Hardik Pandya: ఎట్టకేలకు గ్రౌండ్‌లోకి దిగిన హార్దిక్ పాండ్యా.. 3 ఓవర్లు బౌలింగ్ చేసి..
ABN, Publish Date - Feb 26 , 2024 | 09:16 PM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. గాయం కారణంగా సుదీర్ఘ కాలంపాటు టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్‌లో బరిలోకి దిగాడు.
ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. గాయం కారణంగా సుదీర్ఘ కాలంపాటు టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్‌లో బరిలోకి దిగాడు. గాయం నుంచి కోలుకుని 5 నెలల తర్వాత మళ్లీ బ్యాటు, బంతి పట్టుకున్నాడు. డీవై పాటిల్ టీ20 కప్‌లో రిలియన్స్ 1 జట్టు తరఫున హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు. ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్న హార్దిక్.. బీసీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో మెరిశాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవరే బౌలింగ్ ప్రారంభించాడు. మొత్తంగా 3 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ జట్టు కట్టడి చేయడంతో బీపీసీఎల్ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేసింది. అయితే లక్ష్యాన్ని రిలయన్స్ 1 జట్టు కూడా అంత సులువుగా ఏం చేధించలేదు.
15 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసినప్పటికీ ఏకంగా 8 వికెట్లు కోల్పోయింది. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్.. 4 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా హార్దిక్ పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకుని బ్యాటింగ్, బౌలింగ్ చేయడం ఇటు టీమిండియా, అటు ముంబై ఇండియన్స్‌కు శుభ పరిణామంగా చెప్పుకోవాలి. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా ఆ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తాజాగా కోలుకుని బరిలోకి దిగాడు. దీంతో జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు.
Updated Date - Feb 26 , 2024 | 09:16 PM