Women's T20 World Cup : పోరాటమే లేకుండా..
ABN, Publish Date - Oct 05 , 2024 | 02:47 AM
ఈసారైనా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను పట్టేయాలనే కసితో ఉన్న భారత జట్టుకు.. ఆరంభ మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ సేన ఏకంగా 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
ఆరంభ మ్యాచ్‌లో భారత్ ఓటమి
58 రన్స్ తేడాతో కివీస్ ఘనవిజయం
దుబాయ్: ఈసారైనా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను పట్టేయాలనే కసితో ఉన్న భారత జట్టుకు.. ఆరంభ మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ సేన ఏకంగా 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది. అటు బౌలర్లూ ఆకట్టుకోలేక.. ఇటు బ్యాటర్లూ రాణించలేక తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. స్టార్లతో కూడిన బ్యాటింగ్ లైన్‌పలో కనీసం ఒక్కరు కూడా 20 పరుగులు చేయకపోవడం గమనార్హం. అటు వరుసగా పది మ్యాచ్‌ల ఓటములతో ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టిన కివీస్ మాత్రం అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 7 ఫోర్లతో 57 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో రాణించగా.. ఓపెనర్లు ప్లిమ్మర్ (23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34), సుజీ బేట్స్ (24 బంతుల్లో 2 ఫోర్లతో 27) ఆకట్టుకున్నారు. పేసర్ రేణుకా సింగ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 19 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. సారథి హర్మన్‌ప్రీత్ (15) టాప్ స్కోరర్. పేసర్లు రోజ్‌మేరీ మెయిర్‌కు 4, తహుహుకు 3 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా సోఫీ డివైన్ నిలిచింది.
బ్యాటింగ్ పేలవం:
స్లో పిచ్‌పై భారీ ఛేదన బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగలేకపోయింది. పవర్‌ప్లేలోనే జట్టు షఫాలీ (2), స్మృతి మంధాన (12), హర్మన్‌ప్రీత్‌లను కోల్పోవడంతో మ్యాచ్ ఫలితం తేలిపోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలిచి మంధాన ఆశలు రేపినా.. కివీస్ బౌలర్లు సమష్టి రాణింపుతో దెబ్బతీశారు. ఓపెనర్లను స్పిన్నర్ ఈడెన్ కర్సన్ పెవిలియన్‌కు చేర్చి వికెట్ల పతనాన్ని ఆరంభించగా.. పేసర్ తహుహు మిడిలార్డన్‌ను దెబ్బతీసింది. దీంతో ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలువలేకపోయారు. హర్మన్ వికెట్ తీసిన మెయిర్ ఆ తర్వాత టెయిలెండర్ల పనిబట్టడంతో భారత జట్టు అతికష్టమ్మీద 19వ ఓవర్‌లో వంద పరుగులకు చేరి ఆలౌటైంది.
డివైన్ దూకుడు:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ల జోరుకు చివర్లో సోఫీ డివైన్ బాదుడు జత కలవడంతో కివీస్ ఈ పిచ్‌పై భారీ స్కోరు సాధించగలిగింది. దీనికి తోడు భారత ఫీల్డింగ్ వైఫల్యం కూడా కివీ్‌సకు కలిసివచ్చింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ బేట్స్ రెండు ఫోర్లతో సత్తా చాటింది. ఇక మూడో ఓవర్‌లో మరో ఓపెనర్ ప్లిమ్మర్ 4,6తో చెలరేగగా స్పిన్నర్ దీప్తి 16 పరుగులు సమర్పించుకుంది. ఆరో ఓవర్‌లోనూ ఆమె రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 55 పరుగులతో దూసుకెళ్లింది. అదే ఓవర్‌లో బేట్స్ క్యాచ్‌ను కీపర్ రిచా వదిలేసింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించాక వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరింది. అయితే ఈ సంతోషాన్ని ఆవిరి చేస్తూ సోఫీ డివైన్ బ్యాట్ ఝుళిపించడంతో.. కివీస్ ఆటలో ఎక్కడా వేగం తగ్గలేదు.
అమేలీ కెర్ (13) అవుట్ విషయంలో కాస్త హైడ్రామా నెలకొన్నా ఆమె ఎక్కువ సేపు నిలువలేదు. అటు డివైన్ మాత్రం వరుస ఫోర్లతో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచింది. దీంతో 15 ఓవర్లలో స్కోరు వంద దాటింది. 18వ ఓవర్‌లో బ్రూక్ హాలిడే (16) రెండు, డివైన్ మరో ఫోర్‌తో 16 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో డివైన్ చక్కటి ఫోర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేయడంతో పాటు స్కోరును 160కి చేర్చగలిగింది. చివరి ఐదు ఓవర్లలో డివైన్ ధాటికి కివీస్ 51 పరుగులు రాబట్టింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 160/4 (డివైన్ నాటౌట్ 57, ప్లిమ్మర్ 34, బేట్స్ 27; రేణుకా సింగ్ 2/27, అరుంధతి 1/28, శోభన 1/22).
భారత్: 19 ఓవర్లలో 102 ఆలౌట్ (హర్మన్‌ప్రీత్ 15, జెమీమా 13, స్మృతి మంధాన 12; మెయిర్ 4/19, తహుహు 3/15, కర్సన్ 2/34).
Updated Date - Oct 05 , 2024 | 02:47 AM