హైబ్రిడ్ పద్ధ్దతిలోనే..
ABN, Publish Date - Dec 20 , 2024 | 06:13 AM
కొంతకాలంగా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఈ మెగా వన్డే టోర్నీని హైబ్రిడ్ పద్ధతిన నిర్వహించనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దీంతో భారత్-పాక్ మధ్య మ్యాచ్‌లు...
తటస్థ వేదికపై భారత్ X పాక్ పోరు
చాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ
దుబాయ్: కొంతకాలంగా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఈ మెగా వన్డే టోర్నీని హైబ్రిడ్ పద్ధతిన నిర్వహించనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దీంతో భారత్-పాక్ మధ్య మ్యాచ్‌లు తటస్థ వేదికపై జరుగనున్నాయి. అలాగే భారత్‌లో జరిగే 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్, 2026 పురుషుల టీ20 వరల్డ్‌కప్, 2027 చాంపియన్స్ ట్రోఫీతో పాటు పాక్ నిర్వహించే మహిళల టీ20 వరల్డ్‌క్‌పలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. అప్పుడు కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు తటస్థ వేదికలపైనే జరుగుతాయని తేల్చింది. ‘ప్రస్తుత సీజన్ (2024-2027)లో భారత్-పాక్ జట్లు ఐసీసీ టోర్నీల్లో ఆడే అన్ని మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో జరిపేందుకు ఆమోదించాం. త్వరలోనే టోర్నీ షెడ్యూల్‌ను కూడా వెల్లడిస్తాం’ అని ఐసీసీ ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న భారత-పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుందని సమాచారం.
భద్రతా కారణాల రీత్యా భారత క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటించేందుకు బీసీసీఐ అంగీకరించని విషయం తెలిసిందే. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతినివ్వకపోవడంతో, టోర్నీని హైబ్రిడ్ పద్ధతిన నిర్వహించాలని భారత్ కోరింది. అటు పాక్ మాత్రం దీనికి అంగీకరించలేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ టోర్నీ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. చివరకు పాక్‌ను హైబ్రిడ్ పద్ధతికి ఒప్పించడంతో కథ సుఖాంతమైంది.
యూఏఈలో చాన్స్!
టోర్నీ ఆద్యంతం పాక్‌లోనే నిర్వహించాలని పట్టుబట్టినా ఎట్టకేలకు హైబ్రిడ్ పద్ధతికి ఆ దేశ క్రికెట్ బోర్డు పచ్చజెండా ఊపింది. అయితే ఇప్పుడు భారత్‌తో పాక్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తిరేపుతోంది. రేసులో శ్రీలంక, యూఏఈ ఉన్నప్పటికీ ఐసీసీ మాత్రం ఎడారి దేశం వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఐపీఎల్, టీ20 వరల్డ్‌క్‌పలాంటి మెగా టోర్నీలు విజయవంతంగా జరిగాయి. దీనికి తోడు దుబాయ్, షార్జా, అబుధాబిలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలున్నాయి. అలాగే భారత్-పాక్ అభిమానులు కూడా సులువుగా ఇక్కడికి చేరుకోగలరు. అన్నింటికన్నా ముఖ్యంగా ఐసీసీ చైర్మన్ జైషాకు యూఏఈ నిర్వహణ సామర్థ్యంపై చక్కటి గురి ఉండడం కూడా ఓ కారణం కానుంది.
Updated Date - Dec 20 , 2024 | 06:13 AM