ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA 2nd Test: తొలి రోజంతా బౌలర్లదే.. ఏకంగా 23 వికెట్లు డౌన్!

ABN, Publish Date - Jan 03 , 2024 | 09:30 PM

భారత్, సౌతాఫ్రికా మధ్య ప్రారంభమైన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో అద్భుతమే జరిగింది. పూర్తిగా పేస్ బౌలర్లు అధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా తొలి రోజే రెండు జట్లు ఆలౌటయ్యాయి. అంతేకాకుండా తొలి రోజే రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభమైంది.

కేప్‌టౌన్: భారత్, సౌతాఫ్రికా మధ్య ప్రారంభమైన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో అద్భుతమే జరిగింది. పూర్తిగా పేస్ బౌలర్లు అధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా తొలి రోజే రెండు జట్లు ఆలౌటయ్యాయి. అంతేకాకుండా తొలి రోజే రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభమైంది. కేప్‌టౌన్ పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలించడంతో బ్యాటర్లకు పరుగులు రావడం గగనమైపోయింది.పేసర్లను ఎదుర్కొలేక రెండు జట్ల బ్యాటర్లు పెవిలియన్‌కు పరుగులు పెట్టారు. తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్ల పడిన రెండో మ్యాచ్‌గా ఇది నిలిచింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/15) విశ్వరూపంతో మొదట సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత సౌతాఫ్రికా పేసర్లు ఎంగిడి, బర్గర్, రబాడ చెలరేగడంతో భారత జట్టు 153 పరుగులకే ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 98 పరుగుల కీలక అధిక్యం లభించింది. ఆ తర్వాత తొలి రోజే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. మొదటి రోజు మాదిరిగానే రెండో రోజు కూడా పరిస్థితులు ఉంటే ఈ టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం ఖాయంగా కనిపిప్తోంది.


సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ మాక్రమ్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చిన మాక్రమ్ ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన సిరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 3 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్‌ను 9వ ఓవర్లో బుమ్రా ఔట్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే సిరాజ్ మియా మరోసారి చెలరేగడంతో 2 పరుగులే చేసిన వన్‌డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జి వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా దూడుకు కొనసాగించిన సిరాజ్.. ఒకే ఓవర్‌లో 12 పరుగులు చేసిన డేవిడ్ బెడింగ్‌హామ్‌తోపాటు మార్కో జాన్సెన్‌ను డకౌట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే మరోసారి చెలరేగిన సిరాజ్.. 15 పరుగులు చేసిన కైల్ వెర్రెయిన్నేను ఔట్ చేశాడు. దీంతో ఇక సఫారీ జట్టు ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ముఖేష్ కుమార్, బుమ్రా టేలెండర్ల భరతం పట్టారు. కేశవ్ మహారాజ్(3), రబాడను(5) ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చగా.. బర్గర్‌ను(4)ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. అలాగే టెస్టుల్లో మన జట్టు ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన అతి తక్కువ స్కోర్ కూడా ఇదే. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విశ్వరూపం చూపించాడు. జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్

కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించినప్పటికీ రబాడ వేసిన మూడో ఓవర్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. దీంతో 19 పరుగులకే భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వికెట్‌కు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 55 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడేలాగే కనిపించాడు. కానీ బర్గర్ వేసిన 15వ ఓవర్లో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హిట్‌మ్యాన్ ఔటయ్యాడు. దీంతో 72 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 21వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన బర్గర్ 36 పరుగులు చేసిన గిల్‌ను ఔట్ చేశాడు. 23వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన బర్గర్ శ్రేయస్ అయ్యర్‌ను డకౌట్ చేశాడు. దీంతో 110 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ జట్టు స్కోర్‌ను 150 పరుగులు దాటించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ అధిక్యం లభించేలా కనిపించింది.

కానీ సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి వేసిన 34వ ఓవర్‌తో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది. ఆ ఓవర్‌లో 8 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌తోపాటు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాను డకౌట్లు చేశాడు. మొత్తంగా ఆ ఒక్క ఓవర్‌లోనే 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా సౌతాఫ్రికా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే రబాడ కూడా చెలరేగాడు. 46 పరుగులతో క్రీజులో కుదురుకున్న విరాట్ కోహ్లీతోపాటు ప్రసిద్ధ్ కృష్ణను డకౌట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ కూడా ఒక్క పరుగు కూడా చేయకుండానే రనౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 35.5 ఓవర్లలోనే 153 పరుగుల వద్ద ఆలౌటైంది. సున్నా పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయింది. ఆశ్చర్యకరంగా 153 పరుగుల తర్వాత మన బ్యాటర్లు ఒక్క పరుగు కూడా జోడించలేకపోయారు. దీంతో ఒకానొక దశలో 153/4తో బలంగా కనిపించిన టీమిండియా ఆ వెంటనే 153 పరుగులకే ఆలౌట్ అయింది. 11 బంతుల్లోనే మిగతా 6 వికెట్లు కోల్పోయింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు కీలకమైన 98 పరుగుల అధిక్యం లభించింది. 46 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ 39, శుభ్‌మన్ గిల్ 36 పరుగులు చేశారు. ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌట్లు అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్, ఎంగిడి, రబాడ మూడేసి వికెట్లు తీశారు.

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు ఎయిడెన్ మాక్రమ్, డీన్ ఎల్గర్ శుభారంభం అందించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. అయితే యువ పేసర్ ముఖేష్ కుమార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. 12 పరుగులు చేసిన ఎల్గర్‌ను పెవిలియన్ చేర్చిన ముఖేష్ కుమార్.. ఆ వెంటనే వన్ డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జి ఒక్క పరుగుకే పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే ఒకే ఒక్క పరుగు చేసిన ట్రిస్టన్ స్టబ్స్‌ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో 45 పరుగులకు సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. క్రీజులో మాక్రమ్ (36), డేవిడ్ బెడింగ్‌హామ్(7) ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా ఇంకా 36 పరుగులు వెనుకబడింది. మొత్తంగా 75.1 ఓవర్లపాటు సాగిన తొలి రోజు ఆటలో 270 పరుగులు రాగా.. ఏకంగా 23 వికెట్ల పడ్డాయి. ఇందులో ఒక రనౌట్ మినహా 22 వికెట్లు బౌలర్లే తీశారు. పడిన వికెట్లన్నీ పేసర్లకే దక్కాయి. రెండు జట్లలో స్పిన్నర్లకు అసలు బౌలింగ్ చేసే అవకాశమే దక్కలేదు.

Updated Date - Jan 03 , 2024 | 09:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising