TG : వారంలో ‘కమిషన్ల’ నియామకాలు!?
ABN, Publish Date - Sep 04 , 2024 | 03:13 AM
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన నాయకులకు త్వరలోనే పదవులు దక్కనున్నాయి. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి పదవులివ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు.
కసరత్తు పూర్తి చేసిన రేవంత్.. విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరు మురళి
రైతు కమిషన్‌కు కోదండరెడ్డి..?
బీసీ కమిషన్‌కు గోపిశెట్టి నిరంజన్!
సభ్యులతో కలిపి 25 మందికి పైగా పదవులు
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌పై తర్జనభర్జనలు
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన నాయకులకు త్వరలోనే పదవులు దక్కనున్నాయి. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి పదవులివ్వడంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. వివిధ కమిషన్లకు చైర్మన్లు, సభ్యుల నియామకాల కసరత్తును దాదాపు పూర్తి చేశారు. ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయిన రేవంత్‌రెడ్డి.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించారు. అయితే ఒక్కో కమిషన్‌కు చైర్మన్, సభ్యులు కలిపి కనీసం నలుగురికి పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా పదవులపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. విద్య, రైతు, బీసీ, ఎస్సీ. ఎస్టీ, మానవ హక్కులు తదతర కమిషన్లకు చైర్మన్లు, సభ్యుల నియామకాలపై చర్చించారు.
వారం పది రోజుల్లో ఈ నియామకాలు పూర్తి కానున్నాయని, 25 మందికి పైగా నేతలకు పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విద్యా కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి, రైతు కమిషన్ చైర్మన్‌గా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిల పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు కమిషన్‌పైనా ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనుంది. ఆయా కమిషన్లకు ఆకునూరి మురళి, కోదండరెడ్డిలను చైర్మన్లుగా, ఆరుగురిని సభ్యులుగా నియమించనుంది. అలాగే బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో వారం పది రోజుల్లోనే కొత్త చైర్మన్, సభ్యులను నియమించనున్నట్లు తెలిసింది. కమిషన్ చైర్మన్‌గా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఎస్సీ, ఎస్టీ కమిషన్ విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్లుగా విడగొట్టాలా? లేక యథాతథంగా కొనసాగించి కొత్త చైర్మన్, సభ్యులను నియమించాలా? అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కమిషన్‌ను యథాతథంగా కొనసాగిస్తే తొందర్లోనే చైర్మన్, సభ్యుల నియామకం జరుగుతుందని.. విడదీయాలని నిర్ణయిస్తే మాత్రం చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Updated Date - Sep 04 , 2024 | 03:27 AM