SRH vs KKR: ఆ రెండు తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయా?
ABN, Publish Date - May 27 , 2024 | 08:05 AM
ఎప్పుడూ లేనంతగా ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎన్నో అద్భుతాలను నమోదు చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ స్కోర్లు చేసి.. క్రీడాభిమానులకు మరపురాని అనుభూతుల్ని..
ఎప్పుడూ లేనంతగా ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎన్నో అద్భుతాలను నమోదు చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ స్కోర్లు చేసి.. క్రీడాభిమానులకు మరపురాని అనుభూతుల్ని పంచింది. క్రికెట్‌లో పరుగుల దండయాత్ర అంటే ఏంటో.. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో నిరూపించింది. ఈ జట్టు కనబర్చిన ప్రదర్శన చూసి.. టైటిల్ నెగ్గడం ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ.. ఫైనల్ మ్యాచ్‌కి వచ్చేసరికి మాత్రం అన్ని తలక్రిందులు అయ్యాయి. బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) చేతిలో అత్యంత ఘోరంగా ఓటమి చవిచూసింది.
ఈ నేపథ్యంలోనే.. ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యంపై విమర్శలు తలెత్తుతున్నాయి. యాజమాన్యం చేసిన వ్యూహాత్మక తప్పిదాలే ఆ జట్టు కొంపముంచాయని, అవే ఫైనల్‌లో ఓటమికి కారణమయ్యాయని కామెంట్లు వస్తున్నాయి. మొదటిది.. మార్క్‌రమ్‌ని ఫైనల్‌లో దింపడం. ఈ సీజన్‌లో అతను పెద్దగా రాణించలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమవుతూ వచ్చాడు. అయినప్పటికీ.. అతడ్ని చివరి మ్యాచ్‌లో ఆడించి తప్పు చేశారని అభిప్రాయాలు వస్తున్నాయి. అతని స్థానంలో న్యూజిలాండ్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్‌ను రంగంలోకి దింపి ఉంటే, పరిస్థితులు మరోలా ఉండేవని అంటున్నారు. ఇక రెండోది.. అబ్దుల్ సమద్. అతను కూడా ఈ సీజన్‌లో ఫామ్‌లో లేనే లేడు. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. అయినా అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపించారు. అబ్దుల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ని తీసుకున్నా.. ఎంతోకొంత ప్రయోజనం ఉండేదని చెబుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాపార్డర్ ఘోరంగా విఫలమవ్వడంతో పాటు ఇతర బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతో.. ఎస్ఆర్‌హెచ్ అత్యల్ప స్కోరుకే చాపచుట్టేయాల్సి వచ్చింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. 10.3 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 114 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి, ఐపీఎల్ టైటిల్‌ని కైవసం చేసుకుంది. ఓపెనర్ గుర్బాజ్ (39) మెరుగ్గా రాణించడంతో పాటు వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్) ఊచకోత కోయడంతో.. కేకేఆర్ ఈ సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది.
Read Latest Sports News and Telugu News
Updated Date - May 27 , 2024 | 08:05 AM