Team India: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్..
ABN , Publish Date - Nov 04 , 2024 | 01:33 PM
వృద్ధిమాన్ సాహా భారత్ తరఫున 40 టెస్టులు ఆడాడు. ఇందులో 29.41 సగటుతో 1,353 పరుగులు తీశాడు. సాహా టెస్టు క్రికెట్‌లో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
ముంబై: భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఎక్స్ ద్వారా పోస్ట్ చేశాడు. 40 ఏళ్ల సాహా గత మూడేళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2021లో వాంఖడేలో స్డేడియంలో చివరి సారిగా న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో, ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్ తన చివరి టోర్నమెంట్ అని ఈ క్రికెటర్ ఎక్స్ లో పోస్టు చేశాడు. క్రికెట్‌లో ఇన్నేళ్ల పాటు తన అద్భుతమైన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆటకు వీడ్కోలు ప్రకటన చేశాడు.
‘‘క్రికెట్‌లో ఈ రంజీ సీజన్ నా చివరిది. నా ప్రయాణం మరిచిపోలేనిది. ఎట్టకేలకు ఒకసారి బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. రంజీ ట్రోఫీ తర్వాత ఆటకు రిటైర్మెంట్ తీసుకుంటున్నాను’’ అంటూ సాహా తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు.
అత్యుత్తమ స్కోర్..
వృద్ధిమాన్ సాహా భారత్ తరఫున 40 టెస్టులు ఆడాడు. ఇందులో 29.41 సగటుతో 1,353 పరుగులు తీశాడు. సాహా టెస్టు క్రికెట్‌లో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. టీమిండియాలో అత్యుత్తమ వికెట్ కీపింగ్ స్కిల్స్ కలిగిన ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. 2008 నుండి ఐపీఎల్ ప్రతి సీజన్‌లో భాగమయ్యాడు. లీగ్‌లో అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రైక్ రేట్‌తో 2934 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా అతను భారత్ తరపున తొమ్మిది వన్డేలు కూడా ఆడాడు. అందులో 13.67 సగటుతో 41 పరుగులు చేశాడు.
ఐపీఎల్ నుంచి కూడా ఔట్..
మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకోని సాహా రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడటం ఖాయమని అనుకున్నారు. ఇటీవల విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో గుజరాత్ టైటాన్స్ అతడిని నిలబెట్టుకోలేదు. సాహా కూడా మెగా వేలంలోకి వచ్చేందుకు పేరు నమోదు చేసుకోలేదు. ఎం ఎస్ ధోని రిటైర్మెంట్ తర్వాత సాహా టెస్ట్ క్రికెట్‌లో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. టెస్టుల్లో భారత వికెట్ కీపర్లు సాధించిన సెంచరీల విషయంలో ధోనీ, రిషబ్ పంత్ తర్వాత సాహా మూడో స్థానంలో నిలిచాడు.
వివాదంతో బెంగాల్ కు దూరం..
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల తరఫున ఆడాడు. దాదాపు 15 ఏళ్ల పాటు బెంగాల్, త్రిపుర తరఫున రంజీ ఆడాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధికారితో వివాదం కారణంగా సాహా బెంగాల్ జట్టును వీడాల్సి వచ్చింది. అయితే, భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చల తర్వాత సాహా బెంగాల్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.