Shubman Gill: సెల్ఫిష్ కెప్టెన్ అంటూ శుభ్‌మన్ గిల్‌పై ట్రోల్స్.. కారణం ఇదే!
ABN, Publish Date - Jul 11 , 2024 | 01:34 PM
ఈమధ్య భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు కాలం ఏమాత్రం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి అన్ని ఎదురుదెబ్బలే..
ఈమధ్య భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) కాలం ఏమాత్రం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఆ లీగ్‌లో అతడు కెప్టెన్‌గా గానీ, ఆటగాడిగా గానీ సరిగ్గా రాణించలేకపోయాడు. ఇప్పుడు జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌లో టీ20I సిరీస్‌లో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సమయంలోనూ అతనిపై విమర్శలు వస్తున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో సరైన ప్రదర్శన కనబర్చకపోవడం వల్ల అతనిపై ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించినా.. ఓ విషయంలో మాత్రం అతనిపై నిప్పులు చెరుగుతున్నారు. అదే.. బ్యాటింగ్ స్థానం.
ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ మొదటి నుంచి ఓపెనర్‌గా రంగంలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మతో (Abhishek Sharma) కలిసి ఓపెనింగ్ చేసిన అతను.. మూడో మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా దిగాడు. ఇక్కడే అతను అతిపెద్ద తప్పు చేశాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎందుకంటే.. రెండో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లకు ముచ్చెమటలు పట్టించి, బౌండరీల మోత మోగించేశాడు. అలాంటి బ్యాటర్‌ని మూడో మ్యాచ్‌లో వన్ డౌన్‌కి డీమోట్ చేసి.. తను ఓపెనర్‌గా దిగడంపై గిల్‌ని ఏకిపారేస్తున్నారు. ‘సెల్ఫిష్ కెప్టెన్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎలాగో ఓపెనర్‌గా గిల్ సరిగ్గా రాణించడం లేదు కాబట్టి.. తన ఓపెనింగ్ స్థానాన్ని అభిషేక్ కోసం త్యాగం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
మూడో మ్యాచ్‌లో అభిషేక్‌ని మూడో స్థానంలో పంపించడం వల్లే.. అతడు సరైన ప్రదర్శన కనబరచలేకపోయాడని, 9 బంతుల్లో కేవలం 10 పరుగులే చేశాడని శుభ్‌మన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ ఒక విధ్వంసకర ఓపెనర్ అని, అలాంటోడ్ని ఎందుకు ఓపెనర్‌గా పంపలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. శుభ్‌మన్ ఒక మంచి కెప్టెన్ అవ్వాలంటే.. తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందేనని, నాలుగు లేదా ఐదో స్థానంలో వస్తేనే బెటరని సూచిస్తున్నారు. ఇదే సమయంలో.. రుతురాజ్‌ని నాలుగో స్థానంలో పంపించడంపై కూడా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే.. అతనికి కెప్టెన్సీ కన్నా తన స్థానంపైనే ఎక్కువ మక్కువ ఉన్నట్టు అనిపిస్తోందంటూ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 11 , 2024 | 01:34 PM