KTR: మహిళలను గౌరవించే వ్యక్తిగా మాట దొర్లటంపై క్షమాపణ కోరా
ABN, Publish Date - Aug 24 , 2024 | 01:55 PM
మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ వివరణ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవే కానీ ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్: మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ వివరణ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవే కానీ ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళ కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యానన్నారు. తాను యథాలాపంగా మాట్లాడిన మాటల పట్ల విచారం వ్యక్తం చేశానని మహిళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా తాను మాట దొర్లటంపై క్షమాపణ అడిగానని పేర్కొన్నారు.
చట్టాన్ని గౌరవిస్తూ తాను కమిషన్ ముందుకు వస్తే.. మహిళ కాంగ్రెస్ నేతలు మా నాయకులపై దాడి చేశారని కేటీఆర్ తెలిపారు. తాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మేము వస్తే ఇలాంటి దాడి చేయటం సరికాదన్నారు. 8 నెలల్లో మహిళలపై జరిగిన సంఘటనలను వారికి వివరించే ప్రయత్నం చేశానని కేటీఆర్ తెలిపారు. వాటికి సంబంధించిన అన్ని వివరాలతో తాను వచ్చానన్నారు. మళ్లీ రావాలని కమిషన్ చెప్పారని... వారిని గౌరవిస్తూ మళ్లీ వస్తామన్నారు. కానీ తమ నాయకురాళ్లపై దాడి చేసిన ఘటన మంచిది కాదని కేటీఆర్ పేర్కొన్నారు. మా వాళ్లపై జరిగిన దాడిపై కూడా మహిళ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కమిషన్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
ఆగస్ట్ 15వ తేదీన తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో భాగంగా మహిళలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చేందుకు యత్నంగా అడ్డంగా బుక్కయ్యారు. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేసినా తాము ఏమంటామని అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి. కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ దిష్టి బొమ్మల దహనాలు చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు నోటీస్ ఇచ్చింది. దీంతో కేటీఆర్ ఇవాళ మహిళ కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన క్షమాపణ చెప్పారు. యథాలాపంగా అన్నవే తప్పా మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
Updated Date - Aug 24 , 2024 | 01:55 PM