా రచయితతో కలసి సచిన్ టెండూల్కర్ ఈ పుస్తకాన్ని రాశారు. 486 పేజీల ఈ పుస్తకంలో ఆయన తన క్రికెట్ కెరీర్ ప్రారంభం నుంచి మొదలుకుని, 24 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవాలను విపులంగా వివరించారు. ఇది బెస్ట్ సెల్లర్‌గా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు’లోకి కూడా ఎక్కింది.
- ఫేవరెట్ ఫుడ్ : పెరుగన్నం
అన్నిరకాల ఆహారాన్ని ఇష్టపడినప్పటికీ పెరుగన్నం ఆల్‌టైమ్ ఫేవరెట్‌గా చెబుతాడు.
- ఫేవరెట్ యాక్టివిటీ
టెన్నిస్, స్క్వాష్
అనునిత్యం చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలనే ఆలోచనలే బుర్రను పదునుపెట్టినప్పటికీ... రిఫ్రెష్ అయ్యేందుకు టెన్నిస్, స్క్వాష్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు.
Updated Date - Dec 22 , 2024 | 08:23 AM