ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్రాల వద్ద కనీస వసతులు కరువు

ABN, Publish Date - Oct 25 , 2024 | 10:54 PM

పంట చేతి కొచ్చి విక్రయించే వరకు రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సమస్యలు అలాగే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రతీ సీజన్‌లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టార్పాలిన్లు లేకపోవడంతో అకాలవర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోంది.

మంచిర్యాల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పంట చేతి కొచ్చి విక్రయించే వరకు రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సమస్యలు అలాగే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రతీ సీజన్‌లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టార్పాలిన్లు లేకపోవడంతో అకాలవర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యాన్ని ఆరబోసేందుకు చాలి నంత స్థలం లేకపోవడంతో తేమ సమస్యను ఎదుర్కొం టున్నారు. తేమ శాతం సాకుగా చూపి కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు. ధాన్యాన్ని మిల్లు లకు తరలించడంలోనూ రైతులు అవస్థలు ఎదుర్కొంటు న్నారు. రైస్‌మిల్లులకు తీసుకువెళ్లిన తర్వాత మిల్లర్లు ధాన్యం సరిగా లేదని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇలా అడుగడుగునా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలపై పౌరసరఫరాల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడం లేదు. ఈ సీజన్‌లో అయినా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోలుకు సన్నాహాలు...

వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గత నెల 25న అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అక్టోబరు చివరి వారం నుంచి పంట దిగుబడులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. గన్నీ బ్యాగులు, వాహనాలు, కూలీలను సమకూర్చుకునేందుకు ప్రతిపాద నలు సిద్ధం చేశారు. ఈ యేడాది కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్‌ రకం క్వింటాలుకు రూ.2320 కాగా సాధారణ రకానికి రూ.2300 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ క్వింటాలుకు రూ. 500ను అందించేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేయడంతో ధాన్యం క్వింటాలు ధర రూ. 2800 ప్రకారం రైతులకు దక్కనుంది. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం ఇక్కడి రాకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో 267 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 3,29,983 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గోనె సంచుల కొరత తేరేనా...?

గోనె సంచులు, లారీల సమస్య ప్రతీ సారీ వేధిస్తూనే ఉంది. ధాన్యం కొనుగోళ్లకు సంచుల కొరత లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రంగానే ఉంది. ఈ విషయంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. సంచులు లేవనే నెపంతో వారంలో ఓ రోజు కొనుగోళ్లను నిలిపి వేసిన సందర్భాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు 82.49 లక్షల గోనె సంచులు అవసరం కాగా, ప్రస్తుతం 30 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 52.49 లక్షల సంచులను సేకరించాల్సి ఉండగా, జూట్‌ మిల్లుల నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లారీల కొరత కారణంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను తరలించక పోవడంతో అకాల వర్షాలకు తడుస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు తిరస్కరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో జీవో ప్రకారం అయిదుగురు సిబ్బంది ఉండాలి. కేవలం ఒకరిద్దరితో కొనుగోళ్లు చేస్తుండడంతో ఆలస్యం జరుగుతోంది.

వేధిస్తున్న స్థల సమస్య...

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థల సమస్య వేధిస్తోంది. అరకొరగా ఉన్న స్థలాల్లో ధాన్యం అరబోసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై ధాన్యం ఆరబోయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా ధాన్యం తడిచిపోకుండా టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అందించడం లేదు. అలాగే మార్కెటింగ్‌ అధికారులూ కేంద్రాలకు సరఫరా చేయడం లేదు. నవంబరు మొదటి వారంలో వానాకాలం కోతలు ప్రారంభిస్తారు. దీంతో ముందస్తుగానే కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అక్కడక్కడ కొనుగోలు కేంధ్రాలు ప్రారంభం కాగా, పూర్తిస్థాయిలో ప్రారంభం అయ్యేలోపే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. కాగా అక్టోబరు చివరి వారం కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు.

Updated Date - Oct 25 , 2024 | 10:54 PM