Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ ఖరారు.. అదొక్కటే ఆలస్యం!
ABN, Publish Date - May 29 , 2024 | 04:40 PM
టీ20 వరల్డ్‌కప్ తర్వాత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిపోతుంది కాబట్టి.. ఆ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేదెవరు? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా...
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) తర్వాత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసిపోతుంది కాబట్టి.. ఆ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేదెవరు? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పదవి కోసం చాలామంది ప్రముఖుల పేర్లు తెరమీదకి వచ్చాయి కానీ, గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పేరు మాత్రం ఎక్కువగా హైలైట్ అయ్యింది. మరీ ముఖ్యంగా.. తాను మెంటార్‌గా ఉన్న కేకేఆర్ (KKR) జట్టు ఐపీఎల్ 2024 (IPL 2024) ఛాంపియన్‌గా నిలిచినప్పటి నుంచి గంభీర్‌నే హెడ్ కోచ్‌గా ఎంపిక చేయాలన్న డిమాండ్ పెరిగిపోయింది.
అయితే.. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం గంభీర్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని, కేవలం ప్రకటన రావడమే ఆలస్యమని తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలకు చాలా దగ్గరగా ఉండే ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన హై-ప్రొఫైల్ ఓనర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. ‘‘భారత జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్ ఎంపిక ఇప్పటికే జరిగింది. అతని అపాయింట్‌మెంట్‌ను ప్రకటించడమే ఆలస్యం’’ అని ఆ ఐపీఎల్ ఓనర్ చెప్పినట్లు క్రిక్‌బజ్ రిపోర్ట్ తెలిపింది. అంతేకాదు.. బీసీసీఐ వర్గాలతో సన్నహితంగా ఉండే ఓ కామెంటేటర్ సైతం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. కేకేఆర్ మెంటార్‌గా చేసిన కృషి.. గంభీర్‌ని ఈ పదవికి తీసుకొచ్చిందని ఆయన తెలిపినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో రాసుకొచ్చింది.
Read Also: జూన్ నెలలో ఈ తేదీలు ఎంతో ముఖ్యమైనవి.. అవేంటంటే?
అంతకుముందు.. కేకేఆర్ విజయం సాధించాక బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah), గంభీర్ మధ్య ‘హెడ్ కోచ్’ గురించే సంభాషణ జరిగినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. ఎలాగైతే ఐపీఎల్‌లో కేకేఆర్‌ని విజేతగా నిలబెట్టారో, అలాగే దేశం కోసం చేయాలని గంభీర్‌తో జైషా చెప్పినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ పాయింట్ చుట్టే ఇద్దరి మధ్య గంటకు పైగా సంభాషణ సాగిందని చెప్పింది. మరి, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే, కొన్నాళ్ల వరకు వేచి చూడాల్సిందే.
Read Latest Sports News and Telugu News
Updated Date - May 29 , 2024 | 04:40 PM