BRS: కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై బీఆర్ఎస్ ఫైర్..
ABN, Publish Date - Aug 20 , 2024 | 12:59 PM
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఐదు నెలల క్రితం అరెస్ట్ అయ్యారు.
న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఐదు నెలల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెను బయటకు తీసుకు వచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ఢిల్లీకి వెళ్లి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. గత వాయిదా సమయంలోనే కవితకు బెయిల్ పక్కా అనుకున్నారు. కానీ అప్పట్లో దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలు కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయకపోవడంపై సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఇక ఇవాళ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది కానీ ఈడీ దాఖలు చేయలేదు. దీనిపై శుక్రవారం నాటి కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ నేతలు వచ్చారు. కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేజ్రీవాల్ సిసోడియాకే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిందని.. కవితకు మాత్రం బెయిల్ రాకపోవడంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కవిత ఉన్నారని.. ఆమె బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అకారణంగా కవితను 5 నెలలుగా జైల్లోనే ఉంచారన్నారు. వచ్చే మంగళవారం సుప్రీంకోర్టులో కచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందని ప్రశాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఐదు నెలలుగా తిహార్ జైలులోనే ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(క్రిమినల్) దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీంలో మరోసారి విచారణ జరిగింది. ఇవాళ కూడా కవితకు చుక్కెదురైంది. కవిత కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది కానీ ఈడీ మాత్రం కౌంటర్ దాఖలు చేయలేదు. కవితకు తప్పనిసరిగా ఇవాళ బెయిల్ వస్తుందని సుప్రీంకోర్టుకు పలువురు బీఆర్ఎస్ నేతలు వచ్చారు. కవితకు బెయిల్ పిటిషన్ కేసు వాయిదా పడటంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారం అంటే ఆగస్టు 27 కి వాయిదా వేసింది. శుక్రవారం నాటి కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - Aug 20 , 2024 | 12:59 PM