TG : 24కు చేరిన మృతుల సంఖ్య
ABN, Publish Date - Sep 04 , 2024 | 05:43 AM
రాష్ట్రంలో శనివారం నుంచి కురిసిన కుండపోత వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు, వరదల దెబ్బకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
వానలు, వరదలతో రాష్ట్రంలో తీవ్ర నష్టం
14 వేల మూగజీవాల మరణం
6,000 ఇళ్లు, 1900 కి.మీ రోడ్లు విధ్వంసం
130 గ్రామాలపై తీవ్ర ప్రభావం
హైదరాబాద్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనివారం నుంచి కురిసిన కుండపోత వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు, వరదల దెబ్బకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల వల్ల ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అధికంగా దెబ్బతిన్నాయి. సూర్యాపేట, భద్రాది కొత్తగూడెం, ములుగు ప్రాంతాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలు, వరదల వల్ల సుమారు 130 గ్రామాలు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో అయిదుగురు, కామారెడ్డిలో నలుగురు, కొత్తగూడెంలో ముగ్గురు, మహబూబాబాద్‌లో ముగ్గురు, ములుగులో ఇద్దరు, నారాయణపేట్‌లో ఇద్దరు, పెద్దపల్లిలో ఇద్దరు, సిద్దిపేటలో ఇద్దరు, వనపర్తిలో ఒకరు మరణించారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి 14వేల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అలాగే ఆరు వేల ఇళ్లు, 84 ప్రభుత్వ పాఠశాలలు ధ్వంసమయ్యాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వరదల్లో చిక్కుకున్న 4500 మందిని రక్షించగా, ప్రభుత్వ పునరావాస శిబిరాల్లో 11,300 మంది ఆశ్రయం పొందుతున్నారు. అలాగే, వర్షాల దెబ్బకు రహదారుల భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సుమారు 1900 కి.మీ మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఖమ్మం, ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని రోడ్లు అధికంగా ధ్వంసమయ్యాయి.
Updated Date - Sep 04 , 2024 | 05:46 AM