T20 World Cup: హర్భజన్ దెబ్బకు దిగొచ్చిన పాక్ మాజీ ప్లేయర్.. ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు
ABN, Publish Date - Jun 11 , 2024 | 07:16 AM
అప్పుడప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లు తమ నోటిదూల ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా.. భారతీయులపై అనవసరంగా నోరు పారేసుకుంటుంటారు. మైదానంలో భారత్‌కి ధీటుగా పోటీనిచ్చే చేతకాక..
అప్పుడప్పుడు పాకిస్తాన్ (Pakistan) ప్లేయర్లు తమ నోటిదూల ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా.. భారతీయులపై అనవసరంగా నోరు పారేసుకుంటుంటారు. మైదానంలో భారత్‌కి ధీటుగా పోటీనిచ్చే చేతకాక.. మైకుల ముందు రెచ్చిపోతుంటారు. మాజీ ఆటగాడైన కమ్రాన్ అక్మల్ కూడా అలాగే చెలరేగిపోయాడు. భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై (Arshdeep Singh) జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడు. దీంతో.. నెటిజన్లు అతనిపై మండిపడ్డారు. భారత మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సైతం నిప్పులు చెరగడంతో.. కమ్రాన్ దిగొచ్చి క్షమాపణలు చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. ఓ న్యూస్ ఛానెల్ డిబేట్‌లో కమ్రాన్ అక్మల్ పాల్గొన్నాడు. చివరి ఓవర్‌లో పాక్ జట్టు 18 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. అర్ష్‌దీప్ బౌలింగ్‌కు దిగాడు. అప్పుడు కమ్రాన్ అతని మతాన్ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో.. అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. వృత్తిపరంగా సెటైర్లు వేస్తే పర్లేదు కానీ.. ఇలా జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం తగదంటూ అతనిపై ఎగబడ్డారు. హర్భజన్ సింగ్ కూడా దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. సిక్కులపై నోరు పారేసుకోవడానికి ముందు వారి చరిత్ర తెలుసుకోవాలని.. సిక్కుల పట్ల విశ్వాసంతో ఉండు అంటూ చురకలంటించాడు.
‘‘కమ్రాన్.. అలాంటి చెత్త వ్యాఖ్యలు చేసినందుకు నీకు సిగ్గుండాలి. సిక్కులపై నోరు పారేసుకోవడానికి ముందు.. వారి చరిత్ర ఏంటో తెలుసుకో. ఆక్రమణదారులు మీ తల్లులు, సోదరీమణులను అపహరించినప్పుడు.. సిక్కులే వారిని రక్షించారు. నిన్ను చూస్తుంటే అవమానంగా ఉంది. కొంచెం సిక్కుల పట్ల విశ్వాసంతో ఉండు’’ అంటూ ఎక్స్ వేదికగా హర్భజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కమ్రాన్ దిగొచ్చి.. సారీ చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, సిక్కు సమాజానికి క్షమాపణలు కోరుతున్నానని అన్నాడు. సిక్కుల పట్ల తనకెంతో గౌరవం ఉందని, ఎవరినీ నొప్పించాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 11 , 2024 | 07:43 AM