Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఏం తప్పు చేశాడు.. అది ఏమాత్రం సరికాదు
ABN, Publish Date - Jul 20 , 2024 | 03:39 PM
టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో.. అతని తర్వాత టీ20 జట్టు నాయకత్వ పగ్గాలను హార్దిక్ పాండ్యాకే అప్పగిస్తారని అంతా అనుకున్నారు. ఎందుకంటే.. రోహిత్ గైర్హాజరులో అతను..
టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంతో.. అతని తర్వాత టీ20 జట్టు నాయకత్వ పగ్గాలను హార్దిక్ పాండ్యాకే (Hardik Pandya) అప్పగిస్తారని అంతా అనుకున్నారు. ఎందుకంటే.. రోహిత్ గైర్హాజరులో అతను భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్‌లోనూ వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి.. రోహిత్ వారసుడు పాండ్యానే అని అందరూ భావించారు. కానీ.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా నియమించింది. అంతేకాదు.. శుభ్‌మన్ గిల్‌ను వైస్-కెప్టెన్‌గా ఎంపిక చేసింది. దీంతో.. ప్రతిఒక్కరూ షాక్‌కి గురయ్యారు. పాండ్యాకు మద్దతుగా ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ అతనికి అండగా నిలిచాడు. అతనేం తప్పు చేశాడని ప్రశ్నించాడు.
‘‘నా దృష్టిలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయాల్సింది. ఎందుకంటే.. అతనికి కెప్టెన్‌గా మంచి అనుభవం ఉంది. ఐపీఎల్‌లో గుజరాత్ జట్టుకు రెండేళ్లపాటు సారథిగా వ్యవహరించాడు. తొలి సీజన్‌లోనే జట్టుని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. మరోసారి ఫైనల్‌కూ తీసుకెళ్లాడు. టీ20 వరల్డ్‌కప్‌లోనూ వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ.. ఇప్పుడు కొత్త కోచ్ రావడంతో, కొత్త ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ కూడా మంచి ఆటగాడే. అతడు కొన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గానూ ఉన్నాడు. ఇప్పుడు కెప్టెన్‌గా అతను బాగా రాణించాలని కోరుకుంటున్నాను. కానీ.. వాళ్లు హార్దిక్‌కి అండగా ఉండి ఉంటే బాగుండేది’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు. కోచ్‌గా గౌతమ్ గంభీర్ తన నిర్ణయాలను అమలు చేసుకోవచ్చు కానీ.. పాండ్యా కెప్టెన్ కాకుండా పక్కనపెట్టేంత తప్పు చేసి ఉండడని తాను భావిస్తున్నానని పేర్కొన్నాడు. అతను తప్పించడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
ఇదిలావుండగా.. సెలెక్టర్టలో కెప్టెన్సీ విషయంపై చర్చ జరిగినప్పుడు గంభీర్ ఒక కండీషన్ పెట్టినట్లు తెలిసింది. పనిభారం, గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉండే ఆటగాళ్లు కెప్టెన్లుగా వద్దని అతని సెలెక్టర్లతో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. సూర్యకుమార్‌కు కెప్టెన్‌గా నియమించినట్లు వార్తలొస్తున్నాయి. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా సూర్యవైపే మొగ్గుచూపారట. అందుకే.. హార్దిక్ స్థానంలో సూర్యని కెప్టెన్ చేశారు. కాగా.. జులై 27వ తేదీన శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌లు చొప్పున టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. టీ20 సిరీస్‌తో ఈ టూర్ ప్రారంభం కానుంది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 20 , 2024 | 03:55 PM