ఓపెనర్..రాహుల్
ABN, Publish Date - Nov 18 , 2024 | 03:35 AM
మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు జరగాల్సి ఉండగా టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. శుభ్‌మన్ గిల్ బొటన వేలికి ఫ్రాక్చర్ కావడంతో విశ్రాంతి అవసరం కాగా, కెప్టెన్ రోహిత్ కుటుంబ కారణాలరీత్యా....
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ
జురెల్, నితీశ్‌కు చాన్స్
బుమ్రాకు పగ్గాలు
మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు జరగాల్సి ఉండగా టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. శుభ్‌మన్ గిల్ బొటన వేలికి ఫ్రాక్చర్ కావడంతో విశ్రాంతి అవసరం కాగా, కెప్టెన్ రోహిత్ కుటుంబ కారణాలరీత్యా అందుబాటులో ఉండడం లేదు. దీంతో 22 నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో వైస్‌కెప్టెన్ బుమ్రా ఆధ్వర్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. డిసెంబరు 6 నుంచి జరిగే రెండో టెస్టులో రోహిత్ ఆడనున్నాడు. అయితే ఇంట్రా స్క్వాడ్ వామప్‌లో మోచేతి గాయానికి గురైన కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సాధించడం భారత్‌కు సానుకూలాంశం. అతను పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్‌లో శుక్రవారం గాయపడ్డాడు. వెంటనే మైదానం వీడిన రాహుల్ తిరిగి బ్యాట్ పట్టలేదు. ఆదివారం మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేకుండా బ్యాటింగ్ చేయడంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. మూడు గంటలపాటు జరిగిన నెట్స్‌లోనూ చురుగ్గా పాల్గొన్నాడు.
దీంతో యశస్వీ జైస్వాల్‌కు జతగా రాహుల్‌ను ఓపెనర్‌గా దించాలన్న ఆలోచనలో ఉన్నారు. తాను కూడా తొలి టెస్టు ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు రాహుల్ తెలిపాడు. సోమవారం విశ్రాంతి దినం. మ్యాచ్ జరిగే ఓప్టస్ స్టేడియంలో జట్టు మంగళవారం ప్రాక్టీస్ సాగించనుంది.
ఆరో నెంబర్‌లో జురెల్!
ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన రెండో అనధికార టెస్టులో విశేషంగా రాణించిన ధ్రువ్ జురెల్ పెర్త్ టెస్టులో ఆడనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే రిషభ్ పంత్ ప్రధాన కీపర్‌గా ఉండడంతో జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆరో నెంబర్‌లో బరిలోకి దించే అవకాశం ఉందని మీడియా కథనం. కెప్టెన్ రోహిత్, గిల్ లేకపోవడంతో జట్టు జురెల్ వైపు మొగ్గు చూపుతోంది. దీనికితోడు ఇన్‌స్టాలో టీమిండియా జెర్సీ వేసుకుని జురెల్ ఫొటో పోస్ట్ చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
మనోడి అరంగేట్రం ఖాయమా?
తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ కూడా టెస్టు అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. కోచ్ గంభీర్ కూడా అతడిపై ఆసక్తి చూపుతున్నాడు. హార్దిక్ తరహాలో బ్యాటింగ్‌లోనే కాకుండా నాలుగో పేసర్‌గా జట్టుకు ఉపయోగపడగలడని భావిస్తున్నారు. నితీశ్ భారత్ తరఫున బంగ్లాదేశ్‌పై ఇప్పటికే టీ20ల్లో ఆడాడు. అలాగే ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున ఆసీస్ ‘ఎ’పై ఆడినా పెద్దగా రాణించలేదు. ఇక, రెండు అనధికార టెస్టుల్లో ఒక వికెట్ మాత్రమే తీశాడు. కానీ మొత్తంగా 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో నితీశ్ 56 వికెట్లు తీయడం విశేషం.
హర్షిత్, ప్రసిద్ధ్ మధ్య పోటీ
తొలి టెస్టులో మూడో పేసర్ బెర్త్ కోసం ప్రసిద్ధ్ కృష్ణకు హర్షిత్ రాణా గట్టి పోటీనే ఇస్తున్నాడు. నిలకడగా గంటకు 140 కి.మీ వేగంతో బంతులు విసిరే రాణా అదనపు బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. పెర్త్ గ్రౌండ్‌లో భారత బ్యాటర్లకు కూడా తన పదునైన పేస్‌తో సవాల్ విసిరాడు. హర్షిత్ ఇటీవల భారత్ ‘ఎ’ జట్టు తరఫున రెండు అనధికార టెస్టుల్లోనూ ఆకట్టుకున్నాడు.
ఆసీస్‌లోనే దేవ్‌దత్
ముందు జాగ్రత్తగా టాపార్డర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కళ్‌ను ఆస్ట్రేలియాలోనే ఉంచనున్నారు. భారత్ ‘ఎ’ తరఫున ఆడిన అతడిని బ్యాటింగ్ బ్యాక్‌పగా భావిస్తున్నారు. నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌ను దేవ్‌దత్ మెరుగ్గా ఎదుర్కొన్నాడని, అలాగే పేసర్లు ముకేశ్, ఖలీల్, సైనీ కూడా టీమిండియాతోనే ఉంటారని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
షమి ఇప్పుడే వెళ్లడు!
బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీలో పేసర్ మహ్మద్ షమి ఏడు వికెట్లతో రాణించాడు. దీంతో అతడినిఆసీస్ టూర్‌కు పంపుతారని అంతా భావించారు. అయితే వెంటనే కాకుండా సిరీస్ ద్వితీయార్థంలో షమీ అక్కడికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఒక్క మ్యాచ్‌తో అంచనా వేయకుండా మరింత ప్రాక్టీస్ కోసం షమిని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడించాలని భావిస్తున్నారు. అప్పుడే షమి ఫిట్‌నె్‌సపై పూర్తి స్థాయి అవగాహనకు రాగలమని బోర్డు వైద్య సిబ్బంది చెబుతున్నారు.
Also Read:
తిలక్ సక్సెస్ వెనుక తెలుగోడు.. వరుస సెంచరీల సీక్రెట్ ఇదే
పాక్ తోక కత్తిరించిన బీసీసీఐ.. ఏ మొహం పెట్టుకొని ఆడతారో..
ఆసీస్ పొగరు అణిచేందుకు రాక్షసుడ్ని దింపుతున్న గంభీర్
For More Sports And Telugu News
Updated Date - Nov 18 , 2024 | 07:54 AM