Share News

IND vs SL: రాణించిన స్మృతి మందాన.. శ్రీలంకకు మోస్తరు లక్ష్యం!

ABN , Publish Date - Jul 28 , 2024 | 04:58 PM

మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మోస్తరు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి..

IND vs SL: రాణించిన స్మృతి మందాన.. శ్రీలంకకు మోస్తరు లక్ష్యం!
India W vs Sri Lanka W

మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మోస్తరు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అర్థశతకంతో స్మృతి మందాన (60) రాణించడంతో పాటు రిచా ఘోష్ (30), రోడ్రిగ్స్ (29) చివర్లో మెరుపులు మెరిపించడంతో.. భారత్ అంత స్కోరు చేయగలిగింది. ఇతరులు మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా 11 పరుగులకే పరిమితం అయ్యింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్నే అందించారు. షెఫాలీ వర్మ, స్మృతి కలిసి తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించగలిగారు. అయితే.. ఈ మ్యాచ్‌లో షెఫాలీ నుంచి ఎలాంటి మెరుపులు మెరవలేదు. గత మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా రప్ఫాడించేసిన ఆమె.. ఫైనల్‌లో మాత్రం తన తడాఖా చూపించలేకపోయింది. 19 బంతుల్లో 16 పరుగులకే ఔట్ అయ్యింది. ఆ తర్వాత ఛేత్రి (9), హర్మన్‌ప్రీత్ (11) వెనువెంటనే ఔట్ అయ్యారు. వీళ్లు ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయారు.


అప్పుడు వచ్చిన రోడ్రిగ్స్.. లంక బౌలర్లకు చెక్కలు చూపించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును.. స్మృతి, రోడ్రిగ్స్ కలిసి ఆదుకున్నారు. మరో వికెట్ వెంటనే పడనివ్వకుండా.. ఆచితూచి ఆడుతూ, వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఫలితంగా.. భారత్ స్కోరు పరుగులు పెట్టింది. ఇక వీళ్ల జోడీ సెట్ అయ్యిందని అనుకునేలోపే.. రోడ్రిగ్స్, మందాన పెవిలియన్ బాట పట్టారు. చివర్లో వచ్చిన రిచా ఘోష్ చిచ్చరపిడుగులా దుమ్ముదులిపేసింది. 14 బంతుల్లోనే 30 పరుగులు చేసింది. దీంతో.. భారత్ స్కోరు 165/6గా నమోదైంది.

Updated Date - Jul 28 , 2024 | 04:58 PM