High Court: వరంగల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. హైకోర్టులో 200 మంది పిటిషన్లు..
ABN, Publish Date - Aug 27 , 2024 | 10:57 AM
అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. బడాబాబులు ఎక్కడపడితే అక్కడ.. చెరువులను కూడా పూడ్చేసి మరీ స్థలాలను ఆక్రమించి భారీ బిల్డింగ్‌లు లేపేశారు. హైడ్రా ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
వరంగల్: అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. బడాబాబులు ఎక్కడపడితే అక్కడ.. చెరువులను కూడా పూడ్చేసి మరీ స్థలాలను ఆక్రమించి భారీ బిల్డింగ్‌లు లేపేశారు. హైడ్రా ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతను కొందరు వ్యతిరేకిస్తుండగా మెజారిటీ ప్రజానీకం మాత్రం మద్దతుగా నిలుస్తోంది. పలు పార్టీలకు సైతం హైడ్రాకు మద్దతు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్లంతా కలవనున్నారు. హైడ్రాకు మద్దతు తెలపనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోనూ హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు దీనిని జిల్లాకు విస్తరింప జేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ లేఖలు రాశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తమ లేఖల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
వరంగల్‌లోనూ అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. హైకోర్టులో 200 మంది ఇప్పటికే కూల్చివేతలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వరంగల్ దేశాయిపేట్ ఎంహెచ్ నగర్ చిన్నవడ్డేపల్లి చెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అక్కడంతా పేదలు పట్టా భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఇల్లు కూల్చేస్తామని వరంగల్ మునిసిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. నోటీసులను సవాల్ చేస్తూ 200మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ వినోద్ కుమార్ విచారణ నిర్వహించారు. ఎలాంటి సర్వే చేయకుండా ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
30 నుంచి 60 చదరపు గజాల స్థలంలోనే పిటిషనర్ల గుడిసెలు ఉన్నాయని పిటిషన్ తరుఫు న్యాయవాది వాదించారు. ప్రజలకు జారి చేసిన పట్టాలపై విచారణ జరపాలని.. అప్పటివరకు పిటిషనర్లను అక్కడి నుంచి వెళ్లగొట్టొద్దని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ప్రకటించారు. హైదరాబాద్ తర్వాత అన్ని జిల్లాల్లోనూ చెరువులు పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని... హైడ్రాకు మంచి స్పందన వస్తోందని, ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీగా ఉండేదని, చెరువుల పరిరక్షకులు ఆక్రమణలపై ఆధారాలను సంబంధిత అధికారులకు అందజేయాలని పొన్నం సూచించారు.
Updated Date - Aug 27 , 2024 | 10:57 AM