Husband: భార్య జ్ఞాపకాల్లో..
ABN, Publish Date - Sep 02 , 2024 | 11:57 AM
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 2006లోనే తల్లిదండ్రులకు చెప్పారు. వారు అంగీకరించలేదు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. అశోక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో కలిసి సత్తుపల్లిలో స్థిరపడ్డాడు.
ఖమ్మం: చేతిలో చేతి వేయించి నూరేళ్ల జీవితంలో తోడుగా ఉంటానని పెళ్లి సమయంలో ప్రామిస్ చేయిస్తారు పెద్దలు. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టాక.. ఒకరిపై ఒకరు పెంచుకునే ప్రేమకు సాటి ఏదీ ఉండదు. చిన్న చిన్న గొడవలు వచ్చినా.. అర్థం చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. అనుకోని సంఘటన ఇద్దరినీ విడదీసినప్పుడు జీవితం ఒక్కసారిగా చీకటి అవుతుంది. ఎన్నో జ్ఞాపకాలు.. మధుర క్షణాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. దూరం అవుతున్నారనే ఆలోచన మానసికంగా చంపేస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తికి ఎదురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. భార్య ప్రాణం పోయాక కూడా ఆమె చేయి పట్టుకునే ఉండాలనే ఆలోచనతో కొత్త ప్రయత్నం చేశాడు.
ప్రేమ, పెళ్లి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 2006లోనే తల్లిదండ్రులకు చెప్పారు. వారు అంగీకరించలేదు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. అశోక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో కలిసి సత్తుపల్లిలో స్థిరపడ్డాడు. 18 ఏళ్ల పాటు వీరి వివాహ బంధం అన్యోన్యంగా సాగింది. ఎన్నో మధురానుభూతులు.. ప్రేమతో సాగింది సంసారం. వీరి అన్యోన్నయ దాంపత్యానికి తీపిగుర్తుగా ఒక పాప కూడా జన్మించింది. కలతలు లేని కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. కళకళలాడే ఇంటిని కళావిహీనం చేసింది.
అనారోగ్యం.. కన్నుమూత
పద్మశ్రీ అనారోగ్యానికి గురైంది. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం కుదుట పడలేదు. కొద్దిరోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులను కాదనీ.. భార్య, బిడ్డే ప్రపంచంగా బతుకుతున్న అశోక్ గుండెపగిలింది. తోడు లేదని తెలుసుకుని బోరున విలపించాడు. ఇన్నాళ్లు చేతి పట్టుకుని నడిపించిన అర్ధాంగి ఇక తోడు ఉండదని గ్రహించాడు. ఆమె జ్ఞాపకంగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో భార్య అంత్యక్రియల రోజే భార్య చేయిని.. తన చేయి, కూతురు చేయితో కలిసి కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ చేయించుకున్నాడు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన నిపుణులు దీన్ని తయారు చేశారు. భార్య.. తన చేయితో పాటుగా కూతురు చేతిని పట్టుకున్న స్మృతిని పదిలంగా దాచుకున్నాడు.
భార్య చేయి పదిలంగా..
భార్యను మరువ లేక ఆ భర్త పడుతున్న వేదనను చూసిన బంధువులు సైతం కంటతడి పెట్టారు. అశోక్‌కు ధైర్యం చెబుతూ.. కూతురిని బాగా చూసుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అశోక్ తన భార్య చనిపోయిన తర్వాత చేయి వదలకుండా పట్టుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయనది గొప్ప మనస్సు అని అభివర్ణిస్తున్నారు. హ్యాండ్ కాస్టింగ్ ద్వారా భార్య జ్ఞాపకాన్ని పదిలం చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Updated Date - Sep 02 , 2024 | 12:10 PM