PV Sindhu: గగనంలో చిగురించి.. ఏడడుగులు నడిపించి..
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:47 AM
యువ వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో స్టార్ షట్లర్ పీవీ సింధు ఏడడుగులు నడిచింది. భార్యగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆమె..తన భర్త దత్తసాయితో తొలి పరిచయం గురించిన వివరాలను పంచుకుంది...
దత్తసాయితో లవ్‌స్టోరీపై సింధు
న్యూఢిల్లీ: యువ వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో స్టార్ షట్లర్ పీవీ సింధు ఏడడుగులు నడిచింది. భార్యగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆమె..తన భర్త దత్తసాయితో తొలి పరిచయం గురించిన వివరాలను పంచుకుంది. 2022 అక్టోబరులో విమానంలో మొదటిసారి దత్తసాయిని చూడగానే అతడిపై ప్రేమ చిగురించిందని వెల్లడించింది. ‘అది మొదలు నా జీవితం ఎంతో మారిపోయింది’ అని సింధు ఉద్వేగంగా చెప్పింది. ‘ఆ పయనం మా ఇద్దరిని దగ్గర చేసింది. రెండు నక్షత్రాలు ఒకటైన భావన కలిగింది. ఒక విధంగా అది ‘లవ్ ఎట్ ఫస్ట్‌సైట్’ అని సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది. తమ ఎంగేజ్‌మెంట్‌ను హడావుడి లేకుండా కొద్దిమంది సమక్షంలో జరుపుకోవడంపై వివరణ ఇచ్చింది. ‘ఆ వేడుక ఆర్భాటంగా చేసుకొనేది కాదు. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహితంగా జరుపుకొనే మధుర క్షణం.
అన్నింటికీ మించి జీవితాంతం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకం’ అని సింధు పేర్కొంది. వివాహానికి తాను, సాయి ఎలా ప్లాన్ చేసుకున్నామో కూడా తెలిపింది. ‘ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా నా షెడ్యూల్ ఎంతో బిజీగా ఉంటుంది. అందువల్ల పెళ్లికి ఏం కావాలి, ఎలా చేయాలనే విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నా. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక వేసుకున్నా. మరోవైపు..ఆ ప్రణాళికలన్నీ సాఫీగా సాగేలా..నా ప్రతి కలా నిజమయ్యేలా దత్తా సహకరించాడు. మొత్తంగా.. ఇద్దరమూ పెళ్లి వేడుకను అపురూపం చేసుకున్నాం’ అని సింధు వివరించింది.
Updated Date - Dec 26 , 2024 | 07:47 PM