Kumaram Bheem Asifabad: గుడ్డు ఉడుకుతలే..
ABN, Publish Date - Dec 22 , 2024 | 10:24 PM
బెజ్జూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): కోడిగుడ్డు ధర ఆకాశన్నంటుతోంది. ఇది పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారీ ఏజెన్సీలకు భారంగా మారుతోంది.
మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు
- అమాంతం పెరిగిన ధర
- గిట్టుబాటు కాదంటున్న వంట నిర్వాహకులు
బెజ్జూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): కోడిగుడ్డు ధర ఆకాశన్నంటుతోంది. ఇది పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారీ ఏజెన్సీలకు భారంగా మారుతోంది. సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఉడికించిన గుడ్డు అందించాలి. కానీ కొద్దినెలలుగా గుడ్డు ధర అమాంతం పెరగడంతో చాలా పాఠశాలల్లో వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే వడ్డిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు పోషకాహారానికి దూరమవుతున్నారు. ఒక్కో గుడ్డుకు రూ.5ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ ప్రస్తుతమార్కెట్‌లో గుడ్డు ధర రూ.8వరకు ఉంది.
ధరలు పెంచితేనే..
ఐదు నెలలుగా గుడ్డు ధర అమాంతం పెరిగింది. గతంలో ఎప్పుడూ ఇంతగా పెరిరగిన దాఖలాలు లేవు. కిందటి ఆగస్టు నెలలో రూ.5.50ఉండగా, ప్రస్తుతం రూ.8కి చేరింది. రానున్న రోజుల్లో ఇంకెంత పెరుగుతుందోనని వంట ఏజెన్సీ మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం గురకులాలు,వసతిగృహాల విద్యార్థులకు డైట్‌చార్జీలు 40శాతంవరకు పెంచినక్రమంలో పెరిగిన నిత్యావసరాల కనుగుణంగా మధ్యాహ్న భోజన తయారీ ఏజెన్సీలకు ధరలు పెంచాలని కోరుతున్నారు.
నెలలో 12సార్లు..
మధ్యాహ్న భోజనంలో వారంలో మూడుసార్లు నెలలో 12సార్లు గుడ్డును అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం గుడ్డుకు రూ.5మాత్రమే ఇవ్వడంతో ఒక్కో విద్యార్థిపై నెలకు అదనంగా రూ.24భారం పడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈభారం భరించలేక కొన్నిపాఠశాలల్లో గుడ్డుకు బదులుగా రాగి జావ, ఇతర కూరగాయలను వండి వడ్డిస్తున్నారు. కొన్నిపాఠశాలల్లో ఏజెన్సీలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ నష్టపోయినా సరే గుడ్డును అందిస్తున్నాయి. జిల్లాలో అన్నిరకాల పాఠశాలలు 990ఉండగా, 42,350మంది విద్యార్థులు చదువుతున్నారు. 1591వంట ఏజెన్సీలున్నాయి. దీంతో ఆయా పాఠశాలలో గుడ్డు ధరలు పెరగడం వారికి శాపంగా మారింది.
Updated Date - Dec 22 , 2024 | 10:24 PM