నిద్రలేని రాత్రులు.. కఠిన సవాళ్లు
ABN, Publish Date - Dec 30 , 2024 | 05:24 AM
నిద్రలేని రాత్రులు.. ఓటమి భారం.. ఇక చెస్ ఆడగలనా అనే ప్రశ్నలు.. వీటన్నింటికి ఈ విజయం సమాధానం చెప్పింది. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు. ఈ దశలో సాధారణంగా క్రీడాకారులు ఆటలో ప్రభ కోల్పోతుంటారు. ఈ ఏడాది రెండు టోర్నీల్లో...
కెరీర్‌కు గుడ్‌బై చెబుదామనుకున్నా
15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్.. మూడు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో ఎన్నో విజయాలు.. మరెన్నో మైలురాళ్లను అధిగమించిన ఘన చరిత్ర.. అర్జున, పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు.. దేశ చదరంగ రారాణిగా నీరాజనాలు.. చెస్ ప్రపంచంలో తిరుగులేని దిగ్గజ గ్రాండ్‌మాస్టర్‌గా పేరు. అంతటి ప్రఖ్యాత క్రీడాకారిణికి ఈ ఏడాది కఠిన సవాళ్లను విసిరింది. రెండు టోర్నీల్లో వరుస ఓటములతో నిద్రలేని రాత్రులు గడిపింది. ఇక కెరీర్‌కు గుడ్‌బై చెబుదామనుకున్న మానసిక స్థితి నుంచి ఒక్కో విజయంతో మునపటి ఆటతీరును మరిపిస్తూ ప్రపంచ ర్యాపిడ్ కిరీటాన్ని సగర్వంగా రెండోసారి అందుకొని చరిత్ర సృష్టించింది. ఏడేళ్ల బిడ్డకు తల్లిగా ఓవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే, మరోవైపు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపి ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
కోనేరు హంపి ‘ఆంధ్రజ్యోతి’తో
నిద్రలేని రాత్రులు.. ఓటమి భారం.. ఇక చెస్ ఆడగలనా అనే ప్రశ్నలు.. వీటన్నింటికి ఈ విజయం సమాధానం చెప్పింది. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు. ఈ దశలో సాధారణంగా క్రీడాకారులు ఆటలో ప్రభ కోల్పోతుంటారు. ఈ ఏడాది రెండు టోర్నీల్లో ఎదురైన పరాభవాలు నా మదిలో ఆటపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేశాయి. ఇకపై నేను చెస్ ఆడగలనా? లేక ఆటకు వీడ్కోలు పలుకుదామా? అనే మానసిక స్థితి నుంచి మరోసారి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. మరి కొంతకాలం చెస్‌తో నా ప్రయాణం కొనసాగించేందుకు ఈ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ ఉత్ర్పేరకాన్ని అందించింది. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు కూడా నాలో నూతన ఉత్తేజాన్ని నింపాయి. అంత:కరణ శుద్ధితో మన పని మనం చేస్తూ ఉంటే ఫలితాలు కచ్చితంగా వస్తాయనేది నా జీవితంలో ఈ విజయంతో రుజువైంది.
తాడో పేడో..
2019లో మాస్కోలో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌పలో టైటిల్ గెలవాలన్న పట్టుదలతో తలపడి విజయం సాధించా. కానీ, ఈసారి మాత్రం కెరీర్ కొనసాగించాలా? లేక రిటైర వ్వాలా అన్న విషయమై ఓ నిర్ణయానికి రావాలన్న ఆలోచనతో బరిలోకి దిగా. టోర్నీ ప్రారంభంలో ఎదురైన ఓటములు నాలో మరింత కసి పెంచాయి. తాడో పేడో తేల్చుకుందామనే ధోరణిలో మిగిలిన గేమ్‌ల్లో ఆడి గెలిచా. ఈ విజయం నా కెరీర్‌లోనే అత్యుత్తమమైనది.
కొవిడ్ తర్వాత
చాలా మార్పులు
మాస్కోలో జరిగిన పోటీల్లో నేను ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను తొలిసారి గెలిచినప్పటికి, ఇప్పటికి ఆటలో చాలా మార్పులు వచ్చాయి. గ్రాండ్‌మాస్టర్ల ఎత్తుల్లో వేగం, వ్యూహాత్మకత పెరిగింది. ఆన్‌లైన్ చెస్ సాహిత్యం పెరగడంతో విభిన్న ప్రారంభ ఎత్తులను ప్లేయర్లు భయం లేకుండా ప్రయోగిస్తున్నారు. ఆన్‌లైన్ చెస్ పోటీలు పెరగడంతో సాధనకు అవకాశాలు అధికమయ్యాయి. కాలానుగుణంగా వచ్చిన మార్పులను గమనించి, నేను నా ఆటకు పదును పెట్టడంతో మళ్లీ విజయాల బాట పట్టా. ఈ టోర్నీ కోసం ఆన్‌లైన్ చెస్ ప్రాక్టీసు పోటీల్లో ఎక్కువ పాల్గొన్నా. చెస్ పజిల్స్‌ను వేగంగా పరిష్కరించే సాధన కూడా బాగా ఉపకరించింది.
ర్యాపిడ్ కఠినమైనది
క్లాసికల్‌లో మేటి చెస్ క్రీడాకారిణిగా నాకు పేరు ఉంది. ఈ ఆధునిక చెస్‌లో క్లాసికల్‌లో సాధించిన ఫలితాలు ర్యాపిడ్‌లో లభించడం కష్టంగా మారింది. ర్యాపిడ్ ఫార్మాట్ అంత వైవిధ్యంగా, కఠినంగా ఉంటుంది. అలాంటి ర్యాపిడ్‌లో కూడా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం ఆనందంగా ఉంది. ఇక.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫిడే గ్రాండ్ ప్రీ టోర్నీ కోసం సన్నద్ధమవ్వాలనుకుంటున్నా.
ప్రధాని మోదీ ప్రశంస
హంపిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. ‘ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌ప గెలిచిన హంపికి అభినందనలు. ఆమె పట్టుదల, అద్భుత నైపుణ్యాలు సదా స్ఫూర్తి నింపుతాయి. ర్యాపిడ్ టైటిల్ రెండుసార్లు అందుకోవడంతో ఈ గెలుపు ఆమెకు మరింత చరిత్రాత్మకం’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 05:24 AM