Babar Azam-Sehwag: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jun 18 , 2024 | 08:54 AM
టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్ దశ నుంచే నిష్ర్కమించిన దాయాది దేశం పాకిస్థాన్‌పై స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం పాక్ ఆటతీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ జట్టు ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆటతీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది.
టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్ దశ నుంచే నిష్ర్కమించిన దాయాది దేశం పాకిస్థాన్‌పై స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం పాక్ ఆటతీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ జట్టు ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆటతీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది.
ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై బాబర్ 34 బంతులు ఎదుర్కొని 32 పరుగులు మాత్రమే చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్‌గా దిగిపోవాలంటూ గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్త కెప్టెన్ వస్తే జట్టులోకి చోటుకు అనర్హుడు..
పాకిస్థాన్ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తే బాబర్ ఆజమ్ జట్టులో చోటుకు అర్హుడు కూడా కాదని వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. ఒక కెప్టెన్‌గా తన ఆట జట్టుకు ఉపయోగపడుతుందో లేదో ఆలోచించుకోవాలని, టీ20 క్రికెట్‌లో బాబర్ ప్రదర్శన, స్ట్రైక్-రేట్ అంత గొప్పగా లేవని ప్రస్తావించాడు. ‘‘బాబర్ ఆజం సిక్సర్లు కొట్టగలిగే ఆటగాడు కాదు. క్రీజులో సెట్ అయ్యి స్పిన్నర్లు బౌలింగ్ చేసినప్పుడు మాత్రమే సిక్సర్లు కొడతాడు. చక్కటి ఫుట్ వర్క్‌తో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం లేదా కవర్స్ దిశలో అతడు సిక్సర్లు కొట్టడం నేను ఎప్పుడూ చూడలేదు. ఔట్ కాకుండా చాలా సురక్షితంగా బంతులను నేలకు కొడుతుంటాడు. కాబట్టి నిలకడగా పరుగులు చేస్తుంటాడు. కానీ స్ట్రైక్-రేట్ బాలేదు” అని సెహ్వాగ్ విమర్శించాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘జట్టుకు ఉపయోగం లేనప్పుడు స్థానాన్ని కిందికి మార్చుకొని ఆడాలి. పవర్ ప్లే ఉండే తొలి ఆరు ఓవర్లలో పెద్ద షాట్లు ఆడగలిగే ప్లేయర్‌ను పంపాలి. అప్పుడు ఆ జట్టు 50–60 పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది. నా మాటలు కటువుగా అనిపించవచ్చు. కానీ కెప్టెన్ మారితే మాత్రం బాబర్‌కు టీ20 జట్టులో చోటు దక్కదు’’ అని సెహ్వాగ్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు.
కాగా పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్-2024లో అడుగుపెట్టడానికి ముందు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై రెండు వరుస టీ20 సిరీస్‌లలో పాక్ ఆటగాళ్లు ఆకట్టుకోలేదు. పేలవ ఫామ్‌తో టీ20 వరల్డ్ కప్ ఆడారు. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో అనూహ్య రీతిలో ఓడిపోయింది. ఆ తర్వాత భారత్ చేతిలోనూ ఖంగుతింది. మ్యాచ్ గెలిస్తే స్థితిలో ఉండి కూడా భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఇక కెనడా, ఐర్లాండ్ జట్లపై ఆపసోపాలు పడుతూ పాకిస్థాన్ జట్టు రెండు విజయాలు సాధించింది. అయినప్పటికీ ఆ జట్టుకు సూపర్-8 అవకాశం దక్కలేదు.
Updated Date - Jun 18 , 2024 | 08:54 AM