Share News

T20 World Cup Semis : అఫ్ఘాన్‌కు అద్భుత అవకాశం

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:32 AM

తుది దశకు చేరిన టీ20 వరల్డ్‌ కప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సంచలన అఫ్ఘానిస్థాన్‌-తొలిసారి ఐసీసీ టోర్నీ టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉన్న సౌతాఫ్రికా తలపడనున్నాయి. వర్ణ వివక్ష నిషేధం నుంచి బయటపడి 1991లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన

T20 World Cup Semis : అఫ్ఘాన్‌కు అద్భుత అవకాశం

దక్షిణాఫ్రికాతో సెమీస్‌ నేడు

మ్యాచ్‌కు శుక్రవారం రిజర్వ్‌ డే

టరోబా (ట్రినిడాడ్‌) : తుది దశకు చేరిన టీ20 వరల్డ్‌ కప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో సంచలన అఫ్ఘానిస్థాన్‌-తొలిసారి ఐసీసీ టోర్నీ టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉన్న సౌతాఫ్రికా తలపడనున్నాయి. వర్ణ వివక్ష నిషేధం నుంచి బయటపడి 1991లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సఫారీలు..నాటినుంచి ఇప్పటివరకు టీ20, వన్డే వరల్డ్‌ కప్‌లలో టైటిల్‌ ఫైట్‌కు చేరలేదు. పైగా..ప్రతి మేజర్‌ టోర్నీలలో కీలక మ్యాచ్‌ల్లో తడబాటుకు లోనవుతూ ‘చోకర్లు’గా పేరు పొందింది దక్షిణాఫ్రికా జట్టు. ఈసారి అందుకు భిన్నంగా ఉత్కంఠ భరిత మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్‌ వరకు వచ్చింది. నేపాల్‌పై ఒక్క పరుగుతో, బంగ్లాదేశ్‌పై నాలుగు రన్స్‌తో, వెస్టిండీ్‌సపై మూడు వికెట్లతో నెగ్గడం విశేషం. అపజయమే లేకుండా సెమీస్‌ వరకూ దూసుకొచ్చిన సౌతాఫ్రికా ఆ జోరు కొనసాగిస్తుందా అనేది చూడాలి. ఓపెనర్‌ డికాక్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. మార్‌క్రమ్‌, స్టబ్స్‌, క్లాసెన్‌తో మిడిలార్డర్‌ డైనమిక్‌గా ఉంది. ఇక హార్డ్‌హిట్టర్‌ మిల్లర్‌ సంగతి చెప్పాల్సిన పనిలేదు. స్పిన్నర్లు కేశవ్‌, షంసీ ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టగలరు. మరోవైపు..20 ఏళ్ల కిందట..2004లో ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ట్రోఫీలో అఫ్ఘానిస్థాన్‌ తమ మొదటి అంతర్జాతీయ పోటీ ఆడింది. ఆపై రెండు దశాబ్దాల్లోనే ఏకంగా టీ20 వరల్డ్‌ కప్‌ సెమీ్‌సకు చేరడం ఆ జట్టు అనూహ్య పురోగతికి అద్దం పడుతుంది. కెప్టెన్‌ రషీద్‌ అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌లో ముందుండి జట్టును అమోఘంగా నడిపిస్తున్నాడు. ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ పవర్‌ ప్లేలో ప్రత్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాడు. పేసర్లు ఫరూఖి, నవీనుల్‌ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడిస్తున్నారు.

జట్లు (అంచనా)

సౌతాఫ్రికా : మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), డికాక్‌, హెన్‌డ్రిక్స్‌, మిల్లర్‌, క్లాసెన్‌, స్టబ్స్‌, యాన్సెన్‌, కేశవ్‌, రబాడ, నోకియా, షంసీ.

అఫ్ఘానిస్థాన్‌ : రషీద్‌ (కెప్టెన్‌), ఇబ్రహీమ్‌ జద్రాన్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌/హజ్రతుల్లా జజాయ్‌, అజ్మతుల్లా, నైబ్‌, నబీ, జానత్‌/ఇషాఖ్‌ (కీపర్‌), ఖరోటె, నవీనుల్‌, నూర్‌, ఫరూఖి.

పిచ్‌/వాతావరణం

వికెట్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సహకరిస్తుంది. తొలి ఓవర్లు బ్యాటర్లకు అనుకూలిస్తాయి. మ్యాచ్‌ సాగే కొద్దీ స్పిన్నర్లదే హవా. టోర్నీలో ఈ పిచ్‌పై జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో..రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్లు మూడుసార్లు నెగ్గాయి. వర్షానికి ఐదు శాతమే అవకాశం.

Updated Date - Jun 27 , 2024 | 05:34 AM