BAN vs SA: ఆ నిర్ణయమే బంగ్లాదేశ్ కొంపముంచింది.. ఎంత పని చేశావయ్యా!
ABN, Publish Date - Jun 11 , 2024 | 01:57 PM
క్రికెట్‌లో తీసుకొనే కొన్ని నిర్ణయాలు పెద్ద ప్రభావమే చూపుతాయి. మ్యాచ్ ఫలితాలనే అవి మలుపు తిప్పేస్తాయి. ఇందుకు తాజా ఉదంతమే ఉదాహరణగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా..
క్రికెట్‌లో తీసుకొనే కొన్ని నిర్ణయాలు పెద్ద ప్రభావమే చూపుతాయి. మ్యాచ్ ఫలితాలనే అవి మలుపు తిప్పేస్తాయి. ఇందుకు తాజా ఉదంతమే ఉదాహరణగా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భాగంగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికా (Bangladesh vs South Africa) మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం.. బంగ్లా జట్టు కొంపముంచింది. ఆ ఒక్క నిర్ణయమే.. మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసేసింది. లేకపోతే.. కచ్ఛితంగా బంగ్లాదేశ్ విజయం సాధించి ఉండేదని సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమైందంటే..
నసావు కౌంటీ వేదికగా ఆ ఇరుజట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో.. తొలుత సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. దాదాపు లక్ష్యాన్ని ఛేధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. చివరి 4 ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. 17వ ఓవర్‌లో బార్ట్‌మన్ వేసిన రెండో బంతి.. మహ్మదుల్లా ప్యాడ్లను తాకి, స్టంప్స్ వెనుక నుంచి బౌండరీ వెళ్లింది. బంతి నేరుగా ప్యాడ్లను తాకడంతో.. సఫారీ జట్టు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేసింది. దీంతో.. అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
అంపైర్ నిర్ణయంపై బ్యాటర్‌కు అనుమానాలు ఉండటంతో.. డీఆర్ఎస్‌కు వెళ్లాడు. డీఆర్ఎస్‌లో అది నాటౌట్‌గా తేలడంతో.. అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించడంతో.. బంగ్లా స్కోరుకి ఆ బౌండరీని కలపలేదు. సరిగ్గా ఆ నాలుగు పరుగుల తేడాతోనే ఆ జట్టు ఓటమి చవిచూసింది. తద్వారా.. ఆ డీఆర్ఎస్ నిర్ణయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ అంపైర్ మొదట్లో సఫారీ జట్టు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేసినప్పుడు నాటౌట్‌గా ఇచ్చి ఉంటే.. అప్పుడు పరిస్థితులు మరోలా ఉండేవని చెప్పుకుంటున్నారు.
ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేసినప్పుడు ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ఇస్తే, దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారు. డీఆర్ఎస్‌లో అది నాటౌట్‌గా వచ్చినా సరే.. డెడ్‌బాల్ నిర్ణయంలో మార్పు అనేది ఉండదు. అప్పుడు ఎన్ని పరుగులొచ్చినా లెక్కలోకి తీసుకోరు. ఒకవేళ ఆన్‌ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటిస్తే.. పరుగులను జోడిస్తారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ ఔట్ ఇవ్వడంతో.. అది డెడ్‌బాల్‌గా పరిగణించబడింది. అందుకే.. ఆ బౌండరీని లెక్కలోకి తీసుకోలేదు.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 11 , 2024 | 01:57 PM