CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 16 , 2024 | 01:29 PM
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో.. మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో.. మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ గవర్నర్‌గా, కేటీఆర్ కేంద్రమంత్రిగా, హరీశ్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారని అన్నారు.
నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇస్తారని వ్యాఖ్యానించారు. ఇక హైడ్రా ద్వారా నిర్మితమైన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఎందులో ఎలాంటి రాజకీయాలూ లేవని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, హామీ చేసి చూపించామని అన్నారు. కాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర అధిష్టానం పెద్దలను కలుస్తానని చెప్పారు. ఈ మేరకు మీడియాతో చిట్‌చాట్‌లో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వర్గీకరణపై పార్టీ అగ్ర నాయకులు చెప్పిందే తాను చేశానని రేవంత్ రెడ్డి అన్నారు. వర్గీకరణపై తాము స్టాండ్ తీసుకున్నామని, దానికే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఈ అంశంపై రాజకీయంగా తనకు ఒక స్టాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాగా గురువారం రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీలో తాజా పరిణామాలు, నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్‌లో కొత్తవారికి చోటు కల్పించడం సహా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారని సమాచారం. మరోవైపు రైతు రుణమాఫీ అంశాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ వివరించనున్నారని తెలిసింది. మూడు విడతల్లో రైతులకు రుణమాఫి చేసిన విధానానికి సంబంధించిన అంశాలను వివరిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఫాక్స్ కాన్ చైర్మన్‌తో భేటీ
మరోవైపు.. రాజకీయ అంశాలతో పాటు తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్, సీఈవో యంగ్ లియూతో రేవంత్ ఇవాళ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్‌తో పాటు పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది.
Updated Date - Aug 16 , 2024 | 01:33 PM