Cricket News: టీ20 క్రికెట్‌లో ఎవరూ సాధించని రికార్డు సొంతం చేసుకున్న స్టార్ క్రికెటర్
ABN, Publish Date - Nov 10 , 2024 | 01:35 PM
టీ20 ఫార్మాట్ అంటేనే రికార్డులు.. ఈ పొట్టి ఫార్మాట్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. తాజాగా మరో రికార్డు నమోదయింది.
టీ20 ఫార్మాట్ అంటేనే రికార్డులు.. ఈ పొట్టి ఫార్మాట్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. తాజాగా మరో రికార్డు నమోదయింది. కెన్సింగ్టన్ ఓవల్‌లో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లిష్ ఆటగాడు ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు. చెలరేగి ఆడిన ఈ స్టార్ హిట్టర్ కేవలం 54 బంతుల్లో103 పరుగులు బాదాడు. 9 ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మా్ట్‌లో ఎవరూ సాధించని రికార్డును ఫిల్ సాల్ట్ నెలకొల్పాడు. టీ20లో ఒకే ప్రత్యర్థిపై మూడు సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా ఫిల్ సాల్ట్ నిలిచాడు. గతేడాది విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో సాల్ట్ 2 సెంచరీలు సాధించగా.. తాజాగా మరొకటి నమోదు చేశాడు.
ఫిల్ సాల్ట్ భారీ ఇన్నింగ్స్ సాయంతో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆరంభించింది. అయితే ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసంతో లక్ష్యం చిన్నబోయింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.5 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. ఫిల్ సాల్ట్ 103 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో జాకబ్ బెథెల్ 58 (నాటౌట్), విల్ జాక్స్ 17, జాస్ బట్లర్ 0 చొప్పున పరుగులు చేశారు. మరో 19 బంతులు మిగిలి ఉండగానే గెలుపును అందుకుంది.
వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్ 38, షెపర్డ్ 35 (నాటౌట్) పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు చెప్పకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్ నాలుగు వికెట్లు, ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశారు. జామీ ఓవర్‌టన్, లియామ్ లివింగ్‌స్టన్ చెరో వికెట్ పడగొట్టారు.
Updated Date - Nov 10 , 2024 | 01:35 PM