ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anand Malligavade: చెరువుల ఆక్రమణను ఉపేక్షిస్తే.. విధ్వంసమే!

ABN, Publish Date - Nov 21 , 2024 | 04:48 AM

టెకీ నుంచి పర్యావరణవేత్తగా మారారు.. ఏడేళ్లలో 115 చెరువులను పునరుద్ధరించారు.. 12 రాష్ట్రాలకు సలహాదారుగా ఉన్నారు.. ‘లేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందారు.

  • ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలి

  • పేదలకు న్యాయం చేయాలి.. పక్కా ఇళ్లు ఇవ్వాలి

  • పర్యావరణ పరిరక్షణకు మూసీ ప్రాజెక్టు కీలకం

  • పూర్తయితే హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయ్‌

  • సీఎం రేవంత్‌ హైడ్రా నిర్ణయం దేశానికే మార్గదర్శనం

  • ఆయన నిజాయితీ నచ్చింది.. పూర్తి సహకారం అందిస్తా

  • ‘ఆంధ్రజ్యోతి’తో ‘లేక్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ ఆనంద్‌

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): టెకీ నుంచి పర్యావరణవేత్తగా మారారు.. ఏడేళ్లలో 115 చెరువులను పునరుద్ధరించారు.. 12 రాష్ట్రాలకు సలహాదారుగా ఉన్నారు.. ‘లేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందారు. ఆయనే కర్ణాటకకు చెందిన ఆనంద్‌ మల్లిగావడ్‌. బెంగళూరులో తీవ్రమవుతున్న నీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా.. పర్యావరణవేత్తగా మారిన ఆయన.. ఏడేళ్లలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు 15 రాష్ట్రాల్లో 115 మురికినీటి చెరువులను శుద్ధి చేసి, తాగునీటి వనరులుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌ వచ్చిన ఆనంద్‌.. మూడు రోజులుగా రాజధానిలో పర్యటిస్తున్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి ఉన్నతాధికారులతో కలిసి.. మురికికూపాలుగా మారిన చెరువులను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ ప్రాజెక్టుకు సాంకేతిక సలహాదారుడిగానూ వ్యవహరిస్తున్నారు. 43 ఏళ్ల ఆనంద్‌.. తాను సాధించిన అసాధారణ విజయాలు.. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి అనేక అంశాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.


  • ఐటీ ఉద్యోగం వదిలి చెరువుల వైపు ప్రయాణానికి కారణం?

2016 వరకు చెరువుల స్వచ్ఛత గురించి ఎలాంటి ఆలోచనా లేదు. నేను పుట్టి పెరిగిందంతా కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల్‌ జిల్లా. రాజధాని బెంగళూరుకు 450 కి.మీ. దూరంలో ఉంది. నిజాం కాలంలో హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగానే ఉండేది. బాల్యమంతా అక్కడి చెరువుల్లోనే గడిచింది. బెంగళూరు జీరో వాటర్‌ సిటీగా మారుతోందన్న ఓ వార్త 2016లో నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. 2030నాటికి దేశంలోని 21 నగరాల్లో ఇదే సమస్య రాబోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. వర్షాకాలం నీటిలో పదోవంతు సంరక్షించినా ఏడాదంతా పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుంది. కర్ణాటకలో సరిపడా వర్షపాతం కూడా నమోదవుతోంది. అయినా బెంగళూరుకు ఈ సమస్య ఎందుకున్న ప్రశ్న నన్ను తీవ్రంగా కలచివేసింది. దీంతో బెంగళూరులోని పలు చెరువులను పరిశీలించా. కబ్జాలు, ఆక్రమణలు, మురికినీరంతా చెరువుల్లోకి మళ్లించడం, వర్షపు నీరు రాకుండా అడ్డుకోవడం లాంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించా. క్యాలసనహళ్లి చెరువును బాగు చేయాలని నిర్ణయించా. నేను పనిచేస్తున్న కంపెనీని సంప్రదించగా సీఎ్‌సఆర్‌ నిధుల నుంచి రూ.95 లక్షలు అందించారు. సిమెంట్‌, స్టీల్‌, కాంక్రీట్‌ వాడకుండా పూర్తిగా సహజమైన పద్ధతిలో 45 రోజుల్లో 36ఎకరాల మురికి చెరువును స్వచ్ఛమైన నీటి చెరువుగా మార్చా. ఆ ఉత్సాహంతో బెంగళూరులోని మరో మూడు చెరువుల్లో మార్పు తెచ్చా. ఒకప్పుడు బెంగళూరు, పరిసరాల్లో 1850 చెరువులుండగా.. ఇప్పుడు400 మాత్రమే ఉన్నాయి. ఉన్న వాటినైనా సంరక్షించి సహజ నీటి వనరులుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉద్యోగం వదిలి 2019లో మల్లిగావడ్‌ ఫౌండేషన్‌ ప్రారంభించా. బెంగళూరులో 35 చెరువుల్ని బాగుచేశా. హైదరాబాద్‌లో చందానగర్‌లోని 5 ఎకరాల భక్షికుంట, మియాపూర్‌ దీప్తిశ్రీనగర్‌లోని 18 ఎకరాల రేగులకుంట చెరువులతోపాటు వివిధ రాష్ట్రాల్లో 115చెరువులను స్వచ్ఛ తటాకాలుగా మార్చాం.


