స్పిన్ యోధుడు ఆపేశాడు
ABN, Publish Date - Dec 19 , 2024 | 06:05 AM
భారత క్రికెట్‌లో ఓ అధ్యాయం ముగిసింది. వెటరన్ ఆఫ్ స్పిన్నర్, 38 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ ప్రస్థానానికి తెరపడింది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీమిండియాలో చెరగని ముద్ర వేసిన అశ్విన్.. బుధవారం సంచలన నిర్ణయం...
అశ్విన్ అనూహ్య వీడ్కోలు
ఎలాంటి ముందస్తు ప్రకటనా లేదు..
హంగూ ఆర్భాటం అసలే లేదు..
అస్సలు రిటైర్మెంట్ ఆనవాళ్లే కనిపించలేదు..
అందరిలోనూ ఆశ్చర్యం తప్ప అక్కడేమీ లేదు..
ఎన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో మరపురాని అనుభూతులు భారత క్రికెట్‌కు అందించిన స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన పద్నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి అనూహ్య ముగింపు పలికాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించి ఆశ్చర్య పరిచాడు.
బ్రిస్బేన్: భారత క్రికెట్‌లో ఓ అధ్యాయం ముగిసింది. వెటరన్ ఆఫ్ స్పిన్నర్, 38 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ ప్రస్థానానికి తెరపడింది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీమిండియాలో చెరగని ముద్ర వేసిన అశ్విన్.. బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ జరుగుతుండగానే ఆటకు వీడ్కోలు పలికాడు. ఏమాత్రం విజయావకాశాల్లేని మ్యాచ్‌లను ఎన్నింటినో తనదైన ప్రదర్శనతో గెలిపించిన అశ్విన్.. క్రికెట్ నుంచి అనూహ్యంగా తప్పుకొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగినా, ఐపీఎల్‌లాంటి లీగ్‌లతో పాటు క్లబ్ క్రికెట్‌లో కొనసాగుతానని అశ్విన్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం కెప్టెన్ రోహిత్‌తో కలిసి అశ్విన్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. ‘భారత క్రికెటర్‌గా నాకిదే చివరిరోజు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నా. అయితే, నాలో ఇంకాస్త క్రికెట్ ఉందని అనుకుంటున్నా. తప్పకుండా క్లబ్ క్రికెట్‌లో ఆడతా. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఎన్నో అనుభవాలను అందించిన నా సహచర ఆటగాళ్లతో పాటు బీసీసీఐకి, నా ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన కోచ్‌లకు ధన్యవాదాలు. ఇక, రోహిత్, రహానె, పుజారాలాంటి ఆటగాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. వీళ్లంతా స్లిప్స్‌లో క్యాచ్‌లు అందుకోవడం వల్లే నేనివాళ ఇన్ని వికెట్లు సాధించగలిగా. ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ థాంక్యూ. వాళ్లతో ఆడడాన్ని ఆస్వాదించా’ అని అన్నాడు. ఇక.. ‘ఇది భావోద్వేగపూరితమైన క్షణం. ఈ సమయంలో మీ ప్రశ్నలకు సమాధానమివ్వలేను. ఇందుకు నన్ను క్షమించండి’ అని మీడియానుద్దేశించి అశ్విన్ వ్యాఖ్యానించాడు. బోర్డర్-గవాస్కర్ సిరీ్‌సలో తొలి టెస్టుకు దూరమైన అశ్విన్.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో మాత్రం ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఓ వికెట్ తీసిన అశ్విన్‌ను డ్రాగా ముగిసిన మూడో టెస్టుకు మాత్రం తీసుకోలేదు.
టెస్టుల్లో రారాజు...
చెన్నైకి చెందిన అశ్విన్.. 2010 జూన్ 5న శ్రీలంకతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అదే ఏడాది జూన్ 12న జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ ఆడిన అశ్విన్.. 2011 నవంబరు 6న వెస్టిండీ్‌సతో టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. గతేడాది అక్టోబరులో ఆస్ట్రేలియాతో కెరీర్ చివరి వన్డేను ఆడిన అశ్విన్.. 2022లో ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో పాల్గొన్నాడు. టెస్టు క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అశ్విన్.. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌ల ఘన వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించాడు. కుంబ్లే (619) తర్వాత టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. టెస్టుల్లో అత్యధికసార్లు (11) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్‌తో సమంగా నిలిచాడు.
