Land Dispute: ప్రాణం తీసిన భూవివాదం
ABN, Publish Date - Jun 15 , 2024 | 05:43 AM
భూమి పంపకాల వివాదం.. ఓ ప్రాణాన్ని బలిగొంది. దాయాదుల ఘర్షణలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంచిన్నపొర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన సంజప్ప(28) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
దాయాదుల మధ్య ఘర్షణ
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
నారాయణ పేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో ఘటన.. ఎస్సై సస్పెన్షన్
ఊట్కూర్, జూన్ 14: భూమి పంపకాల వివాదం.. ఓ ప్రాణాన్ని బలిగొంది. దాయాదుల ఘర్షణలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంచిన్నపొర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన సంజప్ప(28) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. చిన్నపొర్లకు చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు బాలమ్మ, తిప్పమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య బాలమ్మకు సంజప్ప, రెండో భార్య తిప్పమ్మకు పెద్ద సవరప్ప, చిన్న సవరప్ప అనే కుమారులు ఉన్నారు. లక్ష్మప్పకు ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని ముగ్గురు సంతానానికి సమానంగా పంపిణీ చేశారు.
ఈ పంపకాన్ని మొదటి నుంచి బాలమ్మ మనవడు ఆటో సంజీవ్ వ్యతిరేకిస్తున్నాడు. పది రోజుల క్రితం పెద్ద సవరప్ప కుమారుడు సంజప్ప తన పొలం సాగు కోసం వెళ్లగా దాయాదులు అడ్డుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ వివాదం కోర్టు తీర్పు వచ్చే వరకు యథావిధిగా ఉండాలని పోలీసులు సూచించారు. అనంతరం గురువారం పెద్ద సవరప్ప, చిన్న సవరప్ప, సంజప్ప పొలం దున్నడానికి వెళ్లారు.
విషయం తెలుసుకున్న దాయాదులు బాలమ్మ మనుమడు ఆటో సంజీవ్, గుట్టప్ప, ఆశప్పతదితరులు పొలం వద్దకు చేరుకొని గొడవకు దిగారు. అనంతరం సంజప్పపై కర్రలతో దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చిన్న సవరప్ప, పెద్ద సవరప్పలు కూడా గాయపడ్డారు. డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు రాకపోవడంతో అక్కడే రెండు గంటలపాటు ఉన్నామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.
చివరికి మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సంజప్ప మృతి చెందాడు. పోలీసులు స్పందించకపోవడంతోనే సంజప్ప మృతి చెందాడని గ్రామస్థులు ఆరోపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా కుటుంబ సభ్యులు, బంధువులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు.
డీఎస్పీ లింగయ్య మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుడి చిన్నమ్మ కవిత ఫిర్యాదుతో ఏడుగురిపై కేసు నమోదు చేసి, నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన ఊట్కూర్ ఎస్సై బి.శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఐజీ పి.సుధీర్‌బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లి, ఊట్కూర్ ఘటనలపై సీఎం సీరియస్
హైదరాబాద్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పట్టపగలు వ్యక్తిపై దాడిచేసి హత్య చేసిన ఘటన, పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియ్‌సగా స్పందించారు. భౌతికదాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. బాలికపై హత్యాచారం ఘటన బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
Updated Date - Jun 15 , 2024 | 05:44 AM