  • మురికి నుంచి స్వచ్ఛ చెరువుగా ఎలా అభివృద్ధి చేస్తారు?

నేను కొత్తగా కనుగొన్న విధానమేమీ లేదు. చెరువులకు వర్షపు నీరే ప్రధాన ఆధారం. చెరువు కలుషితమైతే భూగర్భ జలాలూ కలుషితమవుతాయి. వర్షపు నీరు చెరువులోకి చేరేందుకు గతంలో ప్రత్యేక కాలువలు ఉండేవి. వాటిని కబ్జా చేయడంతో వర్షాలు పడుతున్నా చెరువుల్లోకి నీరు చేరట్లేదు. మరోవైపు మురుగును చెరువుల్లోకి మళ్లిస్తున్నారు. ఇది జల, వాయు కాలుష్యానికి దారితీస్తోంది. చెరువులోకి మురుగునీరు చేరకుండా కట్టడి చేయడం, వర్షపు నీటిని మళ్లించడంపైనే ప్రధానంగా దృష్టి పెడతా. పూడికతీత, పిచ్చిమొక్కల తొలగింపు తర్వాత ప్రక్రియలో భాగం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎకరానికి రూ.7-10 లక్షల ఖర్చు అవుతుంది. నగరాల్లో అయితే రూ.17-20 లక్షల వరకు అవుతుంది. శుద్ధి చేసిన చెరువులో క్రమంగా నీటి నాణ్యతతోపాటు భూగర్భ జలాలు పెరుగుతూనే ఉంటాయి. వాయు కాలుష్యం తగ్గుతుంది. జీవ వైవిధ్యం పెరుగుతుంది. ప్రజలకు ఆరోగ్యకరమైన గాలి లభిస్తుంది.


  • అక్రమాల తొలగింపుతో అక్కడి పేదలకు న్యాయం చేసేదెలా?

ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాల్‌ ఇదే. అనేక చోట్ల అధికార పార్టీ నేతలే చెరువులను ఆక్రమిస్తున్నారు. నగరాల్లో భూముల ధరలు పెరగడంతో బిల్డర్లు, భూ మాఫియాకు చెరువులే వనరులుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెరువుల ఆక్రమణల తొలగింపునకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా లాంటి ప్రత్యేక వ్యవస్థను తీసుకురావడం అభినందనీయం. చెరువుల్లో ఆక్రమణల తొలగింపు ఎంత ముఖ్యమో, అనేక సంవత్సరాలుగా అక్కడుంటున్న పేదలకు పునరావాసం కూడా అంతే ముఖ్యం కావాలి. నిరుపేదలకు పీఎంఏవై లాంటి కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకం, ఇందిరమ్మ లాంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ఇళ్లు అందించాలి. చెరువుల్లో కబ్జాలను ప్రోత్సహిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపాలి. ఆక్రమణదారులను కనికరిస్తే మొత్తం సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.


  • ప్రభుత్వం‌తో భాగస్వామ్యం ఎలా ?

హైదరాబాద్‌తో ఎప్పటి నుంచో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడి వాలంటీర్లతో కలిసి ఇప్పటికే రెండు చెరువుల్ని పునరుద్ద్ధరించాం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో వందలాది చెరువులున్నాయి. పునరుద్ధరణకు ప్రభుత్వం సహకారం కోరింది. ఇటీవలే హైడ్రా కమిషనర్‌ బెంగళూరులోని చెరువులను పరిశీలించారు. ఆయన ఆహ్వానంపై హైదరాబాద్‌ వచ్చా. మూడు రోజులుగా అనేక చెరువులను పరిశీలించా. ఇక్కడ మాకు 800 మంది వాలంటీర్లు ఉన్నారు. 2030 వరకు ఇక్కడ 50 చెరువులను స్వచ్ఛ చెరువులుగా మార్చాలని భావిస్తున్నాం. అలాగే మూసీ ప్రాజెక్టులోనూ ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తున్నా. మూసీలో రోజూ 1000 ఎంఎల్‌డీ మురుగు కలుస్తున్నట్లు తేలింది. హైదరాబాద్‌ పర్యావరణ పరిరక్షణకు మూసీ ప్రాజెక్టును పూర్తి చేయడం అత్యవసరం. దీంతో వాయు, జల కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచం ఆశ్చర్యపోయేలా హైదరాబాద్‌ మారు తుంది. చెరువుల పరిరక్షణకు హైడ్రాను ప్రారంభించడం, అంకితభావం గల సీనియర్‌ ఐపీఎస్‌ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించడం అభినందనీయం. సీఎం రేవంత్‌ నిర్ణయం దేశానికే ఆదర్శం. ఉత్తరప్రదేశ్‌తోపాటు 12 రాష్ట్రాలకు చెరువుల పరిరక్షణలో సలహాదారుగా ఉన్నా. హైడ్రా లాంటి వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని చెబుతున్నా. ఈ దిశగా యూపీ సీఎం యోగి ఆసక్తి చూపుతున్నారు. రేవంత్‌ నిజాయితీ నచ్చడంతోనే చెరువుల పరిరక్షణ, మూసీ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతున్నా.

Updated Date - Nov 21 , 2024 | 04:48 AM