సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
ABN, Publish Date - Oct 20 , 2024 | 07:45 AM
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు పలుమార్లు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది.
ముత్యాలమ్మ గుడి వద్ద హిందూ సంఘాల ఆందోళన
ఓ ప్రార్థనా మందిరంలోకి దూసుకెళ్లే యత్నం
లాఠీచార్జ్‌తో ఆగ్రహం.. పోలీసులపైకి రాళ్లు, చెప్పులు
ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఏసీపీ, సీఐకి గాయాలు
ఇంటర్నెట్ సేవల నిలిపివేత.. తెరుచుకోని దుకాణాలు
బీజేపీ కార్యకర్తలకు కిషన్‌రెడ్డి, బండి పరామర్శ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు పలుమార్లు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. పలువురికి గాయాలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. హిందూ సంఘాల బంద్ పిలుపుతో ఆయా ప్రాంతాల్లో ఒక్క షాపు కూడా తెరుచుకోలేదు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా వీహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్) శనివారం ర్యాలీ చేపట్టింది. ఇందులో పలు ధార్మిక సంఘాలు పాల్గొనగా.. వేలాదిగా జనం తరలివచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఉదయం మహాకాళి ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బాటా, మోండా చౌరస్తా మీదుగా ముత్యాలమ్మ ఆలయం వరకు సాగింది.
ఆ సమయంలో కొంతమంది సమీపంలోని ఓ వర్గానికి చెందిన ప్రార్థనా మందిరం వైపు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా వారు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇంతలోనే మరో ర్యాలీ ఆలయానికి చేరుకోగా.. ఆందోళన తీవ్రమైంది. దీంతో పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేయగా.. పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరు బీజేపీ కార్యకర్తల తలలు పగిలాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరారు. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు మహిళా కానిస్టేబుళ్లను ముందు వరుసలో నిలబెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు. కొంతమందిని ఆలయం వద్ద నుంచి బలవంతంగా పంపించేశారు. ఈ సమయంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన రోడ్డుపై పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు చేరుకుని రాస్తారోకో చేయడంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
చివరకు సాయంత్రం ఆలయం ముందున్న వారు వెళ్లి పోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న వారిని సైతం పోలీసులు లాఠీలు ఝుళిపిస్తూ పంపించేశారు. అదనపు సీపీ శేఖర్ రెడ్డి, నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్రల పర్యవేక్షణలో పోలీసులు నిరసనకారులను కట్టడి చేశారు. ఇటు ర్యాలీలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టి రాబోయే కాలంలో హిందూ దేవాలయాలపై ఎవడూ కన్నెత్తి చూడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రశాంతంగా ఉన్న నగరంలో అల్లర్లు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయి. కొందరు ఉన్మాదులు ఓ హోటల్‌లో సమావేశమై మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు’ అని నిలదీశారు.
అంతకుముందు నిరసనకారులు సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం ఎదుట ఉన్న మెట్రోపోలీస్ హాటల్‌పై దాడికి యత్నించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడితో పాటు సుమారు 150 మంది ఆ హోటల్‌లో కొద్ది రోజుల క్రితం సమావేశమయ్యారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే ఆ హోటల్ సీజ్ చేసినా.. దానిలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి చేయిదాటిపోతుందని గుర్తించిన పోలీసులు.. సికింద్రాబాద్ ప్రాంతంలో కొద్దిసేపు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. మరోవైపు.. వీహెచ్‌పీ పిలుపు మేరకు సికింద్రాబాద్‌లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్యాట్నీ, ప్యారడైజ్, జనరల్ బజార్, పాన్‌బజార్, మహంకాళి వీధి, బర్తన్ బజార్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లోని దుకాణాలు, వర్తక, వాణిజ్య సంస్థలు, హోటళ్లు తెరుచుకోలేదు.
ర్యాలీకి అనుమతే లేదు..: నార్త్‌జోన్ డీసీపీ
హిందూ ధార్మిక సంఘాలు తలపెట్టిన ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ తెలిపారు. ఎంత సర్దిచెప్పినా వినకుండా ఓ వర్గం ప్రార్థనా మందిరాన్ని కూల్చేసే ఆలోచనతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతోనే లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. దాదాపు 6 వేల మంది ర్యాలీలో పాల్గొన్నారని.. రెండు గ్రూపులుగా ఆలయం వద్దకు వచ్చి ఆందోళన సృష్టించారన్నారు. ఓ హోటల్ సమీపంలో కొందరు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారని.. సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించామన్నారు. రెండు, మూడ్రోజుల్లో వారిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఆందోళనల్లో కొందరు నిరసనకారులతో పాటు ఓ ఏసీపీ, సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయని చెప్పారు.
బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రుల పరామర్శ
లాఠీచార్జ్‌లో బీజేపీ కార్యకర్తలు సికింద్రాబాద్ పికెట్‌కు చెందిన వెంకటేశ్, ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన సాయికుమార్‌కు తీవ్ర గాయాలవ్వగా.. వారిని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పరామర్శించారు. వెంకటేశ్ తలకు 8 కుట్లు పడగా.. కేంద్రమంత్రులు వేర్వేరుగా ఇంటికి వెళ్లి కలిశారు. భయపడొద్దని, కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.. ఇటు సాయి తలకు 6 కుట్లు పడగా.. ఆయన ఇంటి వెళ్లి సంజయ్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయాలపై దాడులు చేస్తున్న మతోన్మాదులపై చర్యలు తీసుకోకుండా.. శాంతియుతంగా నిరసన చేస్తున్న హిందువులపై లాఠీచార్జ్ చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.
Updated Date - Oct 20 , 2024 | 07:48 AM