IND vs AUS: 15 పరుగులకే కోహ్లీ ఔట్.. పంత్‌ను కంగారుపెట్టిన బౌలర్లు
ABN, Publish Date - Nov 15 , 2024 | 02:15 PM
వాకా స్టేడియంలో భారత్ ఎ ఆటగాళ్లతో జరుగుతున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కీలక భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, యశస్వి వంటి క్రికెటర్లు ఆదిలోనే నిరాశపరిచినట్టు తెలుస్తోంది.
పెర్త్: పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ లు భారత బ్యాటర్లకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉన్నందును బీసీసీఐ ముందే అప్రమత్తమైంది. ఆసిస్ తో కీలక సిరీస్‌కు ముందే ఇండియా ఎ ఆటగాళ్లతో జట్టును పరీక్షించాలని నిర్ణయించుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు వార్మప్ మ్యాచ్లో భారత జట్టు పాల్గొంటోంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మ్యాచ్ షెడ్యూల్ను బీసీసీఐ ఫిక్స్ చేసింది. అయితే, ఈ మ్యాచ్ కు అభిమానులను అనుమతించలేదు.
పంత్‌దీ అదే తీరు..
ఈ మ్యాచ్ ప్రారంభ రోజున విరాట్ కోహ్లీ తన ఫామ్ ను అందుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. ఇది ఫ్యాన్స్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు నితీశ్ రెడ్డి బౌలింగ్ లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ కూడా క్లీన్ బౌల్డ్ అయినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ పై 0-3 తేడాతో వైట్ వాష్ కు గురైన భారత హీరో రిషభ్ పంత్ మరీ చౌకగా ఔటవ్వడం షాక్ కు గురిచేసింది. రిషబ్ మొదట్లో బాగానే కనిపించాడు కానీ బౌలర్లు షార్ట్ పిచ్ డెలివరీలతో అతనిని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించడంతో కంగారుపడ్డాడు. ఓపెనర్లలో యశస్వి జైస్వా్ కూడా 15 పరుగులకే వెనుదిరిగినట్టు తెలుస్తోంది.
పాత కోహ్లీ మిస్సింగ్..
తొలుత తన ప్రదర్శనతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ ఆ తర్వాత పేలవమైన ఆటతీరుతో 15 పరుగులకే ఔటైనట్టు సమాచారం. కవర్ డ్రైవ్ లతో మొదలుపెట్టి అలరించిన కోహ్లీ.. షాట్ సెలక్షన్ కారణంగా వికెట్ ను కోల్పోయాడు. భారత పేసర్ ముకేశ్ కుమార్ బౌలింగ్లో సెకండ్ స్లిప్ లో ఉన్న ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔటయ్యాడు. వార్మప్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గాయపడినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, కోహ్లీకి స్కానింగ్ అనంతరం తిరిగి మ్యాచ్ లోపాల్గొన్నట్టు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది.
Updated Date - Nov 15 , 2024 | 02:15 PM