Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ తప్పుకుంటుందా.. అదే జరిగితే..
ABN, Publish Date - Jul 13 , 2024 | 05:14 PM
వచ్చే ఏడాదిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తాము పాకిస్తాన్‌లో అడుగుపెట్టమని, టీమిండియా మ్యాచ్‌లను..
వచ్చే ఏడాదిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు (Champions Trophy 2025) పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తాము పాకిస్తాన్‌లో అడుగుపెట్టమని, టీమిండియా మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ (BCCI) తేల్చి చెప్పింది. నిజానికి.. పాకిస్తాన్‌కు రప్పించాలన్న ఉద్దేశంతో, భారత జట్టుకి (Team India) ఏకైక వేదికగా లాహోర్‌ని ఎంపిక చేసింది. ఆటగాళ్లకు తాము భద్రత కల్పిస్తామని, అందులో ఏమాత్రం లోటు ఉండదని హామీ ఇచ్చింది కూడా!
అయినప్పటికీ బీసీసీఐ నుంచి ఆమోదం లభించలేదు. భారత్ మ్యాచ్‌ల కోసం దుబాయ్ (Dubai) లేదా శ్రీలంకలో (Sri Lanka) ఏదో ఒక వేదికని ఫైనల్ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనపై ఇంకా అధికారిక చర్చ జరగాల్సి ఉంది. మరోవైపు.. బీసీసీఐ డిమాండ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) అంగీకరించడం తప్ప మరో మార్గం లేదు. ఒకవేళ.. భారత్ చేసిన ఈ ప్రతిపాదనని అంగీకరించకుండా, పాక్‌లోనే అన్ని మ్యాచ్‌లను నిర్వహించాలని పీసీబీ పట్టుబడితే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు ఈ టోర్నీ నుంచి వైదొలగొచ్చు. పైగా.. భారత ప్రభుత్వం నుంచి జట్టుకి పాక్‌కు వెళ్లేందుకు అనుమతి లభించే ఛాన్స్ కూడా లేదు. ఒకవేళ అదే జరిగితే.. భారత జట్టు స్థానంలో శ్రీలంక ఈ టోర్నీకి అర్హత సాధిస్తుంది.
కాగా.. 2008లో జరిగిన ఆసియా కప్ తర్వాత భారత జట్టు పాకిస్తాన్‌లో ఆడలేదు. అప్పటి నుంచి ఈ ఇరుజట్లు కేవలం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్‌లలోనే తలపడుతున్నాయి. 2023లో ఆసియా కప్ ఆతిథ్య హక్కులను పాక్ సొంతం చేసుకుంది కానీ, భారత జట్టుకి ఆ దాయాది దేశానికి వెళ్లేందుకు అనుమతి లభించలేదు. దీంతో.. మరో దారి లేక భారత మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ అదే రిపీట్ కావొచ్చని అందరూ అనుకుంటున్నారు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లు ఎంతో కీలకమైనవి కాబట్టి.. హైబ్రిడ్ పద్ధతికి పాక్ అంగీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 13 , 2024 | 05:14 PM