Gary Kirsten: ఆటగాళ్లతో విభేదాలు.. పాక్ జట్టు కోచ్ రాజీనామా
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:34 PM
పాకిస్తాన్ జట్టు కోచ్ కు ఆటగాళ్లకు మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. మరోవైపు పీసీబీ నుంచి కూడా మద్దతు లేకపోవడంతో కిర్‌స్టన్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
కరాచి: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులైన నాలుగు నెలలకే గ్యారీ కిర్‌స్టన్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. పాక్ క్రికెట్ బోర్డు సైతం అతడి రాజీనామాను వెంటనే అంగీకరించింది. అతడి స్థానంలో టెస్టు క్రికెట్ కు తాత్కాలిక కోచ్ గా ఉన్న జాసన్ గిల్లెస్పీ బాధ్యతలు చేపట్టనున్నాడు. పూర్తి స్థాయి కోచ్ పదవిని చేపట్టబోయేది ఎవరనే విషయంలో మరింత క్లారిటీ రావలసి ఉంది.
ఆటగాళ్ల తోనూ విభేదాలు..
ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య జరగబోయే సిరీస్‌లకు జట్టు ఎంపిక, ప్రకటన విషయాల్లో పీసీబీకి కిర్‌స్టన్ కి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. స్క్వాడ్‌పై గ్యారీ కిర్‌స్టన్ సూచనలను పీసీబీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఇది ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి దారితీసింది. అంతేకాకుండా జట్టులోని ఆటగాళ్లకు కిర్‌స్టన్ కు మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని తెలుస్తోంది.
వారి జోస్యం నిజమైంది..
గ్యారీ కిర్‌స్టన్‌ను రెండేళ్ల కాంట్రాక్ట్‌తో ఏప్రిల్ 2024లో పాకిస్తాన్ వైట్-బాల్ కోచ్‌గా నియమించారు. T20 ప్రపంచ కప్ ప్రచారంలో పాకిస్తాన్ జట్టు దారుణ ప్రదర్శన చేయడంతో కోచ్ నియామకంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. భారత్ 2011 ప్రపంచకప్ ను సాధించడం వెనక కోచ్ కిర్ స్టన్ కీలక పాత్ర పోషించాడు. పీసీబీ సైతం ఈ కోచే కావాలని పట్టుబట్టి అతడిని రప్పించుకుంది. పాక్ జట్టుకు ఈ కోచ్ ఎక్కువ కాలం నిలవడంటూ కొందరు మాజీలు అప్పుడే జోస్యం చెప్పారు. తాజాగా అదే నిజమైంది.
PAK vs AUS: పాక్‌తో టీ20కి స్టార్ ఆటగాళ్లను పక్కనపెట్టిన ఆసీస్.
Updated Date - Oct 28 , 2024 | 04:34 PM