Rohit Sharma: బిడ్డ పుట్టేసినా మ్యాచ్‌కు రానంటే ఎలా.. రోహిత్‌కు సీనియర్ క్రికెటర్ చురకలు
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:01 PM
ఆసిస్ తో తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం కష్టమేనంటూ రోహిత్ పట్టుబట్టాడు. దీనిపై సీనియర్ క్రికెటర్ల నుంచి అతడికి విమర్శలు ఎదురవుతున్నాయి.
పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో బుమ్రా కెప్టెన్ గా ఉండనున్నాడు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. రోహిత్ ఇటీవలే రెండో సారి తండ్రి కావడం వల్ల తాను తొలి టెస్టుకు అందుబాటులో ఉండలేకపోవచ్చునని గతంలో బీసీసీఐకి రోహిత్ వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సీనియర్ మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా రోహిత్ మ్యాచ్ ఆడాల్సిందేనని డిమాండ్ చేశాడు.
తండ్రైన రోహిత్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూనే సీరీస్ లో అతడి అవసరాన్ని నొక్కి చెప్పాడు. ‘‘ముందుగా రోహిత్ కు అతడి కుటుంబసభ్యులకు కంగ్రాట్స్. ఇప్పుడు అతడికి ఒక కొడుకు, కుమార్తె రావడంతో అతడి కుటుంబం పరిపూర్ణంగా మారింది. ఇంకేంటి..ఇక టెస్టు సిరీస్ కు హాజరై రోహిత్ మ్యాచ్ లో పాల్గొనాలి. నాకు నా పెళ్లి సమయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆరోజు రిసెప్షన్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఉదయం నాలుగైంది. అలాంటి సమయంలోనూ నా భార్య నన్ను మ్యాచ్ కు వెళ్లేందుకు ప్రోత్సహించి పంపింది. క్రికెట్ పట్ల ఆటగాళ్లు అలాంటి నిబద్ధత చూపాలి’’ అంటూ రోహిత్ కు చురకలు అంటించాడు.
ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతున్న వేళ, న్యూజిలాండ్ సిరీస్ లో ఎదురైన అనుభవాలు కలవరపెడుతున్నాయి. వాంఖడే స్టేడియంలో జరిగిన చివరి టెస్టులో మూడో రోజు 25 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత జట్టును కివీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 2000 సంవత్సరం తర్వాత స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు మొదటి సారి ఓటమిని చవిచూసింది. ఈ రిజల్ట్ ప్రభావం ఆసిస్ పర్యటనలో పడకుండా ఉండేందుకు బీసీసీఐ జాగ్రత్త పడుతోంది.
నవంబర్ 22న పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. డిసెంబరు 6న ప్రారంభమయ్యే రెండవ టెస్ట్‌కు అడిలైడ్ ఆతిథ్యం ఇస్తుంది. తర్వాత డిసెంబర్ 14న బ్రిస్బేన్ జరుగుతుంది. బాక్సింగ్ డే టెస్ట్ డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో జరుగుతుంది, ఐదవ చివరి టెస్ట్ జనవరి 3, 2025న సిడ్నీలో ప్రారంభమవుతుంది.
భారత్, ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌పై ఇటీవలి పరాజయం తర్వాత భారతదేశం యొక్క ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆశలకు రాబోయే సిరీస్ కీలకం. ఎందుకంటే భారతదేశం పాయింట్ల శాతం ప్రస్తుతం 58.33% వద్ద ఉంది. స్టాండింగ్‌లలో టేబుల్-టాపర్ ఆస్ట్రేలియా కంటే వెనుకబడి ఉంది. వరుసగా మూడో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు, భారత్ ఐదు టెస్టుల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి.
అమ్మాయిలు.. అదే దూకుడు
Updated Date - Nov 20 , 2024 | 01:11 PM