T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ఆ రికార్డ్ గల్లంతు
ABN, Publish Date - Jun 10 , 2024 | 05:50 PM
టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ఓ ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. అమెరికాలోని...
టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ఓ ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. అమెరికాలోని నసావు కౌంటీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించి.. ఈ రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకూ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. వాటిల్లో పాక్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధిస్తే.. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో భారత్ విజయఢంకా మోగించింది.
ఇంతకుముదు ఈ రికార్డ్ శ్రీలంక (Sri Lanka) పేరిట ఉండేది. అది టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో వెస్టిండీస్ (West Indies) జట్టుపై ఆరు సార్లు విజయం సాధించింది. ఇప్పుడు పాక్‌పై గెలుపుతో అత్యధిక విజయాలు (7) సాధించి, శ్రీలంక రికార్డును భారత్ పటాపంచలు చేసింది. కేవలం టీ20ల్లోనే కాదండోయ్.. వన్డే ఫార్మాట్‌లోనూ పాకిస్తాన్‌పై భారత్‌దే ఆధిపత్యం. వన్డే ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరగ్గా.. అన్నింటిలోనూ భారత్ విజయం సాధించింది. అంటే.. వరల్డ్‌కప్‌లో టీ20, వన్డే ఫార్మాట్‌లలో కలుపుకొని మొత్తం 16 మ్యాచ్‌లు జరిగితే.. భారత్ 15 విజయాలు నమోదు చేసింది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లో.. భారత్‌పై పాక్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఒక్కటి తప్పిస్తే.. వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్‌పై పాక్ ఎప్పుడూ గెలవలేదు.
ఇక 2024 వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో రిషభ్ పంత్ ఒక్కడే 42 పరుగులతో సత్తా చాటాడు. మిగిలిన వారంతా చేతులెత్తేశారు. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. సునాయాసంగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి పాక్ జట్టుని మట్టికరిపించారు. 20 ఓవర్లలో పాక్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. ఆరు పరుగుల తేడాతో ఆ జట్టు ఘోర పరాభావాన్ని చవిచూసింది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 10 , 2024 | 05:50 PM