రాష్ట్రంలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్: దామోదర రాజనర్సింహా
ABN, Publish Date - Nov 12 , 2024 | 05:20 PM
రాష్ట్రంలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ఆరోగ్య శాఖ నజర్ పెట్టింది. నకిలీ, నాసిరకం మందులను ఎక్కువ ధరకు అమ్మే వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్: నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే ముఠా ఆటకట్టించేందుకు తెలంగాణ ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆయన సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో కంప్లైంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం, డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) అధికారులతో వెంగళరావునగర్‌లోని డీసీఏ ఆఫీసులో మంత్రి రాజ నర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఫిర్యాదు చేయొచ్చు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడిసిన్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 21,639 తనిఖీలు నిర్వహించి, 3416 సంస్థలపై(మెడికల్ షాప్స్, మానుఫాక్చరింగ్ యూనిట్స్) యాక్షన్ తీసుకున్నామని డీసీఏ అధికారులు మంత్రికి తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఒక్కటే ఉందని, దీనివల్ల ఎక్కువ సాంపిల్స్‌ను టెస్ట్ చేయలేకపోతున్నామని అధికారులు మంత్రికి తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో(1956) ప్రారంభమైన ఈ ల్యాబులో నెలకు గరిష్టంగా 400 సాంపిల్స్ మాత్రమే పరీక్షించగలుగుతున్నామని వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 3255 సాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేయగలిగామని తెలిపారు.2014 నాటికి సుమారు 20 వేల మెడికల్ షాపులు ఉంటే, ఇప్పుడు 45 వేలకు పెరిగాయని.. కానీ, గత పదేండ్లలో కొత్తగా డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ రాలేదని, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచలేదన్నారు.ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త ల్యాబులను ఏర్పాటు చేస్తామని మంత్రి అధికారులకు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణ, కొత్తగా 4 ల్యాబుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
నిబంధనలు పాటించని వారిపై కొరడా..
మషల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, కనీసం 150(అడిషనల్‌గా ఇంకో 80 పోస్టులు) మంది అవసరం అని అధికారులు మంత్రికి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించి అవసరమైనమేర పోస్టులు మంజూరు చేయిస్తామని మంత్రి తెలిపారు.డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను వారు పనిచేస్తున్న ఏరియాకే పరిమితం చేయొద్దని, ర్యాండమ్‌గా ఇతర డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పరిధిలోని సంస్థల్లో తనిఖీలకు పంపించాలని డీజీ కమలాసన్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు.డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. మెడిసిన్ ధరలు, నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లఘించే హస్పిటళ్ల సమాచారాన్ని డీఎంహెచ్‌వోలకు అందజేయాలని, ఆయా హాస్పిటళ్లపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్‌ను(మత్తును కలిగించే మెడిసిన్) విచ్చలవిడిగా అమ్ముతున్నవారిపై నిఘా పెట్టాలని మంత్రి సూచించారు.
రోగులకు నాణ్యమైన మందులు..
ప్రభుత్వ దవాఖాన్లకు పంపిణీ చేసే మెడిసిన్ కొనుగోలు విషయంలో టీజీఎంఎస్‌ఐడీసీకి అవసరమైన సహకారాన్ని డీసీఏ(డ్రగ్ కంట్రోల్ అథారిటీ) అందించాలని మంత్రి సూచించారు.టీజీఎంఎస్‌ఐడీసీకి మెడిసిన్ సప్లై చేసే సంస్థల మానుఫాక్చరింగ్ యూనిట్స్‌ను డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేయాలని, ర్యాండమ్ గా మెడిసిన్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయాలని ఆదేశించారు. మెడిసిన్ ప్రొక్యూర్‌మెంట్‌కు ముందు తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగించాలన్నారు. నిబంధనలు పాటించకపోయినా, నాసిరకం మెడిసిన్ అని తేలినా, ఆయా సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచించారు. టీజీఎంఎస్‌ఐడీసీ పరిధిలో ఉండే సెంట్రల్ మెడికల్ స్టోర్స్‌ను కూడా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేయాలని, అక్కడ మెడిసిన్ సరియైన విధానంలో భద్రపరుస్తున్నారో, లేదో చెక్ చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్లకు నాణ్యమైన మెడిసిన్ అందించేలా డీసీఏ, టీజీఎంఎస్‌ఐడీసీ చర్యలు ఉండాలన్నారు.సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీసీఏ డీజీ విబి.కమలాసన్‌రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి.రాందాన్ తదితరులు పాల్గొన్నారు.
Congress: కొడంగల్ ఇష్యూ.. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు
Updated Date - Nov 12 , 2024 | 05:20 PM