Kumaram Bheem Asifabad: నెరవేరిన కల..
ABN , Publish Date - Feb 02 , 2024 | 10:34 PM
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 2: ఎట్టకేలకు ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నేరవేరింది. ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఆప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర మున్సిపాలిటి విభాగం డైరెక్టర్ డి దివ్య గురువారం ఉత్తర్వులను జారీచేశారు.

- మున్సిపాలిటీగా ఆసిఫాబాద్ పట్టణం
- జీవో విడుదల చేసిన ప్రభుత్వం
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 2: ఎట్టకేలకు ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నేరవేరింది. ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఆప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర మున్సిపాలిటి విభాగం డైరెక్టర్ డి దివ్య గురువారం ఉత్తర్వులను జారీచేశారు. దీంతో మేజర్ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ బల్దియాగా కొత్తరూపు సంతరించుకోనుంది. ఆరు సంవత్సరాల తర్జన భర్జనల తర్వాత ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆసిఫాబాద్ పట్టణంతోపాటు జన్కాపూర్, గొడవెల్లి గ్రామాలను కలుపుకొని 20వార్డులతో కూడిన మున్సిపాలిటీగా అవతరించనుంది. శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యకలపాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కమిషనర్ అంజయ్య ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఇన్‌చార్జీ బాధ్యతలను స్వీకరించారు.
ఎట్టకేలకు జీవో జారీ..
ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నూతన జిల్లాగా ఆసిఫాబాద్‌ను ఏర్పాటు చేసింది. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరుగలేదు. గతంలో ప్రభుత్వం ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ప్రకటించినప్పటికీ ఏజెన్సీ ప్రాంతం ఉండటంతో 5వ షెడ్యూళ్లు, 1/70 చట్టం పరిధిలో ఉండటం అడ్డంకిగా మారింది. పాలనపరమైన ఇబ్బందులతో రాష్ట్రపతి అనుమతి అవసరమైంది. దీనిపై ప్రభుత్వం పలుమార్లు చొరవచూపించినా మారిన రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. దీంతో మధ్యే మార్గంగా మున్సిపల్ ఏర్పాటుకు ఆటంకంగా మారిన ఆంశాలను పరిష్కరించి వీలైనంత మేర రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలోనే ఈ ప్రక్రియకు ముగింపు పలకలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని 5వ షెడ్యూళ్లు, 1/70చట్టం పరిధిలోకి వచ్చే రాజంపేటను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ 2022డిసెంబరు 16న గత ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసే అంశంపై అప్పటి కేబినేట్ నిర్ణయించింది. 20వార్డులతో కూడిన మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం తీర్మాణించి గవర్నర్ వద్దకు ఫైల్‌ను పంపింది. ఈ క్రమంలో ప్రభుత్వం పంపిన బిల్లులతోపాటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు బిల్లుకు కూడ గవర్నర్ అమోద ముద్ర వేసింది. దీంతో తాజాగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ జీవో జారీచేసి అన్ని ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు సూచించింది. దీంతో ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆసిఫాబాద్ పట్టణప్రజల కల సాకారం అయింది.
నిజాం కాలంలోనే జిల్లాగా..
1913నుంచి 1940వరకు జిల్లా కేంద్రంగా కొనసాగిన ఆసిఫాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండోసారి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పేరుతో జిల్లా కేంద్రంగా ఏర్పడింది. నిజాం కాలంలో జిల్లాకేంద్రంగా వెలుగొందిన ఆసిఫాబాద్ 1940లో జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు తరలిపోయింది. అయితే జిల్లా కేంద్రం తరలిపోయినప్పటికి 1961 వరకు పురపాలక కేంద్రంగా కొనసాగింది. ఆతర్వాత కాగజ్‌నగర్‌ను మున్సిపాలిటీగా మార్చడంతో ఆసిఫాబాద్ పట్టణాన్ని మేజర్ గ్రామపంచాయతీగా మార్చారు. తాజాగా ఆగస్టు2, 2019లో గత ప్రభుత్వం నూతన మున్సిపాలిటీగా ఆసిఫాబాద్‌ను ప్రకటించింది. పాలనపరమైన ఆటంకాలు ఏర్పడటంతో అది అమలుకు నోచుకోలేదు. గురువారం కొత్త ప్రభుత్వం ఆసిఫాబాద్‌ను 20 వార్డులతో కూడిన మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది.
మారనున్న ముఖచిత్రం..
ఆసిఫాబాద్ మేజర్ గ్రామపంచాయతీని 2016లో తెలంగాణ గత ప్రభుత్వం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. జిల్లాకేంద్రం అయినప్పటికీ మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో ఆశించినస్థాయిలో పట్టణం అభివృద్ధి చెందలేదు. నిధులలేమితో అభివృద్ధి పనులు చేపట్టడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఆసిఫాబాద్‌ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో జిల్లా కేంద్రం ముఖచిత్రం మారనుంది. జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాలైన గొడవెల్లి, జన్కాపూర్‌తోపాటు పట్టణంలోని 20వార్డులను కలుపుకొని మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పట్టణంలోని అంతర్గత రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం, రోడ్ల వెడల్పు తదితర అభివృద్ధి పనులు జరుగనున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ పట్టణం రాజంపేట, జన్కాపూర్, వైఎస్‌ఆర్ నగర్, ఆర్‌ఆర్‌కాలనీ, సందీప్‌నగర్ వరకు విస్తరించి ఉంది. జన్కాపూర్, గొడవెల్లి కలుపుకొని 20వార్డులతో మున్సిపాలిటీ, రాజంపేట ప్రాతం అంతా నూతన గ్రామపంచాయతీగా ఏర్పడనుండగా ఆసిఫాబాద్ ముఖచిత్రం మారనుంది.