అశ్విన్ కెరీర్ గ్రాఫ్..
ఫార్మాట్ మ్యాచ్‌లు వికెట్లు బెస్ట్ పరుగులు సెం. అ.సెం.
టెస్టులు 106 537 7/59 3503 6 14
వన్డేలు 116 156 4/25 707 - 1
టీ20లు 65 72 4/8 184 - -
37 సార్లు - టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన
8 సార్లు - ఒక టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన
నా అవసరం లేకుంటే..ఎందుకు?
తన అనూహ్య రిటైర్మెంట్ ప్రకటనకు ముందు అశ్విన్..కెప్టెన్ రోహిత్ శర్మతో ఘాటుగానే మాట్లాడాడట ! ‘సిరీ్‌సలో నా అవసరం లేకుంటే ఆటకు వీడ్కోలు పలకడమే ఉత్తమం’ అని అశ్విన్ ఖరాఖండిగా చెప్పాడని కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు. నిజానికి..స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత నుంచే రిటైర్మెంట్‌పై అశ్విన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తనకు తుది 11 మంది జట్టులో స్థానం లభించకపోతే..తానసలు ఆస్ట్రేలియానే వెళ్లనని జట్టు యాజమాన్యానికి సిరీస్‌కు ముందే అశ్విన్ స్పష్టం చేసినట్టు సమాచారం.
హఠాత్ నిర్ణయం అందుకేనా?
సిరీస్ మధ్యలో అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇంకా రెండు టెస్టులు మిగిలున్న నేపథ్యంలో అతడు ఆడే అవకాశాలు దాదాపు లేవనే భావించాలి. తాజాగా గాబా టెస్ట్‌లో జడేజా ఆకట్టుకొనే ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకొన్నాడు. దీంతో తర్వాతి 2 మ్యాచ్‌ల్లో తనకు అవకాశాలు కష్టమని అశ్విన్ భావించి ఉండవచ్చు. పైగా వాషింగ్టన్ సుందర్‌ను మేనేజ్‌మెంట్ ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. దీంతో ఇక తాను జట్టుతో ఉండడంలో అర్థం లేదని భావించి ఉంటాడని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా భారత జట్టుకు వచ్చే ఏడాది జూన్‌దాకా టెస్టుల్లేవు. అందుకే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు.
బ్రిస్బేన్‌ను వీడిన అశ్విన్..
రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అశ్విన్.. బ్రిస్బేన్‌లోని భారత జట్టును వీడి స్వదేశానికి బయల్దేరాడు. కాగా, జట్టు మేనేజ్‌మెంట్ అశ్విన్‌కు బ్రిస్బేన్‌లోనే ఘనంగా విందు ఏర్పాటు చేయాలనుకుందట. అయితే, సమయాభావం కారణంగా అది సాధ్యం కాలేదని సమాచారం.
నీకు నీవే సాటి..
బౌలింగ్ ప్రయోగాలు చేయడంలో, బ్యాటింగ్‌లో మార్పులను అర్ధం చేసుకోవడంలో నీకు నీవే సాటి.
- సచిన్ టెండూల్కర్
ఆడిన తొలి మ్యాచ్ మొదలు ఆఖరి వరకు మ్యాచ్ విన్నర్ అనే ముద్ర వేసి వెళ్లావు.
- రోహిత్ శర్మ
రిటైర్మెంట్ విషయం చెప్పగానే ఉద్వేగానికి లోనయ్యా. ఒక్కసారిగా మనం కలిసి ఆడిన క్షణాలన్నీ గుర్తొచ్చాయి. ఈ ప్రయాణంలో నీతో కలిసి ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. -
విరాట్ కోహ్లీ
బంతితో మాయ చేసే మాంత్రికుడు. ఆటను చదవగలిగే ప్రజ్ఞాశీలి.
- జైషా (ఐసీసీ చైర్మన్)
Updated Date - Dec 19 , 2024 | 06:05 AM